ప్యారిజాతం

October movie review: Varun Dhawan powers  - Sakshi

మల్టీప్లెక్స్‌ మూవీ

తారాగణం: వరుణ్‌ ధావన్, బన్నితా సాందు, గీతాంజలి రావ్‌ తదితరులు 
రచన: జూహీ చతుర్వేది, కెమెరా: అవిక్‌ ముఖోపాధ్యాయ, సంగీతం: శాంతను మొయిత్రా, నిర్మాతలు: రోనీ లహరి, షీల్‌ కుమార్‌

సినిమా చూడటానికి వెళ్లి కావ్యాన్ని దర్శించి వచ్చాను. ఈ మధ్యలో చూసిన లవ్‌ స్టోరీస్‌లో నాకు బాగా నచ్చిన లవ్‌ స్టోరీ ‘అక్టోబర్‌’.థియేటర్‌లో కూర్చున్నాను కానీ... తెరలో భాగమయిపోయాను. ఈ కావ్యంలో ఒక్క పాట కూడా లేదు.. అంతా కావ్యమే. చాలా వరకు... మౌనంగా సాగిన గేయమే. ఏదో నా వాళ్లకు అయిన గాయంలా అనిపించి కళ్లు మాటిమాటికి చెమర్చాయి. ప్రేమ అన్న మాటలేదు...
ప్రేమ అన్న ప్రతిమ లేదు..ప్రేమ అన్న ఊసు లేదు..కానీ అంతా ప్రేమే!కెమెరా ఊరికే కదలదు..పాత్రలు అలజడిగా కదలవు...కథ తొందరపడి కదలదు. కదలిక లేకుండా మనస్సును కదిలించే ఎనర్జీ ఏదో మనలను ఆవహిస్తుంది...అందరూ సహజంగా అనిపిస్తారు..అసహజంగా మన మీద పట్టు బిగిస్తారు..సూజిత్‌ సర్కార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా... మీ జీవితంలో కూడా ఒక చిన్న చోటు సంపాదించాలని అనుకుంటూ... ఆశిస్తూ.. ఇదిగో సినిమా కథ..ఇరవై ఏళ్ల వరుణ్‌ ధావన్‌ (డ్యాన్‌) బన్నితా సాందు (శియిలి) ఇద్దరూ ఒక ఫైవ్‌ స్టార్‌ హోటల్లో ట్రెయినీస్‌గా పని చేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్యలో గొప్ప రిలేషన్‌షిప్‌ ఏమీ ఉండదు. ఎదురు పడితే మాట్లాడటం తప్ప. కానీ డ్యాన్‌ అమాయకత్వంలో ఉండే చంచలత్వం ఎవరూ తప్పించుకోలేరు... శియిలీ కూడా!

డిసెంబర్‌ చివరి రోజున డ్యాన్‌ తన తల్లిదండ్రుల మ్యారేజ్‌ సిల్వర్‌ జూబ్లీ యానివర్సరీకి ఊరెళతాడు. ఆ రోజు హోటల్లో పనులన్నీ పూర్తి చేసుకుని స్టాఫ్‌ అంతా హోటల్‌ మిద్దె మీద న్యూ ఇయర్‌ పార్టీ చేసుకుంటారు. ఎందుకో శియిలీకి డ్యాన్‌ గుర్తుకొస్తాడు... ‘తనెక్కడా?!’ అని అడుగుతూ పిట్టగోడ మీద కూర్చోబోతున్న శియిలీ జారి కిందపడిపోతుంది. డ్యాన్‌ వచ్చేటప్పటికి శియిలీ కోమాలో హాస్పిటల్లో ఉంటుంది. అందరు స్నేహితులలాగే డ్యాన్‌ కూడా శియిలీని చూడటానికి వెళతాడు. అక్కడ తనకు తెలుస్తుంది, చివరిగా ‘డ్యాన్‌ ఎక్కడున్నాడు?’ అని శియిలీ అడిగిందని. తను నన్నే ఎందుకడిగింది.. అవే కదా తన చివరి మాటలు... అని తెగ ఆలోచిస్తాడు డ్యాన్‌. ఇక అప్పటినుంచి హాస్పిటల్‌కి రోజూ వెళ్లి కోమాలో ఉన్న శియిలీతో ప్రేమ పెంచుకుంటాడు. స్నేహితులందరూ చెబుతారు శియిలీకి తన పట్ల అలాంటి ఫీలింగ్స్‌ ఏవీ లేవని... కానీ డ్యాన్‌ నమ్మడు... ఏదో తెలియని బంధం తనని శియిలీకి చాలా దగ్గర చేసేస్తుంది... శియిలీ కుటుంబం కూడా డ్యాన్‌ని చాలా ఇష్టపడతారు... హాస్పిటల్‌ క్యారిడార్‌లో... కుర్చీలలో... ఎక్కడ పడితే అక్కడ డ్యాన్‌ తన ప్రేమకోసం అలసి కూలబడుతూ ఉంటాడు. ఇలా హాస్పిటల్‌లో ఎక్కువ సమయం ఉండడం వల్ల ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ట్రెయినీగా పని చేస్తున్న వాళ్లు డ్యూటీ సరిగా చెయ్యకపోతే డిగ్రీ రాకపోవడమే కాకుండా మూడు లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. 

డ్యాన్‌ వాళ్ల అమ్మ వచ్చి అడుగుతుంది ‘‘ఆ అమ్మాయి నీ గాళ్‌ ఫ్రెండా’’అని. మౌనంగా ఉండిపోతాడు డ్యాన్‌. శియిలి అంటే బెంగాలీలో పారిజాతపు పువ్వు. శియిలి కేరళ నుంచి వచ్చినా.. చిన్నప్పటినుంచి ఢిల్లీలో తన తాతతో రాత్రి రాలి పడే పారిజాత పుష్పాలను ఒక దుప్పటిలో పట్టుకోవడం.. వాటి సువాసనను చాలా ఇష్టపడడం గమనించి తన పేరు శియిలీగా మారుస్తారు. ఒకరోజు డ్యాన్‌ పారిజాతం పూలను తెచ్చి శియిలీ ఉన్న గదిలో పెడతాడు. ఎన్నో నెలలుగా కోమాలో ఉన్న శియిలి మొదటిసారి ఆ పూల సువాసనకు స్పందిస్తుంది... అప్పటినుంచి కళ్లతో కొంచెం కొంచెం మాట్లాడుతుంది. శియిలి తల్లిగారు (గీతాంజలి రావ్‌), డ్యాన్‌ని వెళ్లి తన కెరీర్‌ను కాపాడుకోమని మృదువుగా మందలించి పంపించేస్తుంది. డ్యాన్‌ కులు మనాలిలో ఒక రిసార్ట్‌లో పని చేస్తుంటాడు. విచిత్రంగా డ్యాన్‌ లేని సమయంలో శియిలి ఆరోగ్యం క్షీణిస్తుంది. డ్యాన్‌ కెరీర్‌ వదులుకుని వెనక్కి వచ్చేస్తాడు. కొద్దిరోజుల్లోనే శియిలి హఠాత్తుగా చని పోతుంది. ‘పారిజాతం పువ్వు లాగే తొందరగా రాలిపోయింది..!’ అని డ్యాన్‌ గీతాంజలికి చెబుతాడు. డ్యాన్‌ మళ్లీ తన కెరీర్‌ వైపు మళ్లుతాడు. గీతాంజలి కేరళకి వెళ్లిపోతూ పారిజాతం చెట్టును డ్యాన్‌కి ఇస్తుంది.  ఈ సినిమా ప్రస్తుతం థియేటర్‌లో ఆడుతుంది. కొద్దిరోజుల్లో అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేస్తుంది. ఇంకొన్ని రోజుల్లో మీ టీవీలోకే వచ్చేస్తుంది.
∙ప్రియదర్శిని రామ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top