ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం రామాయణం వద్దనుకున్నాడా? | Did Ram Charan Reject Allu Aravinds Ramayana For Rajamoulis RRR | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం రామాయణం వద్దనుకున్నాడా?

Jul 12 2019 9:06 PM | Updated on Jul 12 2019 9:18 PM

Did Ram Charan Reject Allu Aravinds Ramayana For Rajamoulis RRR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకప్పుడు చేతిలో ఎన్ని సినిమాలు ఉంటే అంత గుర్తింపు ఉన్నట్టు! కానీ ఇప్పుడు సీన్‌ మారింది. ఒక్క సినిమా కోసం సంవత్సరాల పాటు వేచి ఉంటున్నారే తప్ప మరో చిత్రాన్ని ఒప్పుకోవట్లేదు. ఎంత ఆలస్యం అయినా పర్వాలేదు కానీ, పక్కాగా ఉండాలి అని ముందే డిసైడ్‌ అయిపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు సినిమాల గురించిన వార్తలు ఏదో ఒక రూపంలో రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. అందులో మొదటిది.. తెలుగు సినిమా స్థాయిని అందలం ఎక్కించిన రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కాగా మరో చిత్రం అల్లు అరవింద్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘రామాయణం’. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ కామన్‌గా వినిపిస్తున్న పేరు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.

‘రామాయణం’ చిత్రంలో కీలక పాత్ర అయిన రాముడి పాత్రలో చెర్రీని నటించమని నిర్మాతలు కోరగా అందుకు సిద్ధంగా లేనట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చెర్రీ ఆర్‌ఆర్‌ఆర్‌తో బిజీగా ఉండటమే ప్రధాన కారణమని కొందరంటుంటే, ‘రామాయణం’ చిత్రంలో పౌరాణిక పాత్రలో నటించడం ఇష్టం లేక తిరస్కరించాడని టాక్‌ నడుస్తోంది. పైగా చిత్ర సహనిర్మాత అల్లు అరవింద్ రామ్‌ చరణ్‌కు స్వయానా మామ అవుతాడు. అయినప్పటికీ రామాయణం ఆఫర్‌కు అంత ఈజీగా నో చెప్పాడంటే చెర్రీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కోసం ఎంత నిబద్ధతగా పని చేస్తున్నాడో అర్థమవుతోంది..!

ఇక తెలుగు సినీ పరిశ్రమలో రూ.1500 కోట్లతో నిర్మిస్తున్న ‘రామాయణం’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్‌ నిర్మాత మధు మంతేనా, ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోల వ్యవస్థాపకుడు నమిత్‌ మల్హోత్రా కలిసి నిర్మిస్తుండగా అల్లు అరవింద్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితేష్‌ తివారీ (దంగల్‌ ఫేం), రవి ఉద్యవర్‌ (మామ్‌ ఫేం) దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం చిత్ర మొదటి భాగం 2021 నాటికి థియేటర్లలోకి రానుంది. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చే ఏడాది జూలైలో థియేటర్లలోకి తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌ నటిస్తుండగా, కొమురం భీం పాత్రలో జూ.ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌ కూడా సందడి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement