అందర్నీ ఏకం చేసే మాధ్యమం సినిమా

Amitabh Bachchan says few mediums can unite a disintegrating world - Sakshi

‘‘సినిమా హాల్లో కూర్చోగానే మన పక్కన ఎవరు కూర్చున్నారు? వాళ్ల జాతి, మతం, వర్ణం ఇవేమీ మనం అడగం. పట్టించుకోం. అందరం కలసి సినిమాను ఆస్వాదిస్తాం. జోక్‌ వస్తే నవ్వుతాం. సెంటిమెంట్‌ సీన్‌ అయితే కన్నీళ్లు పెట్టుకుంటాం. సినిమా మాద్యమానికి అందర్నీ ఏకం చేసే శక్తి ఉంది’’ అన్నారు అమితాబ్‌ బచ్చన్‌. గోవాలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)’ కార్యక్రమానికి హాజరయ్యారు బచ్చన్‌.

సినిమా మాద్యమం ప్రజలందర్నీ ఒక దగ్గరకు తీసుకొస్తుందనే విషయం మీద బచ్చన్‌ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ యుగంలో రకరకాల కారణాలతో మనందరం ఒకరి నుంచి ఒకరం విడిపోతున్నాం. సినిమా వల్ల మనందరం కలిసి ఉండొచ్చు. అలాంటి సినిమాలు చేసే దిశగా ప్రయత్నిద్దాం. సృజనాత్మకమైన సినిమాలతో శాంతిని తీసుకొద్దాం’’ అన్నారు. ఇఫీ ప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారు అమితాబ్‌. అలానే బచ్చన్‌ నటించిన ‘షోలే, దీవార్, పా, బ్లాక్, పీకు’ వంటి చిత్రాలు ‘ఇఫీ’లో ప్రదర్శితం కానున్నాయి.

ఇఫీ హైలైట్స్‌...
► ఇఫీ గోల్డెన్‌ జూబ్లీ జరుపుకుంటున్న సందý‡ర్భంగా గతంలో ఆస్కార్‌ మెప్పు పొందిన పాత సినిమాలను కొన్నింటిని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ‘కాసాబ్లాంకా’ (1942) చిత్రాన్ని ప్రదర్శించి ఆ చిత్ర జ్ఞాపకాల గురించి చర్చించుకున్నారు.

► ఈ గోల్డెన్‌ జూబ్లీ సంవత్సరంలో రష్యాను ఫోకస్‌ కంట్రీగా భావించి ఆ దేశంతో ఆచార్య వ్యవహారాలను మరింత బలపరచాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా ఎనిమిది రష్యన్‌ సినిమాలను ప్రదర్శించనున్నారు. గతంలో రాజ్‌ కపూర్‌ నటించిన సినిమాలు రష్యాలో పాపులర్‌ అయ్యేవి.

► ఇఫీ జ్యూరీ మెంబర్‌గా ఉన్న మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ ప్రస్తుతం వస్తున్న సినిమాల క్వాలిటీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది మేం (జ్యూరీ) చూసిన 314 సినిమాల్లో 20 సినిమాలే అద్భుతంగా ఉన్నాయి. మిగతావన్నీ మాములుగా ఉన్నాయి. ఈసారి కంటెంట్‌పై సంతృప్తిగా లేను. ప్రస్తుత కాలంలో కెమెరా ఉంటే ఎవరైనా దర్శకుడు అయిపోయి సినిమా తీయొచ్చు. కానీ మా రోజుల్లో చాలా కష్టపడాల్సి ఉండేది. మా అప్పుడు డైరెక్టర్‌ అవ్వాలంటే చాలా ఏళ్లు పట్టేది’’ అని ప్రియదర్శన్‌ పేర్కొన్నారు.

ప్రియదర్శన్‌


‘కాసాబ్లాంకా’లో ఓ దృశ్యం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top