నవ్వండి.. లవ్వండి

Sense Of Humor Helps For Strong And Long Relationship - Sakshi

కాన్సాస్‌ : మనిషి ఆరోగ్యంగా జీవించటానికి నవ్వు ఎంతగా ఉపయోగపడుతుందో మనకు తెలిసిన విషయమే. అయితే నవ్వు వల్ల ఓ జంట మధ్య ప్రేమ బంధం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జంట మనస్పూర్తిగా కలిసి నవ్వుకోవటం వల్ల వారి మధ్య బంధం బలపడుతుంది. అంతేకాదు ఓ జంట మధ్య రిలేషన్‌ కలతల్లేకుండా కలకాలం సాగాలంటే కమ్యూనికేషన్‌, సర్దుకుపోయే గుణమే కాదు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ కూడా ఎంతో అవసరం. మన సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ పార్ట్‌నర్‌తో మన బంధాన్ని బలోపేతం చేస్తుందని తాజా పరిశోదనల్లో తేలింది. చాలా మంది తమ భాగస్వామికి సెన్స్‌ హ్యూమర్‌ ఉండాలని కోరుకుంటున్నట్లు యూనివర్శిటీ ఆఫ్‌ కెన్సాస్‌కు చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. ఎదుటి వ్యక్తిని నవ్వించగలిగే గుణం ఆరోగ్యకరమైన బంధానికి దారితీస్తోందని వెల్లడించారు. జంటలోని ఇద్దరు వ్యక్తులు జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నట్లయితే ఆ బంధం మరింత బలంగా ఉంటుందని తెలిపారు.

జంటలోని ఓ వ్యక్తికి మాత్రమే సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉంటే సరిపోదని ఇద్దరి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌లో పోలికలు ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా వ్యక్తిలోని సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ వారిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుందని యూనివర్శిటీ ఆఫ్‌ న్యూ మెక్సికో పరిశోధకులు చెబుతున్నారు. అందంగా ఉన్నావారి కంటే మంచి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉన్న వ్యక్తులనే ఎక్కువగా ఇష్టపడతారని వెల్లడించారు. నవ్వు ఒత్తిడిని తగ్గించే మందు లాగా పనిచేస్తుందని, నవ్వటం ద్వారా మనలో ఆనందాన్ని నింపే హార్మోన్లు విడుదలవుతాయని, తద్వారా ఒత్తిడినుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. నవ్వు ఇద్దరు వ్యక్తులను దగ్గర చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top