సూపర్‌ గర్ల్స్‌! | Sakshi
Sakshi News home page

సూపర్‌ గర్ల్స్‌!

Published Sat, Nov 4 2017 12:47 AM

Lady Oriented Movies herions review - Sakshi

ఊ.. ల.. లా.. ఊ.. ల.. లా...అంటూ కథానాయికలు చెట్లు చుట్టూ తిరుగుతూ పాడాల్సిందేనా? హీరోలతో రొమాంటిక్‌ సీన్స్‌...కామెడీ ట్రాక్‌లో ఎంతో కొంత పార్ట్‌...పాటల్లో గ్లామరస్‌గా కనిపించడం..ఇంతేనా? హీరోయిన్ల క్యారెక్టర్లు ఇంతేనా?ఇంతకు మించి యాక్టింగ్‌కి స్కోప్‌ ఉండదా? సినిమాలో ఇంపార్టెంట్‌ స్పేస్‌ ఉండదా? ఈ క్వొశ్చన్స్‌కి ఫుల్‌స్టాప్‌ పడిపోయినట్లే..ఇప్పుడు ‘లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌’ పెరిగాయి.కథానాయికలూ సినిమాని మోయగలుగుతున్నారు. ‘సూపర్‌ గర్ల్స్‌’ అని నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్, నార్త్‌లో.. కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమాల డజనుకు పైనే ఉన్నాయి.

తెలుగులో రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల జోరు ఎక్కువ. స్టార్‌ హీరోతో మాంచి మసాలా సినిమా తీస్తే, ‘సేఫ్‌’. ఇది కొంతవరకూ నిజం. అయితే ఇప్పుడు ప్రేక్షకుల్లో మార్పొచ్చింది. బాగున్న ప్రతి సినిమానీ ఆదరిస్తున్నారు. అందుకే, దర్శక–నిర్మాతలు కొత్త ప్రయత్నాలు చేయడానికి వెనకాడటంలేదు. ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ పెరిగాయి. ఫ్రమ్‌ ‘అరుంధతి’ ఈ జోరు ఎక్కువైందనే చెప్పాలి.


లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌
‘అరుంధతి’ (2009)లో అనుష్క అభినయం, ఆహార్యం చూశాక లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ అంటే తనే చేయాలన్నంతగా చాలామంది ఫిక్సయ్యారు. గడచిన ఎనిమిదేళ్లల్లో ‘పంచాక్షరి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్‌ జీరో’ వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేశారీ బొమ్మాళి. ప్రస్తుతం  చేసిన మరో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ ‘భాగమతి’ విడుదలకు సిద్ధమవుతోంది.

షాకిచ్చిన త్రిష
అదేంటో కానీ... కొంతమంది ‘ఇక పనైపోయంది’ అనుకున్నప్పుడు ఎగిసి పడే అల అయిపోతారు. త్రిషను ఈ జాబితాలోకే చేర్చవచ్చు. దాదాపు పదిహేనేళ్లు దాటాయి త్రిష కథానాయిక అయి. కొత్త కథానాయికలు వచ్చేస్తున్నారు.. త్రిష వెనక్కి తగ్గాల్సిందేనని కొంతమంది అనుకుంటున్న సమయంలో ఐదారు సినిమాలు సైన్‌ చేసి, షాకిచ్చారు. వాటిలో ‘1818’, ‘పరమపదమ్‌’ అనే లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ ఉన్నాయి.

కాజల్‌ – తమన్నా కూడా...
దాదాపు గ్లామరస్‌ రోల్స్‌కి పరిమితమైన కాజల్‌ అగర్వాల్, తమన్నాలకు కూడా ఈ ఏడాది ‘క్వీన్‌’ రూపంలో మంచి చాన్స్‌ వచ్చింది. హిందీ ‘క్వీన్‌’ రీమేక్‌లో ఈ ఇద్దరూ నటిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు ‘క్వీన్‌’లో తమన్నా, తమిళంలో కాజల్‌ చేస్తున్నారు. ‘క్వీన్‌’ విడుదలయ్యాక ఈ ఇద్దరికీ మరిన్ని హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేసే చాన్సులు వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీస్‌లోనూ స్కోప్‌ ఉన్నంతవరకూ ఇద్దరూ బాగానే నటించారు.

నయనతార.. ఓ సెన్సేషన్‌
‘చంద్రముఖి’ నయనతారకూ ఇప్పుడు నయనతారకూ అస్సలు సంబంధం లేదు. స్లిమ్‌గా తయారై, అందర్నీ ఆశ్చర్యపరిచారు. సీన్‌ డిమాండ్‌ చేస్తే బికినీ వేసుకోవడానికి కూడా వెనకాడలేదు. తమిళ ‘బిల్లా’లో బికినీలో దర్శనమిచ్చిన అదే నయనతార ‘శ్రీరామరాజ్యం’లో సీతగా ‘భేష్‌’ అనిపించుకున్నారు. ఆ సినిమాతో లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌కి సూట్‌ అవుతానని నిరూపించుకున్నారు. ‘మాయ’తో నయన లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ క్లబ్‌లోకి అడుగుపెట్టారు. అంతకుముందు మలయాళంలో ‘ఎలక్ట్రా’ అనే కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేసినా, ‘మాయ’ ఆమెను మరో ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమా తర్వాత ‘డోర’ చేశారు. మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘ఆరమ్‌’ విడుదలకు రెడీ అయింది. ఈ గ్యాప్‌లో తెలుగులో ‘అనామిక’ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చేతిలో అరడజను సినిమాలు ఉంటే వాటిలో మూడు తమిళ సినిమాలు ‘కొలైయుదిర్‌ కాలమ్‌’, ‘కోలమావు కోకిల’, ‘ఇమైక్క నొడిగళ్‌’ కథానాయిక ప్రాధాన్యంగా సాగేవే.

క్వీన్‌ హవా!
‘క్వీన్‌’ తర్వాత లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌కి సూట్‌ అవుతానని కంగనా రనౌత్‌ నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘మణికర్ణిక’ చేస్తున్నారామె. ‘ఏక్‌ నిరంజన్‌’ తర్వాత తెలుగులో కంగనా చేస్తోన్న సినిమా ఇది. హిందీలోనూ రూపొందుతోంది. ఈ సినిమా కోసం కంగనా కత్తి సాము నేర్చుకున్నారు. హార్స్‌ రైడింగ్‌ కూడా నేర్చేసుకున్నారు.

దిశా.. ఫ్రమ్‌ మోడ్రన్‌ టు హిస్టారికల్‌
దిశా పాట్నీ.. చేసిన సినిమాల సంఖ్య జస్ట్‌ ఫోర్‌. పైగా.. అన్నీ మోడ్రన్‌ క్యారెక్టర్సే. ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్‌ ‘సంఘమిత్ర’లో చాన్స్‌ కొట్టేశారు. పైగా హిస్టారికల్‌ మూవీ. మల్టీ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌. ముందు ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ని అనుకుని, ఆమె తప్పుకున్నాక దిశాని తీసుకున్నారు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకుంటున్నారు దిశా. అప్‌ కమింగ్‌ హీరోయిన్‌కి ఈ సినిమా కత్తి మీద సామే. కానీ, దిశా సవాల్‌గా తీసుకున్నారు. గెలుస్తారు కూడా. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే కదా. ఇంకా.. కథానాయికలే ‘హీరో’ అయి, చేసిన జాబితాలో అంజలి ఒకరు. ఆమె ‘గీతాంజలి’ చేసిన విషయం తెలిసిందే. సౌత్‌లో 50 సినిమాలు చేశాక రాయ్‌ లక్ష్మీకి బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘జూలీ–2’లో చాన్స్‌ వచ్చింది. తాప్సీ కూడా అక్కడ ‘పింక్‌’, ‘నామ్‌ షబానా’ అనే సినిమా కూడా చేశారు. ఆ మాటకొస్తే.. బాలీవుడ్‌లోనూ లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ ఎక్కువయ్యాయి. విద్యాబాలన్‌ ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమాలు చేస్తుంటారు. ఇప్పటివరకూ ‘ది డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’, ‘బాబీ జాసూస్‌’, ‘కహానీ–2’, ‘బేగమ్‌’ జాన్‌ వంటి సినిమాలు చేశారు. ప్రస్తుతం ‘తుమ్హారీ సులు’ అనే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ చేస్తున్నారు. మరోవైపు దీపికా పదుకొనె ‘పద్మావతి’గా రాబోతున్నారు. అనుష్కా శర్మ ‘పరీ’ అనే సినిమా చేస్తున్నారు. ‘సాహో’తో తెలుగుకి పరిచయమం కానున్న శ్రద్ధాకపూర్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి  సైనా నెహ్వాల్‌ జీవిత కథతో రూపొందనున్న సినిమాలో నటించనున్నారు. కరీనా కపూర్, సోనమ్‌ కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానియా కాంబినేషన్‌లో ‘వీరీ ది వెడ్డింగ్‌’ అనే ఫిమేల్‌ ఓరియంటెడ్‌ మూవీ రూపొందుతోంది. అటు కన్నడ వైపు వెళితే ‘క్వీన్‌’ రీమేక్‌లో పారుల్‌ యాదవ్, మలయాళం ‘క్వీన్‌’లో మంజిమా మోహన్‌ చేస్తున్నారు. ఇంకా సౌత్‌ టు నార్త్‌... లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ కొన్ని సెట్స్‌లో ఉన్నాయి.

తగ్గేది లేదంటున్న శ్రీదేవి
యంగ్‌ హీరోయిన్స్‌ గురించి చెప్పాం.. సీనియర్‌ నటి శ్రీదేవిని కూడా లిస్ట్‌లో చేర్చాలి. ‘ఇంగ్లిష్‌–వింగ్లిష్‌’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి, ఇటీవల ‘మామ్‌’ చేశారామె. తగ్గేది లేదు. కథాబలమున్న లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేయాలనుకుంటున్నారు.


నాలుగేళ్లకే మహానటి!
దాదాపు పదేళ్లు ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న కథానాయికకు లేట్‌గా ఫిమేల్‌ ఓరియంటెడ్‌ మూవీస్‌కి చాన్స్‌ వస్తే.. జస్ట్‌ మూడు నాలుగేళ్ల కెరీర్‌ ఉన్న కీర్తీ సురేశ్‌కి ఆ అవకాశం రావడం విశేషం. అది కూడా అందాల అభినేత్రి సావిత్రి జీవిత కథలో నటించే చాన్స్‌ అంటే కీర్తీ సురేశ్‌ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. కానీ, అది పెద్ద బాధ్యత అండీ బాబు. ఇప్పుడు అందరి కళ్లూ ‘మహానటి’ పైనే. సావిత్రిగా కీర్తీ సురేశ్‌ బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుంది? ఎక్స్‌ప్రెషన్స్‌ ఎలా ఉంటాయి? టోటల్‌గా నటన ఎలా ఉంటుంది? అనేది చూడ్డానికి రెడీగా ఉన్నారు. కీర్తీ అందరి మనసు గెలుచుకుంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే, ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కి ప్రశంసలు లభించాయి.
అదీ బాస్‌.. చాన్స్‌ ఇచ్చి చూడండి.. హీరోయిన్లు తడాఖా చూపిస్తారు.
– డి.జి. భవాని

Advertisement
 
Advertisement
 
Advertisement