
పెరంబూరు : నిర్మాత, నటుడు ఆర్‌కే.సురేశ్ నటి దివ్యను వివాహమాడనున్నారు. సలీమ్, ధర్మదురై, అట్టి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్‌కే.సురేశ్ తారైతప్పట్టై చిత్రం ద్వారా నటుడిగా అవతారమెత్తారు. ఆ చిత్రంలో విలన్‌గా రాణించిన ఈయన ఆ తరువాత మరుదు చిత్రాల్లో నటించి తాజాగా హీరోగా మారి తనీముఖం, బిల్లాపాండి, వేట్టైనాయ్ చిత్రాల్లో నటిస్తున్నారు. అదే విధంగా మెగా సీరియల్ సుమంగళితో నాయకిగా ప్రాచుర్యం పొందిన నటి దివ్య, లక్ష్మీవందాచ్చి సీరియళ్లలోనూ నటించారు.
ఆర్‌కే.సురేశ్, దివ్యల వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ కాబోయే దంపతులు శనివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. తమది పెద్దల నిశ్చయించిన పెళ్లి అని, దివ్యను వివాహహమాడడం సంతోషంగా ఉందని సురేశ్ తెలిపారు. ప్రస్తుతం నటుడు శరత్‌కుమార్‌కు జంటగా అడంగాదే చిత్రంలో నటిస్తున్నానని, వివాహనంతరం నటనకు స్వస్తి చెప్పనున్నట్లు దివ్య వెల్లడించారు.