భాగస్వామికి మూడో వ్యక్తితో ఎమోషనల్‌ బాండింగ్‌

Heartbreaking Emotional Cheating Between Couple - Sakshi

ప్రపంచవ్యాప్తంగా చాలా జంటలు విడిపోవటానికి కారణాలను అన్వేషించినపుడు ‘ఎమోషనల్‌ చీటింగ్‌’ ప్రధానంగా కన్పిస్తుంది. అయితే ఎమోషనల్‌ చీటింగ్‌ అంటే ఇది అని చెప్పటం ఓ కష్టమైన పనే. ఎందుకంటే ఇది ఒక్కో బంధంలో ఒక్కోరకంగా ఉంటుంది. కానీ, ఎమోషనల్‌ చీటింగ్‌కు పాల్పడే భాగస్వామి కారణంగా పడే బాధ వర్ణనాతీతం. ప్రతి జంట ఓ ప్రత్యేకమైన హద్దులతో సంబంధాలను కలిగి ఉంటుంది. ఇలాంటి సందర్బాల్లో ఒకరిది తప్పు మరొకరిది ఒప్పు అన్నదానిని నిర్ధారించటం చాలా కష్టం. 

‘ ఎమోషనల్‌ చీటింగ్‌ను ఒక్కమాటలో చెప్పాలంటే.. మన భాగస్వామి మనతో కంటే ఎక్కువగా మూడో వ్యక్తితో ఎమోషనల్‌ బాండింగ్‌ కలిగి ఉండటం.’ 
                                                   - జొనాథన్‌ బెన్నెత్‌(ప్రముఖ డేటింగ్‌, రిలేషన్‌షిప్‌ కోచ్‌)

ఎమోషనల్‌ చీటింగ్‌ను ఉదాహరణలతో వివరించినపుడు...

1) మనసులో ప్రత్యామ్నాయ వ్యక్తులు 
ఒకరితో ప్రేమలో ఉంటూ.. ఆ సంబంధం బెడిసి కొడితే తర్వాత ఏం చేయాలో ముందుగానే ఆలోచించి పెట్టుకోవటం. మనసులో ప్రత్యామ్నాయ వ్యక్తులను ఉంచుకోవటం.
ఉదా : లత అనే యువతి రఘు అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉంది. లత చావైనా బ్రతుకైనా రఘుతోటే.. అతడ్ని తప్ప ఇంకొకర్ని జీవిత భాగస్వామిగా ఊహించలేను అనుకుంటోంది. అయితే రఘు మాత్రం లతతో ప్రేమ వ్యవహారం బెడిసి కొడితే ఏం చేయాలో ఆలోచించి పెట్టుకున్నాడు. లతతో బ్రేకప్‌ అయితే వెంటనే ప్రియ అనే మరో అమ్మాయితో కలిసి పోవటానికి సిద్ధంగా ఉన్నాడు. 

2 ) మాజీ భాగస్వామితో టచ్‌లో ఉంటూ.. 
ప్రస్తుతం ఓ వ్యక్తిని ప్రేమిస్తూ గతంలో బ్రేకప్‌ చేసుకున్న వ్యక్తితో టచ్‌లో ఉండటం. వారితో సన్నిహితంగా ఉంటూ ప్రస్తుత భాగస్వామికి వారి గురించి అబద్ధాలు చెప్పటం.
ఉదా : సాయి అనే వ్యక్తి ప్రేమ అనే అమ్మాయితో బ్రేకప్‌ చేసుకున్నాడు. ఆ కొద్దిరోజులకే సుధ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయినప్పటికి ప్రేమతో సన్నిహితంగా ఉండటం మానలేదు. మాజీ ప్రియురాలితో టచ్‌లో లేనని సుధకు అబద్ధాలు చెప్పేవాడు. 

3) మూడో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం
మనల్ని ప్రేమిస్తున్న వ్యక్తి మనతో కాకుండా మూడో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం. మనతో చెప్పుకోలేని విషయాలను కూడా వారితో చెప్పుకుంటూ మూడో వ్యక్తికే అధిక ప్రాధాన్యత నివ్వటం.
ఉదా : సంజయ్‌,  శ్రేయలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే శ్రేయ మాత్రం కిరణ్‌తో సన్నిహితంగా ఉండేది. సంజయ్‌తో పంచుకోని విషయాలను సైతం కిరణ్‌తో చెప్పుకునేది. తన జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలను కిరణ్‌ సలహా మేరకు తీసుకునేది. 

4) ఇతరులకు ఫిర్యాదు చేయటం
మన గురించి తరచూ ఇతరులకు ఫిర్యాదు చేయటం అన్నది కూడా ఎమోషనల్‌ చీటింగ్‌. మన మీద కోపాన్ని ఇతరుల ముందు చూపించటం, ఇతరుల ముందు మనల్ని బ్యాడ్‌ చేయటం అన్నది ఎమోషనల్‌గా చీటింగ్‌ చేయటమే.
ఉదా : సునీల్‌, మేఘల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగేవి. గొడవలు జరిగిన ప్రతిసారి మేఘ ఈ విషయంపై వారిద్దరికీ తెలిసిన మిత్రులతో చర్చిస్తూ వారి ముందు అతడ్ని విలన్‌ను చేసేది. ఆ విషయం తెలిసి అతడు ఆమెను నిలదీస్తే.. కోపంలో ఉన్నపుడు ఉండబట్టలేక చేశానని చెప్పేది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top