
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత నటనకు దూరమయ్యారు. పూర్తి రాజకీయాలకే సమయం కేటాయించటంతో ఇక వెండితెర మీద కనిపించటం అసాధ్యం అన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తలు పవన్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. పవన్ త్వరలో ఓ సినిమాలో నటించేందుకు సూచన ప్రాయంగా అంగీకరించారట.
అధికారిక సమాచారం లేకపోయినా పవన్ ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పారన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. పవన్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త‍్వరలో హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. పవన్‌తో గోపాల గోపాల కాటమరాయుడు సినిమాలను తెరకెక్కించిన డాలీ (కిశోర్ పార్థసాని) దర‍్శకత్వంలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత రామ్ తళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం పవన్ సంప్రదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మేనల్లుడి కోసమనే కాకుండా దర్శకుడు డాలీ, నిర్మాత రామ్ తళ్లూరిలతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటించేందుకు పవన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ గాని, పవన్ సన్నిహితులు గాని ఎలాంటి ప్రకటనా చేయలేదు.