మత్తు వదిలించే కింగ్‌ఫిషర్‌

kingfisher movie logo launch - Sakshi

‘‘ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టు ‘కింగ్‌ఫిషర్‌’ టైటిల్‌ క్యాచీగా ఉంది. నేటివిటీ, ఎమోషన్, సెంటిమెంట్‌ మిస్‌ కాకుండా కథ రాయడంలో చిన్నికృష్ణ దిట్ట’’ అన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ రఘురామకృష్ణ రాజు. రచయిత చిన్నికృష్ణ ‘కింగ్‌ఫిషర్‌’ చిత్రంతో నిర్మాతగా మారారు. హైదరాబాద్‌లో చిన్నికృష్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ లోగో ఆవిష్కరణలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు పడే కష్టం మాకు తెలుసు.. అందుకే ఎప్పుడూ నిర్మాతలు కాకూడదనుకున్నాం.

చిన్నికృష్ణ నిర్మాతగా మారుతున్నాడని తెలిసి ఆశ్చర్యపోయా. కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తాడనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్నికృష్ణ వెన్నతాగే కృష్ణుడిలా కాకుండా బాక్సాఫీస్‌ రికార్డులు కొల్లగొట్టాలి’’ అన్నారు రచయిత విజయేంద్రప్రసాద్‌. ‘‘నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి చిన్నికృష్ణ గారే కారణం’’ అన్నారు దర్శకుడు కేయస్‌ రవీంద్ర (బాబి). ‘‘సమరసింహా రెడ్డి’తో నా లైఫ్‌ టర్న్‌ తీసుకుంది. కథ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌గారికి థ్యాంక్స్‌. ‘నరసింహనాయుడు’తో నా కెరీర్‌ మరో మలుపు తిరిగింది.

ఆ చిత్రానికి కథ ఇచ్చింది చిన్నికృష్ణ’’ అన్నారు దర్శకుడు బి.గోపాల్‌. చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘సినిమాల మీద ఆసక్తితో తెనాలి నుంచి చెన్నై వెళ్లాను. భాగ్యరాజాగారి దగ్గర పనిచేశాను. సుజాత రంగరాజన్‌కి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆ తర్వాత పరుచూరి సోదరులు, బి.గోపాల్‌గారు నన్ను ప్రోత్సహించారు. ఓ యువ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తాడు. జనరల్‌గా కింగ్‌ ఫిషర్‌ అనగానే బీర్‌ గుర్తుకువస్తుంది. ‘కింగ్‌ఫిషర్‌’ అనేది ఒక పక్షి పేరు. ఆ కింగ్‌ఫిషర్‌ కిక్‌ ఇస్తుంది.. మా కింగ్‌ఫిషర్‌ మత్తుని వదిలిస్తుంది’’ అన్నారు. జడ్జి మాధవ్‌ పట్నాయక్, నిర్మాత దాసరి కిరణ్, హీరో హవీష్, కత్తి మహేష్, జగన్‌  పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top