బావిలో కప్పలైపోతున్నాం!

బావిలో కప్పలైపోతున్నాం! - Sakshi


- పవన్ కల్యాణ్

హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లో పవన్‌కల్యాణ్ ఆఫీస్. ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం ముందు హాలులో మీడియా ప్రతినిధులు వెయిటింగ్. వెయిటింగ్ హాలు దాటి ఆ డూప్లెక్స్ హౌస్‌లో లోపలికి వెళితే, ఒక చిన్న టేబుల్ మీద చాలా తెలుగు, ఇంగ్లీషు దినపత్రికలు... ఆ పక్కనే పుస్తకాల బీరువా. పక్కనే ఉన్న చిన్నగదిలో బల్లపై విశ్వనాథ సత్యనారాయణ ‘హాహా హూహూ’, గుంటూరు శేషేంద్ర శర్మ ‘ఆధునిక మహాభారతం’, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’, హిందీ, ఇంగ్లీష్ సాహిత్య రచనలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.



సోఫాలో పవన్ కల్యాణ్. నిర్మాత, చిరకాల మిత్రుడైన శరత్‌మరార్‌తో మంతనాలాడుతున్నారు.
కోట్ల ఖర్చు, వంద కోట్ల వ్యాపారం చేసిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను ఆఘమేఘాల మీద పూర్తి చేసి, అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేసిన పవన్ అనేక నెలల కష్టం నుంచి కాస్తంత సేద తీరుతున్నారు. ఓపెనింగ్స్‌తో సంచలనం సృష్టిస్తున్న ‘సర్దార్...’ గురించి ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ముఖ్యాంశాలు...

 

కంగ్రాట్స్ అండీ! చాలా రోజుల తర్వాత మళ్ళీ తెర మీదకొచ్చారు!

థ్యాంక్స్. కొన్ని నెలలుగా పడ్డ కష్టం తెర మీదకొచ్చేసింది.

 

తెరపై మీ గుర్రపుస్వారీ అదీ చూస్తే, బాగా చేయి తిరిగినట్లుంది!

(నవ్వేస్తూ...) నిజానికి, నాకు గుర్రపుస్వారీ రాదు. ఎప్పుడూ నేర్చుకోలేదు. ‘గబ్బర్ సింగ్’ టైమ్‌లో తొలి సారిగా గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. కింద పడి, తల పగిలితే ఏమిట్రా బాబూ అని కొద్దిగా భయం వేసిందంటే నమ్మండి. అప్పుడు నేను గుర్రం దగ్గరకెళ్ళి దానితో మాట్లాడా. (నవ్వులు..) నాకు గుర్రపుస్వారీ రాదని, సహకరించమని చెప్పుకున్నా. నా కమ్యూనికేషన్ ఏమర్థమైందో ఏమో గుర్రం సహకరించింది. ఒకసారి జీను పెకైక్కి కూర్చున్నాక, నాకు తెలియకుండానే పట్టు దొరికింది. అంతే! ఇక, ‘సర్దార్ గబ్బర్ సింగ్’కి నాకు అలవాటై పోయింది. ముఖ్యంగా ఈ సిన్మాకు వేసిన సువిశాలమైన రతన్‌పూర్ సెట్ ప్రాంగణంలో అటూ, ఇటూ తిరగడానికి గుర్రమే వాడా. షాట్‌కీ, షాట్‌కీ మధ్య గ్యాప్‌లో రోజుకు అయిదారు సార్లు గుర్రపు స్వారీ చేశా! నాతో పోలిస్తే, అన్నయ్య (చిరంజీవి) అవలీలగా, స్వారీ చేస్తారు. ఆయనకు బాగా వచ్చు. నేను బాగా వచ్చినట్లు నటించాను (నవ్వులు).

 

జీవితంలోనూ, తెర మీదా తుపాకీలకూ, మీకూ అవినాభావ సంబంధంలా ఉందే!

గన్స్... (క్షణమాగి, నవ్వుతూనే...). నేను మొదట ఏమని ఆలోచిస్తానంటే, మనం పని చేస్తున్న విషయం ప్రామాణికంగా ఉండాలనుకుంటా. అందుకనే, ఈ సినిమాలో వాడిన గన్స్ అన్నీ నిజమైన రక రకాల గన్స్ తాలూకు నమూనాలుగా చేయించా. ‘మద్రాస్ రైఫిల్ క్లబ్’లో మెంబర్‌ని. అక్కడి నా పరిచయాలన్నీ వాడుకొని, వాళ్ళ సలహా సూచనలతో ఆ నమూనాలు చేశాం. బేసిక్‌గా మొక్కలు, తుపాకులు బాగా ఇష్టం.

 

ఎర్ర తుండు వేసుకున్నారు. మొక్కలు... తుపాకులా? లేక అడవులు... తుపాకులా?

(నవ్వేస్తూ) ఇప్పటికైతే మొక్కలు, తుపాకులే!

 

మార్షల్‌ఆర్ట్స్‌పై మీ ప్రేమను క్లైమాక్స్‌లో చూపినట్లున్నారు!

అవునండీ! క్లైమాక్స్‌లో విలన్‌తో చేసే ఫైట్‌లో ఫిలిప్పైన్స్‌కు చెందిన మార్షల్ ఆర్ట్ ‘ఎస్‌క్రిమా’ వాడాను. అలాగే, మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ పెంపొందించిన చైనీస్ తరహా కుంగ్‌ఫూ ‘జీత్ కునే డో’ కూడా! ఇవన్నీ ‘జానీ’ సినిమా టైమ్‌లో నేర్చుకున్నా. ప్రత్యర్థిని బ్లాక్ చేయడం, పంచ్ కొట్టడం - రెంటికీ పెద్ద గ్యాప్ ఉండదు.