అవెంజర్స్‌ అద్భుతహా | Avengers: Endgame Sends Box-Office Records | Sakshi
Sakshi News home page

అవెంజర్స్‌ అద్భుతహా

Apr 29 2019 1:39 AM | Updated on Apr 29 2019 8:00 AM

Avengers: Endgame Sends Box-Office Records - Sakshi

‘అవెంజర్స్‌ చూశావా? టికెట్స్‌ దొరికాయా? ఐరన్‌మేన్‌ మస్త్‌ కదా! కెప్టెన్‌ అమెరికా సూపర్‌. హల్క్‌ కుమ్మేశాడు’... ప్రస్తుతం ప్రపంచ సినీప్రియుల మధ్య వినిపిస్తున్న డిస్కషన్లలో కామన్‌ టాపిక్‌ అవెంజర్స్‌... అవెంజర్స్‌. అసలెవరండీ ఈ అవెంజర్స్‌. అంత మొనగాళ్లా? మొనగాళ్లే. ప్రపంచాన్ని కాపాడే ఈ సూపర్‌ హీరోల సాహస విన్యాసాలు బాక్సాఫీస్‌ మీద డాలర్లు, రూపాయిలు, దినాముల వర్షం కురిపిస్తున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా పాత రికార్డులను బద్దలు కొడుతోంది అవెంజర్స్‌. మల్టీప్లెక్సుల్లో టికెట్ల కొరత సృష్టిస్తోంది అవెంజర్స్‌.

అసలెవరండీ ఈ సూపర్‌ హీరోలు  
   అమెరికన్‌ కామిక్‌ పుస్తకాల్లో పురుడు పోసుకున్న ఈ సూపర్‌ హీరోలు 2008 నుంచి సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపించడం మొదలెట్టారు. ‘ఐరన్‌మేన్, కెప్టెన్‌ అమెరికా, హల్క్, థోర్, స్పెడర్‌ మేన్, బ్లాక్‌ ప్యాంథర్‌’ ఇలా కామిక్‌ పాత్రలను స్క్రీనీకరిస్తూ వచ్చింది మార్వెల్‌. సూపర్‌ హీరోలూ తమ ఆనవాయితీగా వసూళ్లలో కొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చారు. ఒక్కొక్క సూపర్‌ హీరో విధ్వంసమే ఇలా ఉంటే వీళ్లను ఒకేచోట అసెంబుల్‌ చేస్తే? ఈ ఆలోచనతో సూపర్‌ హీరోలందరితో ‘ది అవెంజర్స్‌’ను  రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత ‘అవెంజర్స్‌ : ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’, ‘ఇన్ఫినిటీ వార్‌’ చిత్రాలు వచ్చాయి.  ఆ చిత్రాల ముగింపే ‘ఎండ్‌గేమ్‌’. ఈ చిత్రం తర్వాత మళ్లీ సూపర్‌ హీరోల పాత్రలు  కనిపించకపోవచ్చు. అందుకే ఎన్నిసార్లు చూసినా చివరిసారి చూడటం ప్రత్యేకమన్నట్టు మార్వెల్‌ అభిమానులు మళ్లీ మళ్లీ ‘ఎండ్‌ గేమ్‌’చిత్రాన్ని వీక్షిస్తున్నారు.

‘‘ఎండ్‌గేమ్‌’ చూస్తున్నప్పుడు మన ప్రాంతీయ భాష సినిమా అనే ఫీల్‌ కలిగించాలనే ఉద్దేశంతో సంభాషణల పరంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. రెహమాన్‌తో స్పెషల్‌ సాంగ్‌ చేయించడానికి కారణం కూడా ఇదే . ఈ చిత్రాన్ని తమ థియేటర్స్‌లో ప్రదర్శించాలనుకుంటున్నాం అని ఎగ్జిబిటర్స్‌ తమంతట తాము ముందుకు వచ్చారు. అమెరికాలో సృష్టించబడిన అవెంజర్స్‌ ఆంధ్రా, తెలంగాణలోనూ అభిమానాన్ని ఏ స్థాయిలో సంపాదించాయో అర్థం చేసుకోవచ్చు. ‘ఇన్ఫినిటీవార్‌’ లైఫ్‌టైమ్‌ కలెక్షన్స్‌ను 2  రోజుల్లో ‘ఎండ్‌గేమ్‌’ దాటేసింది.  మొదటి రెండు రోజుల వసూళ్ల పరంగా ఇప్పటి వరకూ డబ్బింగ్‌ సినిమాల్లో నంబర్‌ వన్‌గా నిలిచింది. హిందీ, తమిళ భాషలతో పోలిస్తే మన టికెట్‌ రేట్లు తక్కువ. అయినప్పటికీ వాటితో పోటీగా ఈ సినిమా కలెక్షన్స్‌ సాధిస్తోంది’’ అని ‘అవెంజర్స్‌’ చిత్రం మార్కెటింగ్‌ ప్రతినిధి పేర్కొన్నారు.
చెడు(విలన్‌) పై మంచి(హీరో) ఎప్పుడూ గెలుస్తుంది. కొన్నిసార్లు సమయం పడుతుందంతే.  సినిమా పరిభాషల్లో అల్టిమేట్‌ కమర్షియల్‌ ఫార్ములా ఇది. తెలుగు మాస్‌ సినిమా అయినా హాలీవుడ్‌ సూపర్‌ హీరో సినిమా అయినా ఇదే మంత్రం. కాబట్టి ‘అవెంజర్స్‌’ మనకు ఇంతలా కనెక్ట్‌ అయిందనుకోవచ్చు. అందుకే ఇది ఎండ్‌గేమ్‌ కాదు బాక్సాఫీస్‌ బెండ్‌ తీస్తున్న సూపర్‌ హీరోల గేమ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement