
సాక్షి, పెరంబూరు: నటి కుష్బూ బుధవారం మేటూర్ కోర్టుకు హాజరయ్యారు. 2005లో ఈమె స్త్రీల మానం గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర కలకలానికి దారి తీశాయి. ఈ వ్యవహారంలో సేలంకు చెందిన పాట్టాలి మక్కల్ కట్చి తరఫు న్యాయవాది మురుగన్ మేటూర్ కోర్టులో కుష్బూపై పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా నటి కుష్బూ మేటూర్ కోర్టుకు హాజరవుతుండగా ఆమె కారుపై కొందరు కోడిగుడ్లు, టమాటలు విసిరారు.
ఈ చర్యలను ఖండిస్తూ మేటూర్ తహసీల్దారు ఫిరోజ్‌ఖాన్ పాట్లాలిమక్కల్ కట్చికి చెందిన 41మందిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఉత్తర్వుల మేరకు కుష్బు బుధవారం ఉదయం కోర్టులో హాజరయ్యారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది జగన్నాథన్ కోర్టుకు హాజరై వాదన వినిపించారు. నటి కుష్బూను మెజిస్ట్రేట్ కొన్ని ప్రశ్నలు వేసి ఆమె సమాధానాలను పరిగణలోకి తీసుకుని కేసును మార్చి నెల 6వ తేదీకి వాయిదా వేశారు.