నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

Bigg Boss 3 Telugu War Between Sreemukhi And Ali Reza - Sakshi

బిగ్‌బాస్‌ పదకొండోవారంలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. మిస్టర్‌ కూల్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్‌ రెండుసార్లు గొడవకు దిగాడు. ఇప్పటివరకు పెద్దగా కష్టపడని పునర్నవి ఆట ఆడింది. అయినప్పటికీ నామినేషన్‌ నుంచి తప్పించుకోలేకపోయింది. అది వేరే విషయం. ఇక బెస్ట్‌ ఫ్రెండ్స్‌.. బద్ధ శత్రువులుగా మారిపోయారా అన్న అనుమానం రేకెత్తుతోంది. ఇది ఎవరి గురించి చెప్తున్నామో బహుశా ఈపాటికే అర్థమైపోయుంటుంది. మంచి స్నేహితులుగా ఉండే అలీ, శ్రీముఖిల మధ్య దూరం పెరుగుతోందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఏం జరిగిందో చూసినట్టయితే.. ఏడవ వారంలో బిగ్‌బాస్‌ ఇంటికి వీడ్కోలు చెప్పిన అలీరెజా పదో వారంలో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో మళ్లీ వచ్చాడు. అయితే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశాక అలీ గేమ్‌ ప్లాన్‌ మార్చుకున్నట్టు తెలుస్తోంది.

‘రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, వితికలు కలిసి ఉన్నంతవరకు వారు సేఫ్‌గానే ఉంటారు’ అని అలీ తన అభిప్రాయాన్ని మిగతా ఇంటిసభ్యులతో పంచుకున్నాడు. సో అలీ ఆ నలుగురి టీంలో కలిసిపోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాడని కొందరు అంటున్నారు. ఇక రీఎంట్రీ ఇచ్చినప్పటినుంచి అలీ.. అయితే శివజ్యోతి, లేకుంటే వరుణ్‌ టీంతోనే ఎక్కువగా గడుపుతున్నాడు. జిగిరీ దోస్త్‌ అయిన శ్రీముఖిని పక్కనపెట్టాడనేది దాయలేని నిజం. ఇది తాజా ఎపిసోడ్‌లోనూ తేటతెల్లమైంది. కాగా బిగ్‌బాస్‌ ఇచ్చిన ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ద మెడాలియన్‌’ టాస్క్‌లో భాగంగా మొదటి లెవల్‌ ‘కుళాయి కొట్లాట’ గేమ్‌లో పునర్నవి సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో గ్లాస్‌ కంటెయినర్‌లో నీళ్లు నింపి స్మైలీ బాల్‌ను పైకి వచ్చేలా చేయాలి. ఈ టాస్క్‌లో నామినేట్‌ అయిన సభ్యులను అనర్హులుగా ప్రకటించగా వారు నచ్చనివారిని అడ్డుకోవచ్చు, నచ్చినవారికి సహాయం చేయవచ్చు. ఉన్నవి రెండే కుళాయిలు కాగా కొద్దిసేపు మాత్రమే వచ్చే నీళ్ల కోసం బాబా భాస్కర్‌, అలీ రెజా, వితిక షెరు, శివజ్యోతి, శ్రీముఖఙ హోరాహోరీగా పోటీపడ్డారు అలీ త్వరగానే తన కంటెయినర్‌ను నింపుకోవటమే కాక శివజ్యోతికి సహాయం చేయాలనుకున్నాడు. 


అనుకున్నదే తడవుగా శివజ్యోతి కంటెయినర్‌లో నీళ్లు నింపడం ప్రారంభించాడు. ఇది చూసిన శ్రీముఖి, వితికలు అలీపై ఫైర్‌ అయ్యారు. ‘ఇక్కడ సొంతంగా ఆడేవాళ్లం పిచ్చివాళ్లమా? ఎవరి ఆట వాళ్లు ఆడండి  అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ‘నా ఇష్టం’ అంటూ అలీ ఎదురు తిరగగా శ్రీముఖి ఒంటికాలిపై లేచింది. బిగ్‌బాస్‌ టైటిల్‌ కూడా శివజ్యోతికి ఇచ్చేస్తావా? అని అడిగితే ఇచ్చేస్తా అనడంతో తనతో మాట్లాడటం అనవసరమని వీకెండ్‌లో నాగార్జున మాట్లాడతారు అని చెప్పుకొచ్చింది. ఇక అలీ.. శివజ్యోతి కంటెయినర్‌లో నీళ్లు పోసినప్పటికీ తాను వద్దని వారించనందువల్ల బిగ్‌బాస్‌ వారిద్దరినీ టాస్క్‌లో అనర్హులుగా ప్రకటించాడు. కాగా మొదటి లెవల్‌లో వితిక విజయం సాధించగా ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ద మెడాలియన్‌’ పోరులో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక మెడల్‌ గెల్చుకోడానికి ఇంటిసభ్యులు ఎన్ని ప్రయాసలు పడతారో చూడాలి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top