హెచ్‌1బీ దరఖాస్తుల కోటా పూర్తి

US reaches 65000 H1B visa cap in five days for Financial Year 2020 - Sakshi

మాస్టర్స్‌ విభాగం దరఖాస్తులను స్వీకరిస్తాం: అమెరికా

కాలిక్సో/వాషింగ్టన్‌: 2020 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1బీ వీసా దరఖాస్తుల సంఖ్య అమెరికా కాంగ్రెస్‌ నిర్దేశించిన 65,000 పరిమితికి చేరుకుందని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. ఈ హెచ్‌1బీ వీసా దరఖాస్తులను 2019 ఏప్రిల్‌ నుంచి స్వీకరిస్తున్నామని వెల్లడించింది. అయితే తొలి ఐదురోజుల్లో ఎన్ని హెచ్‌1బీ దరఖాస్తులు అందాయన్న యూఎస్‌సీఐఎస్‌ స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయమై యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ ఎల్‌. ఫ్రాన్సిస్‌ సిస్నా మాట్లాడుతూ..‘2019 అక్టోబర్‌ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి అమెరికా కాంగ్రెస్‌ నిర్దేశించిన పరిమితి మేరకు హెచ్‌1బీ దరఖాస్తులు అందాయి.

ఈ నేపథ్యంలో అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చదివి హెచ్‌1బీ వీసా కోసం దరఖాస్తు చేసిన 20,000 మంది విదేశీయులను ఈ జాబితా నుంచి మినహాయిస్తాం. అలాగే మాస్టర్స్‌ విభాగానికి సంబంధించి హెచ్‌1బీ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది’ అని తెలిపారు. అమెరికాలో ఏటా గరిష్టంగా 65,000 మంది విదేశీ నిపుణులకే హెచ్‌1బీ వీసాలు జారీచేయాలని ఆ దేశ కాంగ్రెస్‌(పార్లమెంటు) గతంలో యూఎస్‌సీఐఎస్‌ను ఆదేశించింది. హెచ్‌1బీ వీసా జారీ నియమనిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విధానం వల్ల అమెరికాలో మాస్టర్స్‌ చేసిన 5,340 మంది విదేశీయులకు ఏటా అదనంగా లబ్ధి చేకూరుతుందని యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ ఎల్‌.ఫ్రాన్సిస్‌ సిస్నా  తెలిపారు. అమెరికా–మెక్సికో సరిహద్దులోని డెల్‌రియో సెక్టార్‌లో 3.21 కిలోమీటర్ల పొడవు, 30 అడుగుల ఎత్తుతో నిర్మించిన గోడను పరిశీలించాక ట్రంప్‌ మాట్లాడారు. ‘మాదేశం ఇప్పటికే వలసదారులతో నిండిపోయింది. కాబట్టి సరిహద్దులో ఉన్నవారంతా వెనక్కి వెళ్లిపోండి’ అని అక్రమ వలసదారులు, శరణార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత 2–3 సంవత్సరాలుగా అమెరికాలోకి అక్రమంగా వస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందన్నారు. తాజాగా సరిహద్దు గోడ కారణంగా ఈ వలసలు 56 శాతం తగ్గిపోయాయని గస్తీ అధికారి చావెజ్‌ పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top