వైద్యుల నిర్లక్ష్యమే..

patient relatives protest against hospital - Sakshi

ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన

విచారణ జరిపిస్తాం..

లత భర్తకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం: డీఎంహెచ్‌వో

కోరుట్ల:   వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత లత, అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయారని బాధిత కుటుంబీకులు శుక్రవారం ఉదయం కోరుట్ల ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. లత మృతికి కారకులను శిక్షించాలని కోరారు. సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను శిక్షిస్తామని డీఎంహెచ్‌వో సుగంధిని హామీ ఇచ్చారు.  

వివరాలు బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం. కథలాపూర్‌ మండలం పోసానిపేటకు చెందిన గర్భిణి లత ప్రసవం కోసం గురువారం రాత్రి ఆస్పత్రికి వచ్చారు. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పిన వైద్యురాలు శ్రీలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోయారని, తర్వాత కాంపౌండర్లు పట్టించుకోలేదని మృతురాలి భర్త శ్రీనివాస్, పోసానిపేట సర్పంచ్‌ గంగారెడ్డి, గ్రామస్తులు ఆరోపించారు. అప్పుడే పుట్టిన పసికందు చనిపోయిందని తెలిసి షాక్‌కు గురైన లతను ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ఆలస్యంగా వైద్యులు స్పందించారని, అప్పటికే పరిస్థితి విషమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. లతతోపాటు పసికందు మృతికి వైద్యులే కారణమని వారు ఆరోపించారు.

ఆందోళన విషయం తెలుసుకున్న కోరుట్ల, కథలాపూర్‌ తహసీల్దార్లు సత్యనారాయణ, మధు, సీఐ సతీష్‌చందర్‌రావు, ఎస్సైలు రవికుమార్, జాన్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. డీఎంహెచ్‌వో వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. అదే సమయంలో డీఎంహెచ్‌వో సుగంధిని ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులను శిక్షిస్తామని, మృతురాలి భర్త శ్రీనివాస్‌కు ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని  డీఎంహెచ్‌వో సుగంధిని హామీ ఇచ్చారు. లత పిల్లల చదువుకు సాయం చేస్తామని, అంత్యక్రియలకు రూ.10వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top