గరిటె పట్టేందుకు సమయం ఏదీ?

Todays Girls Who Are Away From Kitchen - Sakshi

చదువులో పడి వంటకు దూరమవుతున్న నేటితరం అమ్మాయిలు 

వివాహ సమయంలో ఇదో పెద్ద చిక్కు 

అవసరమైనప్పుడు యూట్యూబ్‌ దిక్కు

ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చూపుల సమయంలో.. ఇంటి పనులు వచ్చా..? వంట చేస్తుందా..? సంగీతం నేర్చుకుందా?.. ఇలా అడిగేవారు. ఇప్పుడు తరం మారింది. అమ్మాయి ఏం చదువుతోంది?.. ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?.. జీతం ఎంత?..  అని అడుగుతున్నారు. ఇంటి, వంటకు పని మనుషులు.. ఇష్టమైనవి తినాలంటే హోటల్‌ నుంచి పార్సిల్స్‌.. వీలైతే రెస్టారెంట్‌లో భోజనం.. ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో ఇదే పరిస్థితి. కారణం నేటి తరం ఆడ పిల్లలు వంట గది వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పుస్తకాలు పట్టిన చేతులు గరిటె పట్టడానికి రావడం లేదు. ‘ చదువులో పడి వండినవి కూడా తినేందుకు సమయం ఉండటం లేదు. ఇంకా వంటెప్పుడు నేర్చుకుంటారు’ అని తల్లిదండ్రులే తమ పిల్లల గురించి చెబుతున్నారు.  –కర్నూలు(హాస్పిటల్‌)

‘ఆమె చేతి వంట అద్భుతం’.. ఇలాంటి అభినందన అందు కోవాలంటే సామాన్య విషయం కాదు. నలుగురు మెచ్చేలా వంటలు చేయడం ఓ కళ. అయితే గరిటె తిప్పడంలో నేటితరం ఆడపిల్లల్లో ఇవన్నీ నేర్చుకోవడానికి సమయం ఉండటం లేదు. ఎదిగే వయస్సులో వారి సమయమంతా చదువుకే సరిపోతోంది. ఫలితంగా వంటా వార్పు నేర్చుకునేందుకు వారికి వీలులేకుండా పోతోంది. ఈ విషయాలన్నీ గమనించి ఇప్పుడు పెళ్లి చూపుల్లో సైతం వంట పనులకు మినహాయింపులిస్తున్నారు. పెళ్లయ్యాక భార్యకు వంట పనుల్లో భర్తలూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇద్దరూ యూట్యూబ్‌లు చూసి వంటలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆధునిక యువతికి అర్హతలు మారుతున్నాయి. ఒకప్పటి కొలమానాలు కాలక్రమేణా ఇప్పుడు తొలగుతున్నాయి.

చదువుల ధ్యాసలో పడి అమ్మాయిలు వంటనేర్చే సమయం ఉండటం లేదు. దీంతో ఇప్పుడు వారిని చేసుకునే వారు సైతం అప్పటిలా కండిషన్లు పెట్టకుండా సర్దుకుపోతున్నారు. జిల్లాలో 44 లక్షల జనాభా ఉంది. అందులో 23 లక్షల మందికి పైగా మహిళలు ఉన్నారు. ఇందులో వివాహ వయస్సున్న యువతుల సంఖ్య 8 లక్షల దాకా ఉన్నట్లు అంచనా. వీరిలో 60 శాతం దాకా కాస్త మంచి చదువులు చదివిన వారే ఉన్నారు. వీరు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత చదువుల వరకు చదువుకోవడం కోసమే అధిక సమయం వెచ్చిస్తున్నారు. పాతికేళ్ల క్రితం నాటికి ఇప్పటికీ చదువుకునే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నగరాలు, పట్టణాల్లో కూలీ పనిచేసుకునే వారు సైతం తమ ఇంట్లో మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. గతంలో ఒకవర్గం వారు అమ్మాయిలను చదువుకు దూరంగా ఉంచేవారు. ఇప్పుడు వారు కూడా అందరితో సమానంగా చదివిస్తున్నారు. స్థానికంగా ఇంటికి కాస్త దూరంగా ఉండే పాఠశాలకు పంపి చదివించడానికి వెనుకాడే వారు సైతం  ఇతర నగరాలకు తమ ఇంటి ఆడపిల్లలను పంపి చదివిస్తున్నారు. దీనికితోడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు ఈరియంబర్స్‌మెంట్‌ పథకంతో ఉన్నత చదువులు చదివే వారి సంఖ్య పెరిగింది. దీనికితోడు క్యాంపస్‌ సెలెక్షన్లలో ఉద్యోగాలు రావడంతో ఒకరిని చూసి మరొకరు ఆడపిల్లలను చదివిస్తున్నారు.  

నెట్టింటి సాయం..  
కొంత మంది అమ్మాయిలు ఒకవైపు చదువుతూనే ఖాళీ సమయాల్లో ఇంట్లో వంటావార్పు కూడా నేర్చుకుంటున్నారు. కాఫీ, టీతో మొదలు పెట్టి టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి భోజనం వండటం అభ్యసిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆన్‌లైన్‌ వంటలను ఫాలో అవుతున్నారు. యూ ట్యూబ్‌లు, టీవీ ఛానళ్లల్లో వచ్చే కొత్తరకం వంటలను ఇంట్లో ప్రయత్నిస్తూ ఇంట్లో వారికి కొత్త రుచులు చూపిస్తున్నారు. అయితే చదివే సమయంలో వంట నేర్చుకోని వారు సైతం ఇప్పుడు యూ ట్యూబ్‌ ద్వారా వంటలను నేర్చుకుంటున్నారు.  

చదువుకే టైమ్‌ సరిపోవడం లేదు
ఇప్పటి కాలం పిల్లలు ఎక్కువగా చదువుతున్నందున వారికి వంట నేర్చుకునే టైమ్‌ ఉండటం లేదు. చదువు తర్వాత క్యాంపస్‌ సెలక్షన్లలో ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ తర్వాత వెంటనే పెళ్లి చేస్తున్నారు. ఇక వారు వంట నేర్చుకునే సమయం ఉండటం లేదు. అధిక శాతం మందికి కేవలం తెల్ల అన్నం మాత్రమే వండటం వచ్చు. టిఫిన్లు, కూరలు, పప్పు, పెరుగు అన్నింటికీ కర్రీపాయింట్లు, హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు హోటళ్లల్లో పార్సిల్‌ కట్టించుకుని వచ్చి తింటున్నారు. అత్తారింట్లో వంటావార్పు రావడం లేదని కోడళ్లను తిడుతున్న సంఘటనలు, దీనివల్ల రెండు కుటుంబాలకు గొడవలు అక్కడక్కడా జరుగుతున్నాయి.  
– చిన్నయ్య, వివాహాల మధ్యవర్తి, కర్నూలు 

మధ్యతరగతి ఇళ్లల్లో నేర్చుకుంటున్నారు 
గతంలో అక్షరాస్యత తక్కువ. ఇంట్లో ప్రతి పని మనమే చేసుకునే పరిధి ఉండేది. ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది. చదువులో పడి ఇతర పనులను మరిచిపోతున్నారు. సెల్‌ఫోన్లు, టీవీల వల్ల కూడా వాటి ధ్యాసలో పడి వంటావార్పు నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందులో స్త్రీ, పురుష బేదం ఉండటం లేదు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా చదివిస్తున్నారు. ఈ కారణంగా చదువుకునే సమయంలో వంట నేరి్పంచేందుకు ఉత్సాహం చూపడం లేదు. అయితే ఇప్పటికీ ఒకవైపు చదువుతూనే మరోవైపు వంట నేర్చుకునే అమ్మాయిలు ఉన్నారు.  
– రామస్వామి, తెలుగువీధి, కర్నూలు 

మగపిల్లలు నేర్చుకుంటున్నారు 
యువతులకు వంట దూరమైంది. గతంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల ఉండేది. ఇంటికి వచ్చిన వెంటనే వారు తల్లికి సహాయంగా ఉండేవారు. ఇప్పుడు పొద్దున వారు రెడీ కావడానికే సరిపోతోంది. ఇప్పుడు ఉదయం 7 గంటలకు వెళ్లి రాత్రి 8 గంటలకు వస్తున్నారు. దీంతో పాటు పెద్ద చదువులు చదువుతూ వంటకు దూరం అవుతున్నారు. పెళ్లి ఖాయమైన సమయంలో మాత్రమే వంట నేర్చుకుంటున్నారు. దీంతో ఇప్పుడు మగపిల్లలు కూడా వంట నేర్చుకుంటున్నారు. దీనికితోడు రెడీమేడ్‌గా ఆహారం లభించడం, డబ్బు అధికంగా ఉండటంతో వంటావార్పుకు దూరం అవుతున్నారు.    
–యాన్నీ ప్రతాప్, చాణిక్యపురికాలని, కర్నూలు   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top