
విజయదశమికి రాయల్ లుక్!
నందమూరి బాలకృష్ణ, శ్రీయ జంటగా క్రిష్ దర్శకత్వంలో జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా
నందమూరి బాలకృష్ణ, శ్రీయ జంటగా క్రిష్ దర్శకత్వంలో జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ ‘శాతకర్ణి’, శ్రీయ ‘వశిష్ఠిదేవి’ ప్రీ లుక్స్‌కి మంచి స్పందన లభించింది. విజయదశమి కానుకగా ఈ నెల 9న బాలకృష్ణ రాయల్ లుక్, 11వ తేదీ ఉదయం 8 గంటలకు టీజర్ విడుదల చేయనున్నారు.
ప్రారంభోత్సవం రోజునే చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపారు. అదే విధంగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అనుకున్న తేదీకి విడుదల చేయాలని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. హేమ మాలిని, కబీర్ బేడీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
వంద రోజులు.. వంద సినిమాలు..!!
నేటి నుంచి ప్రొద్దుటూరు (కడప జిల్లా) అర్చన థియేటర్‌లో జనవరి 11 వరకూ బాలకృష్ణ నటించిన 99 సినిమాలను ప్రదర్శించనున్నారు. 100వ రోజైన జనవరి 12న బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల కానుంది. ఆ చిత్రం ప్రదర్శనతో వంద రోజులు.. వంద చిత్రాలు పూర్తవుతాయి. ఓ హీరో వంద చిత్రాలను వరుసగా ఒక్కో రోజు, ఒకే థియేటర్లో ప్రదర్శించడం తెలుగులో ఇదే తొలిసారి అని ఈ సినీ ఉత్సవాలు నిర్వహిస్తున్న అభిమానులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కనున్నాయట!