breaking news
Anand Srinivasan
-
మామ మంచు... అల్లుడు కనకం
సినిమా టైటిల్... ‘మామ మంచు - అల్లుడు కంచు’. నిజ జీవితంలో... మామ మంచు. కానీ, అల్లుడు కంచు కాదు కనకం!! అంటే... ‘ఆండీ’ బంగారం అండీ! ► రానున్న మీ సినిమా పేరు ‘మామ మంచు - అల్లుడు కంచు’. కానీ, బయట అనుకొనేదాన్ని బట్టి - నిజజీవితంలో మామే కంచు... అల్లుడు మంచేమో! మామ మోహన్‌బాబు: (నవ్వేస్తూ...) బయట అనుకోవడానికేముంది? ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటారు. నేను ‘కంచు’ అవునో కాదో కానీ, మా అల్లుడు ఆండీ (ఆనంద్ శ్రీనివాసన్) మాత్రం మంచు! డైనమిక్. సహనం కోల్పోడు. మా అమ్మాయి మూలంగా మంచి అల్లుడు దొరికాడు. అల్లుడు ఆండీ: బయట అంకుల్ (మోహన్‌బాబు) గట్టి మనిషి. ఆవేశమనుకుంటారు కానీ, ఆయన మనసు, ప్రేమ మాకు తెలుసు. ► ఆండీ! మీరు మీ మామగారిని తొలిసారిగా ఎప్పుడు కలిశారో గుర్తుందా? ఆండీ: అంకుల్, ఆంటీల వెడ్డింగ్ యానివర్సరీ లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. అక్కడ పార్టీలో అంకుల్‌ను చూశా. విష్ణు పరిచయం చేశాడు. ► మంచు కుటుంబంతో అసలు మీకు అనుబంధం ఎలా మొదలైంది? ఆండీ: మాది తమిళ అయ్యంగార్ బ్రాహ్మణుల కుటుంబం. అమ్మ నాన్న, నేను, తమ్ముడు - అందరం చెన్నైలో ఉండేవాళ్ళం. కామన్ ఫ్రెండ్ ద్వారా లక్ష్మీప్రసన్నతో పరిచయమైంది. పరిచయం స్నేహమైంది. విష్ణుతో కలసి కొన్నాళ్ళు ‘క్లోజ్ క్యాప్షనింగ్’ (సినిమాల సబ్ టైటిలింగ్) చేశా. ► మీరు ఏం చదువుకున్నారో చెప్పనే లేదు! ఆండీ: గుజరాత్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. విదేశాల్లో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ చేశా. అమెరికాలోని టెక్సస్‌లో రెండు, మూడేళ్ళు ఉద్యోగం చేశా. తరువాత డల్లాస్‌లో, లాస్ ఏంజెల్స్‌లో ‘థింక్ స్మార్ట్ ఎఫ్.ఎక్స్’ పేరిట సంస్థ పెట్టా. ఇప్పటికీ నడుపుతున్నా. లక్ష్మిని చూశాక ఆమే నా జీవితం అనిపించింది. ఆమెను ఒప్పించి, అంకుల్‌తో మాట్లాడా. ► మోహన్బాబంటే అందరూ భయపడతారు. ఆయన్ని ఎలా ఒప్పించారు? ఆండీ: మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి! ఉన్న విషయం చెప్పేశా! నాతో చాలాసేపు మాట్లాడారు. అంతా విని, మర్నాడు కలుద్దామన్నారు. నాకు ఆ రాత్రి టెన్షన్. మరునాడు ఓకె అన్నారు. ► మొత్తానికి, ‘మంచు’ వారు చాలా పరీక్షలు పెట్టి, అల్లుణ్ణి ఎంచుకున్నారు! మోహన్‌బాబు: (నవ్వేస్తూ...) ఎవరైనా సరే పిల్లను ఇచ్చే ముందు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. చూసుకోవాలి. అయితే, పెళ్ళిళ్ళయినా, సినిమాల రిజల్టయినా మన చేతుల్లో ఉండదు. దైవమూ అనుకూలించాలి. ► మరి, మీ భాష, ప్రాంతం, కులం - ఏదీ కాని వియ్యంకులతో ఎలా? మోహన్‌బాబు: వాళ్ళు లవ్లీ పీపుల్. ఉల్లిపాయ కూడా తినని సదా చార సంపన్నులు. నేనెప్పుడూ డబ్బు చూడను. క్యారెక్టర్ చూస్తా. అది ఉంటే అన్నీ సాధించవచ్చు. మా కుటుంబాలూ బాగా కలిసిపోయాయి. ► వరకట్నం ఎంత ఇచ్చారేమిటి? మోహన్‌బాబు: ఉయ్ హేట్ డౌరీ. బయట ఏదో అనుకుంటారు కానీ, నేను మా అల్లుడికివ్వలేదు. అబ్బాయిలకీ తీసుకోలేదు. అందరికీ తెలుసు. ► కానీ, అమెరికాలో స్థిరపడాలనుకున్న అల్లుణ్ణి ఇండియాకు రప్పించగలిగారే? మోహన్‌బాబు: (నవ్వేస్తూ...) లక్ష్మీప్రసన్నతో పాటు అమెరికాలోనే ఉండాలని ఆండీ అనుకున్నాడు. మా అమ్మాయి అక్కడ నటించింది. మా విష్ణు ఏం మాయ చేశాడో, బావను ఒప్పించి, ఇండియాకి రప్పించాడు. ఆండీ: లక్ష్మి కోసం, ఆమె కెరీర్, సంతోషం కోసం ఇండియాకొచ్చేశా. కాకపోతే ఇప్పటికీ అమెరికాలో మా కంపెనీ ఉంది. తమ్ముడక్కడే ఉంటాడు. హ్యూస్టన్‌లో మా ఇల్లుంది. అమెరికా వెళితే, అక్కడుంటాం. ► ఇండియాకు ఎప్పుడొచ్చారో గుర్తుందా? ఆండీ: 2013 అక్టోబర్ 8 తెల్లవారుజామున 2.35కు ల్యాండ్ అయ్యా. మోహన్‌బాబు: భార్యని వెతుక్కుంటూ వచ్చేశాడు (నవ్వు). ఆండీని అల్లుడనుకోను. మా అబ్బాయనుకుంటా. విష్ణు, మనోజ్‌లతో కలిపి ముగ్గురు కొడుకులు! కోడళ్ళు విన్నీ, ప్రణతితో కలిపి ముగ్గురు కూతుళ్ళు! ఆండీ: అవును. ‘హి ఆల్వేస్ కాల్స్ మి సన్’. అంకుల్ కూడా మా నాన్న గారిలానే చాలా సింపుల్, స్ట్రెయిట్ ఫార్వర్డ్. మా నాన్న గారి నుంచి నేర్చుకున్న దాని కన్నా ఇంకా ఎక్కువ అంకుల్ నుంచి తెలుసుకున్నా. ► మనలోని కొన్ని.. పిల్లలకి రాకూడదనుకుంటాం. అలా లక్ష్మిలో అనుకొన్నవి? మోహన్‌బాబు: నా పెద్ద బలహీనత కోపం. నా కోపం, ఆవేశం నాకే ఎక్కువ నష్టం కలిగించాయి. లక్ష్మి నాలాగే ముక్కుసూటి, ముక్కోపి. అందుకే, లక్ష్మిని ఆ లక్షణాలు మార్చుకోమంటూ ఉంటా. ఆండీ: నేనైతే, లక్ష్మీ ప్రసన్నలో మార్చుకోవాల్సిందేమీ లేదంటాను. ఆ ఆవేశం, ముక్కుసూటితనం కావాల్సిందే. కోపం కూడా అందం అంటా. మోహన్‌బాబు: మా అమ్మాయికి ఆవేశం ఉంది. అల్లుడికది లేదు... ఆలోచన ఉంది. అందుకే, వాళ్ళిద్దరికీ సరిపోయింది. అదే నా లాంటి కోపధారి భర్త దొరికితే, లక్ష్మీప్రసన్న రెండోరోజే పెళ్ళి వద్దనుకొనేది. ఏదో నా భార్య కాబట్టి నన్ను తట్టుకొని, కాపురం చేస్తోంది (నవ్వులు...). ► అమ్మాయి డామినేటింగైనప్పుడు, టిప్స్ అల్లుడికి చెప్పాలిగా? మోహన్‌బాబు: టిప్స్ అని కాదు కానీ, ఏ మామా చెప్పని విషయం నేను మా అల్లుడికి చెబుతుంటా. మా అమ్మాయి చెప్పినదాని కల్లా సరే అనకంటూ ఉంటా. నువ్వే డామినేట్ చెయ్యి అని చెబుతుంటా (నవ్వు). ► అద్దె గర్భంతో బిడ్డను పొందాలని వాళ్ళనుకున్నప్పుడు మీ స్పందన? మోహన్‌బాబు: వాళ్ళు మాకు చెప్పే చేశారు. కాకపోతే, సరొగసీ (అద్దె గర్భం) అనే వ్యక్తిగతమైన ఆ సంగతిని బాహాటంగా చెప్పడం నాకిష్టం లేదు. ‘తప్పేమీ చేయడం లేదుగా’ అని లక్ష్మి ఒప్పించింది. ఐ ఫెల్ట్ ప్రౌడ్. ► ‘విద్యా నిర్వాణ మంచు ఆనంద్’ పుట్టాక మీలో వచ్చిన మార్పు? ఆండీ: భార్యాభర్తలం ఇంకా దగ్గరయ్యాం. ఇక, పాప పుడుతుంద నగా మా కన్నా ముందే అక్కడకెళ్ళి ఆశ్చర్యం కలిగించిన ప్రేమ ఆయనది. ► మరి, పిల్లల మీద ప్రేమ, ఆప్యాయత విషయం? ఆండీ: పిల్లల మీద అంకుల్కున్నంత ప్రేమ మాకూ లేదేమో అనిపిస్తుంది. లక్ష్మివాళ్ళ చిన్నప్పుడు సింగపూర్ నుంచి కోకాకోలా క్యాన్స తెప్పించేవారట! ఫిల్మ్‌నగర్‌లో తక్కువ ఇళ్ళున్న ఆ రోజుల్లో లక్ష్మి బయట జాగింగ్ చేస్తుంటే, బాల్కనీలో నుంచే చూస్తూ, ఆమె రక్షణ చూసేవారట! ► సమాజ దుష్ర్పభావాలు ఆడపిల్లపైనా తప్పవు. అప్పుడేం చేసేవారు? మోహన్‌బాబు: ‘మీ నీడను కూడా మీరు నమ్మకండి’ అని మంచి చెడ్డలు చెబుతుండేవాణ్ణి. పైగా, సమాజంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే నరరూప రాక్షసులెక్కువయ్యారు. వాళ్ళని కాల్చిపారేయాలి. పిల్లల్లో లక్ష్మీప్రసన్న అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అబ్బాయిలెలాగైనా బతికే స్తారు. కానీ ఆడపిల్లెలా బతుకుతుంది! నాలుగుడబ్బులు సంపాదించు కొంటే బాగుండనిపిస్తుంది. ప్రాణమున్నంతవరకు తండ్రిగా నాకదే బాధ. ► మోహన్‌బాబు గారి మాట పిల్లలు జవదాటరు. ఏం చెబుతుంటారు? మోహన్‌బాబు: ఎలా కష్టపడి పైకొచ్చానో చెప్పా. వ్యసనాలతో ఎలా నష్టపోతామో చెప్పా. నీతి, న్యాయంగా బతకండని చెబుతుంటా. అంతే! ► ఆండీ! మీ మామ గారిని చూసి మీరు మార్చుకున్న గుణాలు? ఆండీ: ఆయన నుంచి హార్డ్‌వర్క్ అలవాటు చేసుకున్నా. ఒకప్పుడు ‘సెల్ఫ్ పిటీ’ ఉండేది. కానీ, అంకుల్ని చూసి మారాను. ► మరి, అంతటి ‘మంచు’ వారి లెగసీ నిలబెట్టడానికి ఏం చేస్తున్నారు? ఆండీ: మాజీ ఎంపీ, విద్యావేత్త, దాతైన అంకుల్ లెగసీ సామాన్యం కాదు. ‘పెదరాయుడు’లో రజనీకాంత్ లాంటి వ్యక్తి. హి ఈజ్ ఓపెన్ బుక్. ► ఇంట్లో ‘పెదరాయుడు’ పాత్ర పోషిస్తూ, తీర్పులు చెబుతుంటారా? మోహన్‌బాబు: ఎవరి ఇంట్లోనైనా పెద్దవాళ్ళుంటే, వాళ్ళ మాట మీద నడుస్తాం. మా ఇంట్లో అయినా అంతే. అయినా, ఆలుమగలన్నాక చిరు కోపాలు రావాల్సిందే. కానీ ఆ క్షణానికి రావాలి, పోవాలి. ► వృత్తి, వ్యాపారాల్లో అల్లుడికి సలహాలు ఏమైనా ఇస్తుంటారా? ఆండీ: ఇన్నేళ్ళ అనుభవం ఉన్న పెద్దాయన పక్కనే ఉన్నప్పుడు సలహాలు, సూచనలడగకపోతే, మన అంతటి మూర్ఖుడు ఉండడు! ► మీ మామ గారి సినిమాలు చూస్తుంటారా? ఆండీ: ‘సర్దార్ పాపారాయుడు’లో బ్రిటీషర్‌గా ఆయన వేషం, ఆ డైలాగ్స్ ఇష్టం. అలాగే, ‘పెదరాయుడు’, ‘రాయలసీమ రామన్నచౌదరి’. ‘మామ మంచు - అల్లుడు కంచు’ పోస్ట్‌ప్రొడక్షన్‌లో కొంత చూశా. హిలేరి యస్‌గా ఉంటుంది. అయామ్ స్లోలీ బికమింగ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ► మామ గారి నటన గమనించాక, ఒక ప్రేక్షకుడిగా మీ అభిప్రాయం? ఆండీ: ఎంత పెద్ద యాక్టరైనా సరే, ఏ పాత్ర చేస్తున్నా తన సహజమైన మ్యానరిజమ్స్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఏ పాత్రకు ఆ పాత్ర చేయడం కష్టం. ఉత్తమ నటుడిగా 3 ఆస్కార్లందుకున్న హాలీవుడ్ యాక్టర్ డేనియల్ డే-లూయీస్‌లో అది చూశా. మళ్ళీ అంకుల్‌లో చూశా. ► అల్లుడికి విశ్లేషణ, ఒడ్డూ పొడుగూ ఉన్నాయి. నటనలోకి దింపవచ్చుగా? మోహన్‌బాబు: (నవ్వేస్తూ...) హైదరాబాద్‌లో ‘శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్’ నిర్వహణ మొత్తం ఆయనే చూస్తున్నారు. వ్యాపా రాలు చూసుకుంటున్నారు. ఆయన పని ఆయనను చేసుకోనివ్వండి. ► ‘మోహన్‌బాబు అల్లుడు’, ‘లక్ష్మీప్రసన్న మొగుడు’ కాకుండా, మీకంటూ గుర్తింపు కోసం, మీదైన స్వతంత్రమైన స్పేస్ కోసం తపిస్తుంటారా? ఆండీ: నేను నా లాగా బతికే స్పేస్ నాకుంది. మీ కళ్ళలో నుంచి చూస్తూ, మీరనుకున్నట్లు ‘మీ వెర్షన్ ఆఫ్ లైఫ్’ను బతకదలచుకోలేదు. మోహన్‌బాబు: నేను, లక్ష్మి నటులం కాకపోతే, ఇంత పేరు లేకపోతే, ‘ఫలానా ఆండీ వాళ్ళ మామ, భార్య’ అని అంతా చెప్పేవాళ్ళు. ఆండీ: అయినా, ‘మంచు’ వారి అల్లుడిగా సిటీ మొత్తం ‘బావ గారు... బావ గారు’ అని పిలుస్తున్నారు. ఇంకేం కావాలి! (నవ్వు) ► కొద్ది నెలల్లో పెళ్ళయి పదేళ్ళు కానుంది. అల్లుడికి ఏం సర్ప్రైజ్ ఇస్తారు? మోహన్‌బాబు: అప్పుడే పదేళ్ళవుతోందా? సెలబ్రేట్ చేయాలి. కానీ, ముందే చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది! ► మోహన్‌బాబు గారూ! మీరు కొడతారనీ, కోపిష్ఠి అనీ అంతా అంటారే? మోహన్‌బాబు: 565 సినిమాల్లో నటించా. 60 సినిమాలు తీశా. ఒకరిద్దరితో గొడవ వచ్చి ఉండవచ్చు. మిగిలిన మంచి అంతా వది లేసి, ఆ ఒకటి రెండే పట్టుకుంటారు. చెడు తాటికాయంత అక్షరాల్లో రాస్తారు. మంచి భూతద్దంతో వెతికినా కనపడకుండా రాస్తారు. ► మీ సినిమాల్లో బ్రాహ్మల్ని కించపరుస్తుంటే, అల్లుడు గారేమీ అనుకోరా? మోహన్‌బాబు: మా అల్లుడు బ్రాహ్మణోత్తముడు. నాకు కుల, మత భేదాలు లేవు. మా ఇంట్లో జరిగినవన్నీ కులాంతర వివాహాలే. ఐ గివ్ రెస్పెక్ట్ టు మై క్యాస్ట్. కానీ, ఇతర కులాల్ని తక్కువ చేయను. ఒక కులం గొప్పది, మరో కులం తక్కువదనే భావనే నమ్మను. నేను నిర్మించిన సినిమాల్లో కావాలని ఏ కులాన్నీ, మతాన్నీ ఆవగింజంై తెనా కించపరచలేదు. అలా చేస్తే సెన్సార్ బోర్డ్ కూడా ఒప్పుకోదుగా! ఆండీ: ఒకసారి మా మమ్మీ చెన్నై నుంచి హైదరాబాదొస్తే, మూడు రోజుల కోసం పాతవన్నీ తీసేసి, మొత్తం కొత్త పాత్రలు కొన్నారు అంకుల్. నేనెక్కడా నా అలవాట్లు, ఆచారాల్లో రాజీ పడాల్సి రాలేదు. -
ఓ జీవితకాలపు అనుభూతి!
మానస సరోవరం ‘‘నా జీవితంలో ఎన్నెన్నో దేశాలకు వెళ్ళాను. ప్రదేశాలు చూశాను. కానీ, మొన్న సెప్టెంబర్‌లో చేసిన కైలాస - మానస సరోవర ప్రయాణం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటున్నారు నటి - నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న. గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ పర్యాటక నిర్వాహకురాలు వైశాలీ షా పటేల్ ఈ పర్యటన ఏర్పాట్లలో ఆరితేరిన వ్యక్తి. పదిహేడేళ్ళుగా ఏటా ఎంతోమందితో ఆమె ఈ యాత్ర చేయిస్తున్నారు. ‘‘ఆమె ఏర్పాట్లతో అరవై మంది బృందంలో భాగంగా నేను, మా ఆయన ఆండీ (ఆనంద్ శ్రీనివాసన్) అక్కడకు వెళ్ళి వచ్చాం’’ అంటూ తన తాజా కైలాస - మానస సరోవర యాత్ర వివరాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకుంటున్నారు లక్ష్మీ ప్రసన్న. ధార్మికంగా చూస్తే, మన హిందువులకే కాదు... జైనులు, బౌద్ధులకు కూడా ఈ కైలాస - మానస సరోవర యాత్ర ముఖ్యమైనది, అతి పవిత్రమైనది. అదే సమయంలో క్లిష్టమైనది కూడా! సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉన్న ప్రదేశాలు కాబట్టి, అక్కడ ప్రయాణంలో ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది. ఆరోగ్య ఇబ్బందులన్నీ ఉంటాయి. అయినా సరే నేను, ఆండీ ధైర్యం చేశాం. పాప పుట్టినందుకు కృతజ్ఞతగా... చిన్నప్పటి నుంచి కైలాస పర్వతం ఫోటో చూసినప్పుడల్లా నాకెందుకో అక్కడకు వెళ్ళాలనీ, ఆ పర్వత పాదాలను తాకాలనీ అనిపించేది. పెరిగి పెద్దయ్యాక, పెళ్ళి చేసుకున్నాక చాలాకాలం సంతానం కోసం తపించా. చివరకు సరొగసీ విధానంలో నాకూ, ఆండీకీ పాప (విద్యా నిర్వాణ) పుట్టింది. మా ప్రార్థన మన్నించి, మా కోరిక తీర్చిన ఆ పరమేశ్వరుణ్ణి కళ్ళారా చూసి, కృతజ్ఞతగా మొక్కు చెల్లించాలనుకున్నా. అందుకే ఈ యాత్ర చేశా. ఆండీ కూడా తన కుటుంబ ధార్మిక విశ్వాసాలతో సంబంధం లేకుండా వచ్చేశారు. పాప పుట్టినప్పుడు మేము గుజరాత్లో తరుణా పటేల్, పయస్విన్ పటేల్ దంపతుల రిసార్ట్స్‌లో ఉన్నాం. తమ సమీప బంధువైన వైశాలీ షా పటేల్ అందరినీ తీసుకొని, ఈ యాత్ర చేయిస్తుంటారని మాటల సందర్భంలో వాళ్ళు చెప్పారు. వైశాలి ఇప్పటికి 60 - 70 సార్లు ఈ యాత్ర చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె ద్వారా వివరాలన్నీ తెలుసుకున్నాం. అయితే, అపాయకరమైన ఈ యాత్ర విషయం ముందుగా చెబితే వద్దంటారేమోనని డబ్బులు కట్టి, టికెట్లు బుక్ చేసుకొనే వరకు మా అమ్మా నాన్నలకు చెప్పలేదు. చెప్పగానే, మా నాన్న గారు వద్దన్నారు. కానీ, నేను పట్టుబట్టాను. చివరకు ఒప్పుకున్నారు. మా బృందంలో వైశాలితో పాటు తరుణ, ఆమె భర్త - మంచి ఫోటోగ్రాఫరైన ప్రయశ్విన్ కూడా వచ్చారు. చైనా నిఘా నేత్రాల నడుమ... భారతీయులకు అత్యంత పవిత్రమైనవీ, అఖండ భారతదేశంలో ఒకప్పుడు అంతర్భాగమైనవీ అయిన కైలాస - మానస సరోవర ప్రాంతాలు ఇప్పుడు టిబెట్‌లో ఉన్నాయి. టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడం వల్ల ఈ యాత్రకు వెళ్ళాలంటే, చైనా వీసా తప్పనిసరి. మేము ఈ యాత్రకు నేపాల్ వైపు నుంచి వెళ్ళాం. ముందుగా ఇక్కడ నుంచి విమానంలో నేపాల్‌లోని ఖాట్మండు చేరుకున్నాం. అక్కడ వైశాలి నేతృత్వంలో మా 60 మంది గ్రూప్ ఒక్కచోట చేరాం. అక్కడ నుంచి నేపాల్ సరిహద్దు పట్టణమైన కొదారి అనే ప్రాంతానికి ప్రయాణించాం. కొదారికి పక్కనే చైనా పరిధిలోకి వచ్చే టిబెట్ గ్రామం న్యాలమ్. ఈ రెండు పట్నాలనూ కలుపుతూ ‘ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్’ అని ఒక వంతెన ఉంది. వంతెనకు ఇటువైపు నేపాల్. అటు వైపు టిబెట్. కొదారి నుంచి న్యాలమ్కు వెళ్ళే దోవలో లెక్కలేనన్ని జలపాతాలు కనువిందు చేస్తాయి. న్యాలమ్ నుంచి ఇక పచ్చదనం పెద్దగా కనిపించదు. కైలాస యాత్రలో చైనా అధికారులు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తారు. అక్కడ వీసా ఇచ్చిన తరువాత కూడా ఎంత స్ట్రిక్ట్ అంటే, మా బస్సుల్లో ఒక్కోదానిలో ఒక్కో పోలీసాఫీసర్ వచ్చి కూర్చున్నారు. మేము దిగి, మళ్ళీ బస్సు ఎక్కిన ప్రతిసారీ తలలు లెక్కపెట్టేవారు. సరోవర స్నానం, రుద్రాభిషేకం... మానస సరోవరం దగ్గర రెండు రోజులున్నాం. మొదటి రోజు అక్కడకు చేరేటప్పటికి సాయంత్రం అయింది. అప్పటికప్పుడే సరోవరంలో స్నానం చేసి, బస్సులోనే సరోవరం చుట్టూ తిరిగి, పరిక్రమ పూర్తి చేశాం. దేవతలందరికీ నిలయంగా మన పురాణాల్లో పేర్కొనే మానస సరోవరం ఒడ్డునే ఆ రాత్రికి బస. ఒకప్పుడు అక్కడ గుడారాల్లో ఉండాల్సి వచ్చేదట. ఋషీకేశ్కు చెందిన ఒక భారతీయ బాబాజీ ఒకాయన అక్కడ చిన్న ఆశ్రమం లాంటిది కట్టారు. చిన్న చిన్న గదులు. వసతులు ఫరవాలేదు. ఒక్కో గదికి అయిదారుగురు వంతున మా టూరిస్ట్ బృందమంతా రాత్రి ఆ ఆశ్రమంలోనే బస. తెల్లవారుజామున లేస్తూనే మానస సరోవర జలంతో స్నానం చేసి, సరోవరం ఒడ్డున రుద్రాభిషేకం, ‘హవనం’ చేసి, దేవుణ్ణి ప్రార్థించాం. మానస సరోవరం ఒడ్డు నుంచి చూస్తుంటే సుదూరంగా కైలాస పర్వతం స్పష్టంగా కనిపిస్తూ, ఆకర్షించింది. సాధారణంగా మబ్బులు, వాతావరణ పరిస్థితుల వల్ల కైలాస పర్వతం అంత స్పష్టంగా కనిపించదట! ఈ ఏడాది తాను జరిపిన 7 యాత్రల్లో కైలాసం ఇంత స్పష్టంగా కనిపించడం ఇదేనని యాత్రా నిర్వాహకురాలు వైశాలి చెప్పారు. మేమెంత అదృష్టవంతులమో అనిపించింది. అక్కడ నుంచి కైలాస పరిక్రమకు బయలుదేరాం. షెర్పాల సాయంతో... కైలాస పరిక్రమ మానస సరోవర్ దగ్గర నుంచి తార్చెన్కు ప్రయాణించాం. కైలాస పరిక్రమకు బేస్ క్యాంప్ అక్కడే. సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న అక్కడే ఆ రాత్రికి బస. మరునాడు ఉదయాన్నే అక్కడ నుంచి కైలాస పర్వత పాదాల చెంతకు బస్సులో ప్రయాణం. పర్వత పాదాల దగ్గర షెర్పాలు, గుర్రాలతో మనల్ని కలుస్తారు. చీటీల పద్ధతిలో ఒక్కో ప్రయాణికుడికి ఒక్కొక్క షెర్పాను కేటాయిస్తారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మనం నడవలేకపోతే, ఈ షెర్పా, గుర్రం మనకు అక్కరకొస్తాయి. రెండు రోజుల్లో అతి కష్టమైన పరిక్రమ పూర్తి చేసుకొని, మళ్ళీ తార్చెన్కు చేరాం. అక్కడ నుంచి వచ్చిన దారినే న్యాలవ్ు మీదుగా ఖాట్మండుకు పయనం. కష్టతరమైన ఈ యాత్రలో ఒక పక్క ఆక్సిజన్ అందదు, మరోపక్క ఒళ్ళు గట్ట కట్టించేసేంత చలి. ఆ పరిస్థితుల్లోనూ వైశాలి మా బృందం వెంట ఏర్పాటు చేసిన షెర్పాల జట్టు అద్భుతం. వాళ్ళు మా వెంటే ఉండి, అంత చలిలోనూ తెల్లవారుజామున, రాత్రి కూడా వేడి వేడి టీ, భోజనం లాంటివి సమకూర్చడం నిజంగా మరపురాని విషయం. ప్రతి రోజూ ఈ పూట ఏం వండుతున్నారో, భోజనంలోకి ఏం పెడుతున్నారో అని ఆసక్తిగా చూసేవాళ్ళమంటే నమ్మండి! సాక్షాత్తూ మానస సరోవరం దగ్గర కూడా షెర్పాలు సరస్సు మధ్యకు వెళ్ళి, అక్కడ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు తెచ్చి, కాచి, ఆ వేడి నీటిని మాకు స్నానానికి ఇచ్చారు. ఆ చలిలో తెల్లవారుజామున అక్కడ మానస సరోవర జలంతో స్నానం చేసి, సరస్సు ఒడ్డున ‘హవనం’ (యజ్ఞం) చేయడం మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఆ క్షణం నాకు భయమేసింది! ఈ యాత్ర సమయంలో ఒకానొక సందర్భంలో నాకు చిన్న భయం కలిగింది. ఒకవేళ ఊహించని కారణాలు, పరిస్థితులు ఎదురై, ఏదైనా జరిగితే ఇంటి దగ్గర అమ్మ దగ్గర వదిలి వచ్చిన నా నెలల పాప సంగతి ఏమిటన్న ఆలోచన నాలో ఆందోళన రేపింది. అంతే! ‘నాకు ఏదైనా జరిగితే, నా కూతురును ఫలానా స్కూల్లో చదివించండి’ అంటూ నా స్నేహితులు ఒకరికి మాత్రం ఎస్.ఎం.ఎస్. పంపాను. ఆ ఒక్క ఆలోచన తప్ప, ఆస్తిపాస్తుల ఆలోచనలే రాలేదంటే నమ్మండి. కానీ, నా మిత్రులు ధైర్యం చెప్పారు. దేవుడి దయ వల్ల యాత్ర సాఫీగా జరిగిపోయింది. నిజానికి, ఈ యాత్రకు మాకు ఖర్చయింది కూడా మిగతావాళ్ళతో పోలిస్తే తక్కువే. ఖాట్మండు దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ఖాట్మండు దగ్గరకు తెచ్చి వదిలిపెట్టే దాకా ఒక్కో మనిషికి లక్షా పాతిక వేల రూపాయలతో ప్రయాణం, తిండీ తిప్పా, బస ఏర్పాట్లూ అన్నీ చేశారు. అంత ఎత్తై ప్రాంతంలో ఆక్సిజన్ అందక, పెదాలు నీలంగా మారిపోతూ, ‘ఎడీమా’కు గురైనప్పుడు వారిని గబగబా కిందకు పరిగెత్తుకుంటూ మోసుకురావాల్సి ఉంటుంది. లేదంటే, క్షణాల్లో ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు. ప్రతి చోటా రోజుకు రెండు నుంచి మూడు గంటల పాటు నడిపించి, ఆ వాతావరణానికీ, శ్రమకూ సిద్ధపడేలా చేశారు వైశాలి. మా యాత్రలో 71 ఏళ్ళ ఒక మహిళను చూస్తే మాకెంతో స్ఫూర్తి కలిగింది. వయసు, ఆరోగ్యం సహకరించకున్నా, ఆమె అలాగే నడిచారు. పరిక్రమ చేశారు. అది చూస్తే, ఈ యాత్రకు మానసిక వైఖరి ముఖ్యమని అర్థమైంది. ఇలాంటి యాత్రల వల్ల మేలేమిటంటే, కులం, మతం, ప్రాంతం లాంటి సంకుచిత భావాలన్నీ పక్కకు పోయి, మానవత్వం బయటకు వస్తుంది. మన పక్కనున్నది ఎవరు, ఏమిటన్నది చూడకుండా ఒకరికొకరు సాయపడడం అలవాటవుతుంది. దాన్ని బయటకు తెచ్చుకొని, మానవత్వాన్ని పరిమళింపజేయగలిగితే అప్పుడు ఈ ప్రపంచమే ఆనందమయ ప్రాంతంగా మారిపోతుంది. యాత్ర చేసి వచ్చి పది రోజులవుతున్నా, ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే నాకు ఆ దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. గంభీరంగా, అంత ఎత్తున ఆ కైలాస పర్వతం, ప్రశాంతమైన మానస సరోవర ప్రాంతాలను మర్చిపోలేకపోతున్నాను. అందుకే, ఈ పర్యటన నాకూ, ఆండీకీ ఒక జీవితకాలపు అనుభవం, అనుభూతి! - సంభాషణ: రెంటాల జయదేవ ‘‘ఈ యాత్రను నా జీవితంలో మర్చిపోలేను. స్వతహాగా మాది వైష్ణవ కుటుంబమైనా, మా అమ్మానాన్నలను ఒప్పించి ఈ కైలాస - మానస సరోవర యాత్ర చేశాను. ఏ విధమైన ముందస్తు అభిప్రాయాలూ లేకుండా నిర్మలమైన మనస్సుతో వెళ్ళాను. అక్కడకు వెళ్ళిన తరువాత నాకు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. వెనక్కి తిరిగి వచ్చినా, ఇప్పటికీ మానసికంగా ఆ అనుభూతిలోనే ఉన్నా. అక్కడ కస్తూరి మృగం చూశా. అలాగే, జంటగా మాత్రమే బతికే పక్షులను చూశాం. గమ్మత్తేమిటంటే, ఆ జంటలో ఏ ఒక్కటి మరణించినా, రెండో పక్షి మరునాడే చనిపోతుంది. ఈ యాత్ర పుణ్యమా అని శ్వాసక్రియ మీద ఉండాల్సిన అదుపు గురించి తెలుసుకున్నా. ఆధ్యాత్మిక భావాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేయాల్సిన యాత్ర ఇది!’’ - ఆనంద్ శ్రీనివాసన్ (ఆండీ), మంచు లక్ష్మి భర్త వెళుతున్నారా? ఇది... మీ కోసమే! ఈ యాత్రకు వెళ్ళబోయేవారికి కొన్ని సలహాలు ఇవ్వదలిచాను. యాత్రికులు నాలుగు లేయర్లుగా (థర్మల్స్, టెక్నికల్స్, ఫ్లీస్ లేయర్, రెగ్యులర్ ప్యాంట్ - షర్ట్లు) దుస్తులు, వాటి పైన గాలి, వాన, చలి నుంచి కాపాడే ‘విండ్ బ్రేకర్’ వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నూలు దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే, కాటన్ దుస్తులకు చెమటను పీల్చుకొనే గుణం ఉంటుంది. ఇన్ని రోజుల పాటు కాటన్‌వి వేసుకుంటే, ఒంటి మీద తేమ చేరి, ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు, చెవులకు చలి గాలి తగలకుండా కప్పుకోని ఉంచుకోవడం లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. కొన్నిచోట్ల టాయిలెట్ల సౌకర్యం కూడా ఉండదు. కాబట్టి, అక్కడి పరిస్థితులకు తగ్గట్లు సర్దుకుపోవాలి. ఆక్సిజన్ కోసం రోజూ కనీసం 5 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ‘ప్రపంచానికి పై కప్పు’ అంటూ ప్రస్తావించే టిబెట్‌లో ఒక్క సెకన్లో వాతావరణం మారిపోతుంటుంది. చటుక్కున జోరున వాన కురుస్తుంది. కాబట్టి, చలి, వాన లాంటి వాటి నుంచి రక్షణగా ఎప్పుడూ ‘పాంచో’ (తల నుంచి కింద దాకా కప్పుకొనే కోటు) వేసుకొనే ఉండాలి. దాదాపు 15 రోజులు సరైన స్నానం, రుచికరమైన భోజనం, సుఖనిద్రలను మర్చిపోవాల్సి ఉంటుంది. అలాగే, మేట్రిక్స్ అనే కంపెనీ వాళ్ళకు సంబంధించిన మొబైల్ ఫోన్ సిమ్ తీసుకుంటే, ఈ యాత్రలో ఉపకరిస్తుంది. దానికి ఇన్కమింగ్ కాల్ ఉచితమే కాకుండా, 3జి కూడా చాలా చోట్ల పనిచేస్తుంది. ఇంట్లోవాళ్ళకు మన యోగక్షేమాలను ఎస్.ఎం.ఎస్.ల రూపంలోనైనా పంపుకొనే వీలుంటుంది. దానివల్లే మా అమ్మకు రోజుకు ఒకసారైనా ‘మేము క్షేమం’ అంటూ మెసేజ్ పెట్టేందుకు వీలైంది. - మంచు లక్ష్మి విహారి, సాక్షి ఫ్యామిలీ మీరు పంపవలసిన చిరునామా: విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34. e-mail:sakshivihari@gmail.com