మామ మంచు... అల్లుడు కనకం | mohan babu sakshi special interviwe | Sakshi
Sakshi News home page

మామ మంచు... అల్లుడు కనకం

Dec 20 2015 2:41 AM | Updated on Sep 3 2017 2:15 PM

మామ మంచు... అల్లుడు కనకం

మామ మంచు... అల్లుడు కనకం

సినిమా టైటిల్... ‘మామ మంచు - అల్లుడు కంచు’. నిజ జీవితంలో... మామ మంచు. కానీ, అల్లుడు కంచు కాదు కనకం!! అంటే... ‘ఆండీ’ బంగారం అండీ!

సినిమా టైటిల్... ‘మామ మంచు - అల్లుడు కంచు’. నిజ జీవితంలో... మామ మంచు. కానీ, అల్లుడు కంచు కాదు కనకం!! అంటే... ‘ఆండీ’ బంగారం అండీ!
 
రానున్న మీ సినిమా పేరు ‘మామ మంచు - అల్లుడు కంచు’. కానీ, బయట అనుకొనేదాన్ని బట్టి - నిజజీవితంలో మామే కంచు... అల్లుడు మంచేమో!
 మామ మోహన్‌బాబు: (నవ్వేస్తూ...) బయట అనుకోవడానికేముంది? ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటారు. నేను ‘కంచు’ అవునో కాదో కానీ, మా అల్లుడు ఆండీ (ఆనంద్ శ్రీనివాసన్) మాత్రం మంచు! డైనమిక్. సహనం కోల్పోడు. మా అమ్మాయి మూలంగా మంచి అల్లుడు దొరికాడు.
 అల్లుడు ఆండీ: బయట అంకుల్ (మోహన్‌బాబు) గట్టి మనిషి. ఆవేశమనుకుంటారు కానీ, ఆయన మనసు, ప్రేమ మాకు తెలుసు.

ఆండీ! మీరు మీ మామగారిని తొలిసారిగా ఎప్పుడు కలిశారో గుర్తుందా?
ఆండీ:
అంకుల్, ఆంటీల వెడ్డింగ్ యానివర్సరీ లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. అక్కడ పార్టీలో అంకుల్‌ను చూశా. విష్ణు పరిచయం చేశాడు.  

►  మంచు కుటుంబంతో అసలు మీకు అనుబంధం ఎలా మొదలైంది?

 ఆండీ: మాది తమిళ అయ్యంగార్ బ్రాహ్మణుల కుటుంబం. అమ్మ నాన్న, నేను, తమ్ముడు - అందరం చెన్నైలో ఉండేవాళ్ళం. కామన్ ఫ్రెండ్ ద్వారా లక్ష్మీప్రసన్నతో పరిచయమైంది. పరిచయం స్నేహమైంది. విష్ణుతో కలసి కొన్నాళ్ళు ‘క్లోజ్ క్యాప్షనింగ్’ (సినిమాల సబ్ టైటిలింగ్) చేశా.

  మీరు ఏం చదువుకున్నారో చెప్పనే లేదు!
 ఆండీ: గుజరాత్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. విదేశాల్లో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ చేశా. అమెరికాలోని టెక్సస్‌లో రెండు, మూడేళ్ళు ఉద్యోగం చేశా. తరువాత డల్లాస్‌లో, లాస్ ఏంజెల్స్‌లో ‘థింక్ స్మార్ట్ ఎఫ్.ఎక్స్’ పేరిట సంస్థ పెట్టా. ఇప్పటికీ నడుపుతున్నా. లక్ష్మిని చూశాక ఆమే నా జీవితం అనిపించింది. ఆమెను ఒప్పించి, అంకుల్‌తో మాట్లాడా.

మోహన్‌బాబంటే అందరూ భయపడతారు. ఆయన్ని ఎలా ఒప్పించారు?
 ఆండీ: మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి! ఉన్న విషయం చెప్పేశా! నాతో చాలాసేపు మాట్లాడారు. అంతా విని, మర్నాడు కలుద్దామన్నారు. నాకు ఆ రాత్రి టెన్షన్. మరునాడు ఓకె అన్నారు.  

  మొత్తానికి, ‘మంచు’ వారు చాలా పరీక్షలు పెట్టి, అల్లుణ్ణి ఎంచుకున్నారు!
 మోహన్‌బాబు: (నవ్వేస్తూ...) ఎవరైనా సరే పిల్లను ఇచ్చే ముందు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. చూసుకోవాలి. అయితే, పెళ్ళిళ్ళయినా, సినిమాల రిజల్టయినా మన చేతుల్లో ఉండదు. దైవమూ అనుకూలించాలి.

  మరి, మీ భాష, ప్రాంతం, కులం - ఏదీ కాని వియ్యంకులతో ఎలా?
 మోహన్‌బాబు: వాళ్ళు లవ్లీ పీపుల్. ఉల్లిపాయ కూడా తినని సదా చార సంపన్నులు. నేనెప్పుడూ డబ్బు చూడను. క్యారెక్టర్ చూస్తా. అది ఉంటే అన్నీ సాధించవచ్చు. మా కుటుంబాలూ బాగా కలిసిపోయాయి.

  వరకట్నం ఎంత ఇచ్చారేమిటి?
 మోహన్‌బాబు: ఉయ్ హేట్ డౌరీ. బయట ఏదో అనుకుంటారు కానీ, నేను మా అల్లుడికివ్వలేదు. అబ్బాయిలకీ తీసుకోలేదు. అందరికీ తెలుసు.  

   కానీ, అమెరికాలో స్థిరపడాలనుకున్న అల్లుణ్ణి ఇండియాకు రప్పించగలిగారే?
 మోహన్‌బాబు: (నవ్వేస్తూ...) లక్ష్మీప్రసన్నతో పాటు అమెరికాలోనే ఉండాలని ఆండీ అనుకున్నాడు. మా అమ్మాయి అక్కడ నటించింది. మా విష్ణు ఏం మాయ చేశాడో, బావను ఒప్పించి, ఇండియాకి రప్పించాడు.
 ఆండీ: లక్ష్మి కోసం, ఆమె కెరీర్, సంతోషం కోసం ఇండియాకొచ్చేశా. కాకపోతే ఇప్పటికీ అమెరికాలో మా కంపెనీ ఉంది. తమ్ముడక్కడే ఉంటాడు. హ్యూస్టన్‌లో మా ఇల్లుంది. అమెరికా వెళితే, అక్కడుంటాం.

   ఇండియాకు ఎప్పుడొచ్చారో గుర్తుందా?
 ఆండీ: 2013 అక్టోబర్ 8 తెల్లవారుజామున 2.35కు ల్యాండ్ అయ్యా.
 మోహన్‌బాబు: భార్యని వెతుక్కుంటూ వచ్చేశాడు (నవ్వు). ఆండీని అల్లుడనుకోను. మా అబ్బాయనుకుంటా. విష్ణు, మనోజ్‌లతో కలిపి ముగ్గురు కొడుకులు! కోడళ్ళు విన్నీ, ప్రణతితో కలిపి ముగ్గురు కూతుళ్ళు!
 ఆండీ: అవును. ‘హి ఆల్వేస్ కాల్స్ మి సన్’. అంకుల్ కూడా మా నాన్న గారిలానే చాలా సింపుల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్. మా నాన్న గారి నుంచి నేర్చుకున్న దాని కన్నా ఇంకా ఎక్కువ అంకుల్ నుంచి తెలుసుకున్నా.  

   మనలోని కొన్ని.. పిల్లలకి రాకూడదనుకుంటాం. అలా లక్ష్మిలో అనుకొన్నవి?
 మోహన్‌బాబు: నా పెద్ద బలహీనత కోపం. నా కోపం, ఆవేశం నాకే ఎక్కువ నష్టం కలిగించాయి. లక్ష్మి నాలాగే ముక్కుసూటి, ముక్కోపి. అందుకే, లక్ష్మిని ఆ లక్షణాలు మార్చుకోమంటూ ఉంటా.
 ఆండీ: నేనైతే, లక్ష్మీ ప్రసన్నలో మార్చుకోవాల్సిందేమీ లేదంటాను. ఆ ఆవేశం, ముక్కుసూటితనం కావాల్సిందే. కోపం కూడా అందం అంటా.  
 మోహన్‌బాబు: మా అమ్మాయికి ఆవేశం ఉంది. అల్లుడికది లేదు... ఆలోచన ఉంది. అందుకే, వాళ్ళిద్దరికీ సరిపోయింది. అదే నా లాంటి కోపధారి భర్త దొరికితే, లక్ష్మీప్రసన్న రెండోరోజే పెళ్ళి వద్దనుకొనేది. ఏదో నా భార్య కాబట్టి నన్ను తట్టుకొని, కాపురం చేస్తోంది (నవ్వులు...).

   అమ్మాయి డామినేటింగైనప్పుడు, టిప్స్ అల్లుడికి చెప్పాలిగా?
 మోహన్‌బాబు: టిప్స్ అని కాదు కానీ, ఏ మామా చెప్పని విషయం నేను మా అల్లుడికి చెబుతుంటా. మా అమ్మాయి చెప్పినదాని కల్లా సరే అనకంటూ ఉంటా. నువ్వే డామినేట్ చెయ్యి అని చెబుతుంటా (నవ్వు).

   అద్దె గర్భంతో బిడ్డను పొందాలని వాళ్ళనుకున్నప్పుడు మీ స్పందన?
 మోహన్‌బాబు: వాళ్ళు మాకు చెప్పే చేశారు. కాకపోతే, సరొగసీ (అద్దె గర్భం) అనే వ్యక్తిగతమైన ఆ సంగతిని బాహాటంగా చెప్పడం నాకిష్టం లేదు. ‘తప్పేమీ చేయడం లేదుగా’ అని లక్ష్మి ఒప్పించింది. ఐ ఫెల్ట్ ప్రౌడ్.

   ‘విద్యా నిర్వాణ మంచు ఆనంద్’ పుట్టాక మీలో వచ్చిన మార్పు?
 ఆండీ: భార్యాభర్తలం ఇంకా దగ్గరయ్యాం. ఇక, పాప పుడుతుంద నగా మా కన్నా ముందే అక్కడకెళ్ళి ఆశ్చర్యం కలిగించిన ప్రేమ ఆయనది.

మరి, పిల్లల మీద ప్రేమ, ఆప్యాయత విషయం?
 ఆండీ: పిల్లల మీద అంకుల్‌కున్నంత ప్రేమ మాకూ లేదేమో అనిపిస్తుంది. లక్ష్మివాళ్ళ చిన్నప్పుడు సింగపూర్ నుంచి కోకాకోలా క్యాన్‌‌స తెప్పించేవారట! ఫిల్మ్‌నగర్‌లో తక్కువ ఇళ్ళున్న ఆ రోజుల్లో లక్ష్మి బయట జాగింగ్ చేస్తుంటే, బాల్కనీలో నుంచే చూస్తూ, ఆమె రక్షణ చూసేవారట!  

  సమాజ దుష్ర్పభావాలు ఆడపిల్లపైనా తప్పవు. అప్పుడేం చేసేవారు?
 మోహన్‌బాబు: ‘మీ నీడను కూడా మీరు నమ్మకండి’ అని మంచి చెడ్డలు చెబుతుండేవాణ్ణి. పైగా, సమాజంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే నరరూప రాక్షసులెక్కువయ్యారు. వాళ్ళని కాల్చిపారేయాలి. పిల్లల్లో లక్ష్మీప్రసన్న అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అబ్బాయిలెలాగైనా బతికే స్తారు. కానీ ఆడపిల్లెలా బతుకుతుంది! నాలుగుడబ్బులు సంపాదించు కొంటే బాగుండనిపిస్తుంది. ప్రాణమున్నంతవరకు తండ్రిగా నాకదే బాధ.

  మోహన్‌బాబు గారి మాట పిల్లలు జవదాటరు. ఏం చెబుతుంటారు?
 మోహన్‌బాబు: ఎలా కష్టపడి పైకొచ్చానో చెప్పా. వ్యసనాలతో ఎలా నష్టపోతామో చెప్పా. నీతి, న్యాయంగా బతకండని చెబుతుంటా. అంతే!

  ఆండీ! మీ మామ గారిని చూసి మీరు మార్చుకున్న గుణాలు?
 ఆండీ: ఆయన నుంచి హార్డ్‌వర్క్ అలవాటు చేసుకున్నా. ఒకప్పుడు ‘సెల్ఫ్ పిటీ’ ఉండేది. కానీ, అంకుల్‌ని చూసి మారాను.

  మరి, అంతటి ‘మంచు’ వారి లెగసీ నిలబెట్టడానికి ఏం చేస్తున్నారు?
 ఆండీ: మాజీ ఎంపీ, విద్యావేత్త, దాతైన అంకుల్ లెగసీ సామాన్యం కాదు. ‘పెదరాయుడు’లో రజనీకాంత్ లాంటి వ్యక్తి. హి ఈజ్ ఓపెన్ బుక్.

ఇంట్లో ‘పెదరాయుడు’ పాత్ర పోషిస్తూ, తీర్పులు చెబుతుంటారా?
 మోహన్‌బాబు: ఎవరి ఇంట్లోనైనా పెద్దవాళ్ళుంటే, వాళ్ళ మాట మీద నడుస్తాం. మా ఇంట్లో అయినా అంతే. అయినా, ఆలుమగలన్నాక చిరు కోపాలు రావాల్సిందే. కానీ ఆ క్షణానికి రావాలి, పోవాలి.

  వృత్తి, వ్యాపారాల్లో అల్లుడికి సలహాలు ఏమైనా ఇస్తుంటారా?
 ఆండీ: ఇన్నేళ్ళ అనుభవం ఉన్న పెద్దాయన పక్కనే ఉన్నప్పుడు సలహాలు, సూచనలడగకపోతే, మన అంతటి మూర్ఖుడు ఉండడు!

  మీ మామ గారి సినిమాలు చూస్తుంటారా?
ఆండీ: ‘సర్దార్ పాపారాయుడు’లో బ్రిటీషర్‌గా ఆయన వేషం, ఆ డైలాగ్స్ ఇష్టం. అలాగే, ‘పెదరాయుడు’, ‘రాయలసీమ రామన్నచౌదరి’. ‘మామ మంచు - అల్లుడు కంచు’ పోస్ట్‌ప్రొడక్షన్‌లో కొంత చూశా. హిలేరి యస్‌గా ఉంటుంది. అయామ్ స్లోలీ బికమింగ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్.

  మామ గారి నటన గమనించాక, ఒక ప్రేక్షకుడిగా మీ అభిప్రాయం?
 ఆండీ: ఎంత పెద్ద యాక్టరైనా సరే, ఏ పాత్ర చేస్తున్నా తన సహజమైన మ్యానరిజమ్స్‌లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఏ పాత్రకు ఆ పాత్ర చేయడం కష్టం. ఉత్తమ నటుడిగా 3 ఆస్కార్లందుకున్న హాలీవుడ్ యాక్టర్ డేనియల్ డే-లూయీస్‌లో అది చూశా. మళ్ళీ అంకుల్‌లో చూశా.

అల్లుడికి  విశ్లేషణ, ఒడ్డూ పొడుగూ ఉన్నాయి. నటనలోకి దింపవచ్చుగా?
 మోహన్‌బాబు: (నవ్వేస్తూ...) హైదరాబాద్‌లో ‘శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్’ నిర్వహణ మొత్తం ఆయనే చూస్తున్నారు. వ్యాపా రాలు చూసుకుంటున్నారు. ఆయన పని ఆయనను చేసుకోనివ్వండి.

  ‘మోహన్‌బాబు అల్లుడు’, ‘లక్ష్మీప్రసన్న మొగుడు’ కాకుండా, మీకంటూ గుర్తింపు కోసం, మీదైన స్వతంత్రమైన స్పేస్ కోసం తపిస్తుంటారా?
 ఆండీ: నేను నా లాగా బతికే స్పేస్ నాకుంది. మీ కళ్ళలో నుంచి చూస్తూ, మీరనుకున్నట్లు ‘మీ వెర్షన్ ఆఫ్ లైఫ్’ను బతకదలచుకోలేదు.
 మోహన్‌బాబు: నేను, లక్ష్మి నటులం కాకపోతే, ఇంత పేరు లేకపోతే, ‘ఫలానా ఆండీ వాళ్ళ మామ, భార్య’ అని అంతా చెప్పేవాళ్ళు.  
 ఆండీ: అయినా, ‘మంచు’ వారి అల్లుడిగా సిటీ మొత్తం ‘బావ గారు... బావ గారు’ అని పిలుస్తున్నారు. ఇంకేం కావాలి! (నవ్వు)

  కొద్ది నెలల్లో పెళ్ళయి పదేళ్ళు కానుంది. అల్లుడికి ఏం సర్‌ప్రైజ్ ఇస్తారు?
 మోహన్‌బాబు: అప్పుడే పదేళ్ళవుతోందా? సెలబ్రేట్ చేయాలి. కానీ, ముందే చెప్పేస్తే అది సర్‌ప్రైజ్ ఎలా అవుతుంది!
 
మోహన్‌బాబు గారూ! మీరు కొడతారనీ, కోపిష్ఠి అనీ అంతా అంటారే?
 మోహన్‌బాబు: 565 సినిమాల్లో నటించా. 60 సినిమాలు తీశా. ఒకరిద్దరితో గొడవ వచ్చి ఉండవచ్చు. మిగిలిన మంచి అంతా వది లేసి, ఆ ఒకటి రెండే పట్టుకుంటారు. చెడు తాటికాయంత అక్షరాల్లో రాస్తారు. మంచి భూతద్దంతో వెతికినా కనపడకుండా రాస్తారు.
 
మీ సినిమాల్లో బ్రాహ్మల్ని కించపరుస్తుంటే, అల్లుడు గారేమీ అనుకోరా?
 మోహన్‌బాబు: మా అల్లుడు బ్రాహ్మణోత్తముడు. నాకు కుల, మత భేదాలు లేవు. మా ఇంట్లో జరిగినవన్నీ కులాంతర వివాహాలే. ఐ గివ్ రెస్పెక్ట్ టు మై క్యాస్ట్. కానీ, ఇతర కులాల్ని తక్కువ చేయను. ఒక కులం గొప్పది, మరో కులం తక్కువదనే భావనే నమ్మను. నేను నిర్మించిన సినిమాల్లో కావాలని ఏ కులాన్నీ, మతాన్నీ ఆవగింజంై తెనా కించపరచలేదు. అలా చేస్తే సెన్సార్ బోర్డ్ కూడా ఒప్పుకోదుగా!
 ఆండీ: ఒకసారి మా మమ్మీ చెన్నై నుంచి హైదరాబాదొస్తే, మూడు రోజుల కోసం పాతవన్నీ తీసేసి, మొత్తం కొత్త పాత్రలు కొన్నారు అంకుల్. నేనెక్కడా నా అలవాట్లు, ఆచారాల్లో రాజీ పడాల్సి రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement