చనిపోయిన హీరోతో సినిమా!

చనిపోయిన హీరోతో సినిమా!


అమ్మోరు, అంజి, అరుంధతి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ. అరుంధతి సినిమా తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ కొద్ది రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో కనిపించటం మానేశాడు. తెలుగు తెర మీద సక్సెస్ దూరం కావటంతో కన్నడలో ఓ స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.



అయితే కోడి రామకృష్ణ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో కన్నడ స్టార్ విష్ణువర్ధన్. 2009లోనే చనిపోయిన విష్ణువర్థన్ ఇప్పుడు హీరోగా ఎలా నటిస్తున్నాడని అనుకుంటున్నారా..? అప్పట్లో కలిసుందాం రా.. యమదొంగ లాంటి సినిమాల కోసం ఎన్టీఆర్ను మరోసారి తెరమీద చూపించినట్టుగా.., ఈ సినిమాలో విష్ణువర్థన్ను గ్రాఫిక్స్ సాయంతో హీరోగా చూపించబోతున్నారు. అప్పట్లో అవి కేవలం ఒక సీన్‌కు లేదా ఒక పాటకు మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ చనిపోయిన నటుడు హీరోగా ఓ పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించటం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి కావటం విశేషం.



1972లో విష్ణువర్థన్ హీరోగా తెరకెక్కిన నాగరాహువు సినిమాను తరువాత ఉపేంద్ర హీరోగా రీమేక్ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అదే సినిమాను అదే పేరుతో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. చనిపోయిన విష్ణువర్ధన్ను ఈ సినిమాలో హీరోగా చూపించటం కోసం ఏడు దేశాల్లోని 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు 730 రోజుల పాటు శ్రమించారట. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top