నా దృష్టిలో అన్నీ రీమేక్‌ సినిమాలే

Director Harish Hhankar Interview about Valmiki Movie - Sakshi

‘‘దాగుడుమూతలు’ అనే సినిమా తీయాలని కొన్ని నెలలు ప్రయత్నించాను. కుదర్లేదు. అప్పుడు రజనీకాంత్‌గారితో కార్తీక్‌ సుబ్బరాజ్‌ చేస్తున్న ‘పేటా’ ఫస్ట్‌ లుక్‌ వచ్చింది. అంతకుముందు కార్తీక్‌ తీసిన ‘జిగర్తండా’ను చూశాను. ‘పేటా’ లుక్‌ వచ్చాక మళ్లీ చూశాను. ఈ సినిమా రీమేక్‌ చేస్తే బావుంటుంది అనిపించింది. అలా ‘వాల్మీకి’ సినిమా స్టార్ట్‌ అయింది’’ అన్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. వరుణ్‌ తేజ్, పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్‌ కానున్న సందర్భంగా హరీశ్‌ శంకర్‌ చెప్పిన విశేషాలు.

► ‘దాగుడుమూతలు’ సినిమాలో ఒక పాత్ర కోసం వరుణ్‌ తేజ్‌ని కలిశాను. ‘నాతో ఎందుకు చేయాలనుకుంటున్నారు?’ అని అడిగాడు. ‘ఫిదా, తొలి ప్రేమ’ వంటి సినిమాలు చేస్తున్నావు కదా. ఈ పాత్రకు బావుంటావనిపించింది’ అన్నాను. ‘నేను మీ స్టయిల్‌ సినిమా చేయాలనుకుంటున్నాను. అలాంటి సినిమా చేద్దాం’ అన్నాడు వరుణ్‌. ఆ తర్వాత ‘జిగర్తండా’ రీమేక్‌ ఉంది, నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అనగానే వరుణ్‌ ఆసక్తి చూపించాడు. ఈ సినిమాను చాలా డెడికేషన్‌తో చేశాడు వరుణ్‌. సెట్లో సీన్‌ పేపర్‌ పట్టుకొని చిన్నపిల్లాడు నేర్చుకున్నట్టు నేర్చుకుంటూ ఉండేవాడు.

► ఎనిమిదేళ్ల తర్వాత ఓ రీమేక్‌ సినిమా చేశాను. నా దృష్టిలో ఏ సినిమా అయినా రీమేక్‌ కిందే లెక్క. ఒక సినిమా చేయడానికి ఒక పుస్తకమో, ఓ వ్యక్తో ఏదైనా సంఘటనో ప్రేరణ అయినప్పుడు మరో సినిమా ఎందుకు కాకూడదు? నాకు రీమేక్‌ అయినా సొంత కథతో సినిమా అయినా ఒకటే.  

► హిందీ ‘దబాంగ్‌’ని తెలుగు (‘గబ్బర్‌ సింగ్‌)లో రీమేక్‌ చేసేటప్పుడు చాలా మార్పులు చేశాను. ఆ ధైర్యంతోనే టైటిల్‌ కార్డ్‌లో ‘మాటలు–మార్పులు–దర్శకత్వం’ అని వేసుకున్నాను. కానీ ‘వాల్మీకి’ సినిమాలో ఎక్కువ మార్పులు చేయలేదు. కొన్ని షాట్స్‌ అలానే తీశాం. అందుకని ‘మార్పులు’ అని ప్రత్యేకంగా వేసుకోలేదు. ఈ సినిమాలో సుకుమార్‌గారు, నితిన్, బ్రహ్మానందంగారు అతిథి పాత్రల్లో కనిపిస్తారు.

► ఒక మనిషిలోని అత్యున్నతమైన మార్పుకు నిదర్శనం వాల్మీకి. ఆ టైటిల్‌ అయితే సినిమాకు బావుంటుందని పెట్టాం. టైటిల్‌ మీద చిన్న ఇష్యూ నడుస్తోంది. కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు.

► పూజా హెగ్డే పాత్ర సినిమాలో సెకండ్‌ హాఫ్‌లో వస్తుంది. తన పాత్ర సర్‌ప్రైజ్‌. వరుణ్‌–పూజా మీద ‘దేవత’ సినిమాలో ‘వెల్లువచ్చి గోదారమ్మ..’ పాట రీమిక్స్‌ చేశాం. పాత పాటలానే షూట్‌ చేశాం.

► అథర్వ మురళి పాత్రకు ముందు చాలా మందినే అనుకున్నాం. దర్శకుడవ్వాలనే కసితో ఉండే కుర్రాడి పాత్ర చేయాలంటే ఏ ఇమేజ్‌ లేని నటుడైతే బెస్ట్‌ అని అతణ్ణి తీసుకున్నాను. నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంటగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ల 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో తొలి సినిమా నేనే చేయడం ఆనందంగా ఉంది.

► ప్రస్తుతం ఆర్థికంగా బాగానే ఉన్నాను. కేవలం డబ్బు కోసం కాకుండా మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. ప్రస్తుతం కంటెంట్‌ ఉన్న సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. నా మిత్రులు కృష్ణ, మహేశ్‌ కోనేరులతో కలసి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను.

► చలంగారి ‘మైదానం’, యండమూరిగారి ‘ప్రేమ’ నవలలను సినిమాగా తీయాలనుంటుంది. కుదరదు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గమనించి, అందులో మన శైలికి ఏది మ్యాచ్‌ అవుతుందో అలాంటి సినిమాలు తీయలి. ఓ సినిమాను ఎక్కువ మంది చూస్తే అది కమర్షియల్‌ సినిమా కిందే లెక్క. మనం ఈ సినిమా తీయాలి అనుకుని సినిమా తీయలేం. సినిమానే దర్శకుడిని ఎంచుకుంటుంది కానీ దర్శకుడు సినిమాని ఎంచుకోలేడు అని నేను నమ్ముతాను. నాకు త్వరత్వరగా సినిమాలు తీయాలని ఉన్నా అనుకోకుండా గ్యాప్‌ వస్తుంది.

► ప్రస్తుతం రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఏది ముందు మొదలవుతుందో తెలియదు. అందరూ బలంగా కోరుకుంటే పవన్‌ కల్యాణ్‌గారితో సినిమా ఉండొచ్చు. ఎన్టీఆర్‌గారితో చేసిన ‘రామయ్య వస్తావయ్యా’ అనుకున్న స్థాయి విజయాన్ని సాధించలేదు. ఆయనతో ఓ సినిమా తీసి రుణం తీర్చుకోవాలి.

► నాకు, ‘దిల్‌’ రాజుగారికి చిన్న చిన్న క్రియేటివ్‌ డిఫరెన్సెన్స్‌ ఉన్నాయి. అది ఏ నిర్మాత – దర్శకుడికైనా ఉండేవే. ‘దాగుడుమూతలు’ సినిమాలో క్యారెక్టర్స్‌ మాత్రమే కావాలని నేను,  స్టార్స్‌తో తీద్దాం అని ఆయన. క్రియేటివ్‌గా చిన్న చిన్న డిఫరెన్స్‌ తప్పితే ఆయనకు, నాకు మంచి అనుబంధం ఉంది.

► వరుణ్‌ హీరో అవ్వకముందు గడ్డం పెంచుకొని ఫొటోషూట్‌ చేయించుకున్నాడు. ఆ స్టిల్స్‌ను నాగబాబుగారు నాకు చూపించారు. ఆ లుక్‌ నా మనసులో ఉండిపోయింది. వరుణ్‌ మేకోవర్‌కి కారణం నాగబాబుగారే. ఈ సినిమా కోసం ఆ లుక్‌ కావాలంటే వరుణ్‌ మౌల్డ్‌ అయ్యాడు. ఇందులో తన నటవిజృంభణ చూస్తారు. వరుణ్, నేను గర్వంగా ఫీల్‌ అయ్యే సినిమా ఇది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top