‘అదుగో’ మూవీ రివ్యూ

Adhugo Telugu Movie Review - Sakshi

టైటిల్ : అదుగో
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : అభిషేక్‌ వర్మ, నభా నటేష్‌, రవిబాబు, సాత్విక్‌ వర్మ
సంగీతం : ప్రశాంత్‌ విహారి
నేపథ్య సంగీతం : ఎస్‌ ఎస్‌ రాజేష్‌
దర్శకత్వం : రవిబాబు
నిర్మాత : రవిబాబు, సురేష్‌ బాబు

డిఫరెంట్‌ జానర్‌ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు మరో ఇంట్రస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కించి అందరికి షాక్‌ ఇచ్చాడు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా పూర్తి లైవ్‌ 3డీ యానిమేషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది. రాజమౌళి ఈగ లాగే.. రవిబాబు పంది కూడా ప్రేక్షకులను మెప్పించిందా..?

కథ :
దుర్గ అనే రౌడీ రాజధాని ప్రాంతంలోని రైతునుంచి 1000 ఎకరాల భూమిని కబ్జా చేసి వాటిని ప్రభుత్వానికి అమ్మి కోట్లు గడించాలని ప్లాన్‌ చేస్తాడు. కానీ దుర్గ దగ్గర పని చేసే వ్యక్తి ఆ పొలాల డాక్యుమెంట్స్‌ కాపీ ఉన్న మెమరీ చిప్‌ను శక్తి అనే మరో రౌడీ మనుషులకు ఇస్తాడు. ఆ చిప్‌ను శక్తి దగ్గరకు తీసుకెళ్లే సమయంలో చంటి పెంచుకునే బంటి అనే పందిపిల్ల దాన్ని మింగేస్తుంది.

శంకర్‌, గంగరాజు హైదరాబాద్‌లో ఉండే రౌడీలు. యానిమల్‌ రేసింగ్‌లలో బెట్టింగ్‌లు పెడుతూ దందాలు చేస్తుంటారు. త్వరలో జరిగే ఓ రేసింగ్‌ కోసం ఓ పందిపిల్ల అవసరం పడుతుంది. పొట్ట మీద మూడు మచ్చల ఉన్న పందిపిల్ల అయితే రేసులో తప్పకుండా గెలుస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పటంతో అలాంటి పందిపిల్లను వెతికే పనిలో పడతారు.

అలా నలుగురు గూండాలు బంటీ(పందిపిల్ల) వెంటపడటం మొదలవుతుంది. మరి ఈ రౌడీల మధ్య అభి, రాజీ అనే ప్రేమ జంట ఎలా చిక్కుకుంది.? రౌడీల చేతుల్లో పడ్డ బంటి తిరిగి చంటి దగ్గరకు ఎలా వచ్చింది.? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
అదుగో పూర్తిగా రవిబాబు మార్క్‌ సినిమా. టైటిల్స్‌ దగ్గరనుంచే రవిబాబు తనదైన క్రియేటివిటీతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మూడు వేరు వేరు కథలను ఓ పందిపిల్లకు ముడిపెడుతూ రవిబాబు తయారు చేసుకున్న కథ బాగుంది. కానీ కథనంలో ఏమాత్రం కొత్త దనం లేకపోవటం, రవిబాబు గత చిత్రాల ఛాయలు కనిపించటం కాస్త నిరాశకలిగిస్తుంది.

లైవ్‌ 3డీ యానిమేషన్‌లో చూపించిన పందిపిల్ల క్యారెక్టర్‌ ఆకట్టుకున్నా.. సహజంగా అనిపించదు. తనకున్న బడ్జెట్‌ పరిమితుల్లో వీలైనంత క్వాలిటీ గ్రాఫిక్స్‌ ఇచ్చినప్పటికీ సగటు ప్రేక్షకుడికి కూడ పందిపిల్ల గ్రాఫిక్స్‌ అన్న విషయం అర్ధమైపోతుంది. ప్రశాంత్‌ విహారి అందించిన సంగీతం పరవాలేదనిపిస్తుంది. ప్రధానంగా కామెడీ నమ్ముకొని తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని చోట్ల కామెడీ పండినా... చాలా చోట్ల ఇబ్బంది కరంగా అనిపిస్తుంది.

సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ ఎస్‌ ఎస్‌ రాజేష్‌ అందించిన నేపథ్య సంగీతం. ముఖ్యంగా చేజింగ్‌ సీన్స్‌లో విజువల్స్‌ తో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, ఆర్ట్‌లాంటి విషయాల్లో కూడా రవిబాబు మార్క్‌ స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల విషయానికి వస్తే చంటి పాత్రలో నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సాత్విక్‌ వర్మ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్లు కాస్త అతి చేసినట్టుగానే అనిపిస్తుంది. రవిబాబు గతచిత్రాల్లో కనిపించిన చాలా మంది నటులు ఈ సినిమాలోనూ రిపీట్‌ అయ్యారు. హీరో హీరోయిన్లుగా పరిచయం చేసిన అభిషేక్‌, నభాల పాత్రలు తెరమీద కనిపించేది కొద్ది సేపే. ఉన్నంతలో బాగానే పర్ఫామ్‌ చేశారు. హీరో ఫ్రెండ్స్‌గా కనిపించిన విజయ్‌ సాయి, అజయ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ప్లస్‌ పాయింట్స్‌ :
లైవ్‌ 3డీ యానిమేషన్‌
చేజింగ్‌ సీన్స్‌
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
క్యారెక్టరైజేషన్స్‌
కామెడీ

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top