విప్లవ వీరుడి కథతో...ఆగస్టులో 150వ చిత్రం?

విప్లవ వీరుడి కథతో...ఆగస్టులో 150వ చిత్రం?


కళా రంగం ద్వారా పైకొచ్చిన వ్యక్తులు తాము ఏ స్థాయికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా తమ మాతృరంగం మీద మమకారాన్ని మాత్రం వదులుకోలేరు. సినీ రంగానికి చెందినవారికి అది మరీ ఎక్కువగా వర్తిస్తుంది. అందుకనే, రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత కూడా సినీ ప్రముఖులు తమకు అంత గౌరవం తెచ్చిపెట్టిన చలనచిత్ర రంగం వైపు తరచూ ఆకర్షితులవుతూనే ఉంటారు. మొన్నటి ఎన్టీఆర్ నుంచి నిన్నటి జయప్రద దాకా ఆ ధోరణి చూస్తూనే ఉన్నాం. తాజాగా వెలువడుతున్న వార్తలను బట్టి చూస్తే, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఆ బాటలోనే పయనిస్తున్నారు. సినీ రంగంలో అగ్రస్థాయికి చేరి, ఆనక రాజకీయాల్లోకి వెళ్ళిన చిరంజీవి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడైనా, ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తరువాత కావాల్సినంత తీరిక దొరకడంతో తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఫిలింనగర్ వర్గాల కథనం. ఇప్పటికి 149 చిత్రాల్లో నటించిన చిరు ప్రతిష్ఠాత్మకమైన 150వ చిత్రానికి తన పుట్టిన రోజైన ఆగస్టు 22న శ్రీకారం చుడుతున్నట్లు భోగట్టా.

 

 ఎవరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి? స్వాతంత్య్రానికి పూర్వం రాయలసీమ ప్రాంతంలో బ్రిటీషు పాలకులపై ధ్వజమెత్తిన వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఆ సినిమా తీయనున్నారని చెబుతున్నారు. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల ప్రాంతానికి చెందిన వీరుడు ఆయన. అప్పట్లోనే కడప, అనంతపురం, బళ్ళారి, కర్నూలు పరిసరాల్లోని దాదాపు 66 గ్రామాలకు నేతృత్వం వహిస్తూ, సుమారు 2 వేల మంది బలగంతో బ్రిటీషు వారిని ఆయన ఎదిరించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నిజామ్ నవాబు రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటీషు వారికి దత్తం చేసిన తరువాత, ఆ ప్రాంతం వారంతా తమ ఆదాయంలో కొంతభాగాన్ని బ్రిటీషు వారికి చెల్లించాల్సి వచ్చింది.

 

  దానికి నిరాకరించి, బ్రిటీషు వారితో పోరు సాగించి, ఆఖరుకు నమ్మకద్రోహుల వెన్నుపోటుతో తెల్లవారి చేత చిక్కి, ఉరికంబమెక్కుతాడు. ఇప్పటికీ జానపద గేయాల రూపంలో కథలు కథలుగా చెప్పుకొనే ఆ విప్లవ మూర్తి జీవితంలోని ఉత్తేజపూరితమైన చారిత్రక అంశాల ఆధారంగా ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ తాజా చిత్రానికి రచన సాగిస్తున్నారు. గతంలో చిరంజీవితో ‘ఠాగూర్’ లాంటి ప్రబోధాత్మక చిత్రం తీసిన వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తారట. చిరు తనయుడు రామ్‌చరణ్ తేజ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రం కోసం ఇప్పటికే కెమేరామన్, స్టంట్‌మెన్‌తో సహా పలువురు సాంకేతిక నిపుణులను సైతం సంప్రదించి, వారిని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

 

 వరుసగా ఆఫర్లు... ఆఖరుగా ఏడేళ్ళ క్రితం 2007 జూలైలో ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలో పూర్తిస్థాయి హీరోగా చిరు కనిపించారు. ఆ తరువాత 2009లో రాజమౌళి ‘మగధీర’లో అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. ఇప్పుడీ కొత్త చిత్రం మొదలైతే అయిదేళ్ళ తరువాత ఆయన సెల్యులాయిడ్ పైకి వస్తున్నట్లు లెక్క. ఆగస్టులో మొదలుపెట్టి, సంక్రాంతి కల్లా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు. నిజానికి, ఈ చిత్రం కన్నా ముందు దర్శకుడు గుణశేఖర్ తన ‘రుద్రమదేవి’ చిత్రంలో ఓ ప్రధాన భూమికను చిరుకు ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

 

 అయితే, ఆ ప్రతిపాదనను చిరు సున్నితంగా తోసిపుచ్చారు. అలాగే, ఈ మధ్య దర్శకుడు మణిరత్నం సైతం ప్రత్యేకంగా చెన్నై నుంచి వచ్చి చిరును కలిసి, కథ వినిపించారు. దాన్ని కూడా చిరు సుతారంగా పక్కనపెట్టేశారు. అయితే, కుమారుడు రామ్‌చరణ్ కోసం చెప్పిన కథకు మాత్రం ఆయన సుముఖత వ్యక్తం చేశారనీ, వీలైతే అందులో కాసేపు చిరు మెరుస్తారనీ మరో అనధికారిక వార్త. మొత్తం మీద, సినిమా ఏది, దర్శకుడెవరన్న అధికారిక సమాచారం కోసం కొన్నాళ్ళు ఆగాల్సి ఉన్నా, ఈ ఏడాది చిరు సినీ రంగ పునఃప్రవేశం మాత్రం ఖాయమన్నమాట. చిరు అభిమానులకూ, సగటు సినీ ప్రియులకూ ఇది మండు వేసవిలో మలయ మారుతమే!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top