జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలు షురూ

national hand ball competitions started by mp prabhakar reddy - Sakshi

ప్రారంభించిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

తొలి పోటీలో తెలంగాణ జట్టు విజయం

సిద్దిపేట ఎడ్యుకేషన్‌ : క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి క్రీడాకారులకు సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో దేశపతాకాన్ని ఎగరవేయాలన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలను ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 29 రాష్ట్రాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పోటీలు నిర్వహించే అవకాశం రావడం సంతోషమన్నారు. ముఖ్యంగా నూతన సిద్దిపేట జిల్లాలో ఈ పోటీలను నిర్వహించడం గర్వకారణమన్నారు. ఇదే మైదానంలో తాము ఆడుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 29 రాష్ట్రాల నుంచి ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో పథకాలను సాధించాలన్నారు.

ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ మాట్లాడుతూ సిద్దిపేట వ్యాయామ ఉపాధ్యాయులు వేతనం కోసం కాకుండా నిబద్ధతతో పనిచేస్తారని కొనియాడారు. సారేజహాస్సే అచ్చా గీతం పాకిస్తాన్‌లో వినిపించేలా క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య కోశాధికారి ప్రీత్‌పాల్‌సింగ్‌ సలూజ, మహిళా కోచ్‌ శివాజీషిండే, తెలంగాణ ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రంగారావు, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌(హెచ్‌బీఏ) రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, కోశాధికారి రమేశ్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి దామెర మల్లేశం, అరుణాచల్‌ ప్రదేశ్‌ కార్యదర్శి నబాకులెరా, సిద్దిపేట స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి సుజాతలతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మొదటిరోజు లీగ్‌ పోటీల్లో..
జాతీయహ్యాండ్‌బాల్‌ పోటీల్లో మొదటి రోజు లీగ్‌ మ్యాచ్‌ల్లో తెలంగా>ణ, అరుణాచల్‌ప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ అఫ్‌ ఇండియా, పాండిచ్చేరి, నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ అకాడమీ, మహారాష్ట్ర, డిల్లీ, మణిపూర్‌ తదితర జట్లు తలపడ్డాయి. అంతకు ముందు తెలంగాణ అరుణాచల్‌ప్రదేశ్‌ మధ్య జరిగిన పోటీలో తెలంగాణ జట్టు 27 పాయింట్లు సాధించగా, అరుణాచల్‌ప్రదేశ్‌ 3 పాయింట్లు మాత్రమే సాధించి ఓటమి పాలైంది.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top