జీ–7 కూటమిని జీ–10 చేయాలి

US President Donald Trump wants to reformat G7 - Sakshi

కూటమిని విస్తరించి భారత్‌ను చేర్చాలి

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదన

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జీ–7 కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారు. భారత్‌ సహా మరో మూడు దేశాలను చేర్చి జీ–10 లేదంటే జీ–11 దేశాల కూటమిగా సరికొత్తగా తీర్చిదిద్దాలని సూచించారు.  శనివారం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో వెళుతూ ట్రంప్‌ విలేకరులతో ముచ్చటించారు. జూన్‌లో నిర్వహించాల్సిన జీ–7 దేశాల సదస్సును సెప్టెంబర్‌కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.  కోవిడ్‌–19 విజృంభిస్తున్న ఈ తరుణంలో అమెరికాలో ఈ సదస్సును ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

ఇదొక కాలం చెల్లిన కూటమి
ప్రపంచంలో ఏడు అభివృద్ధి చెందిన దేశాలతో జీ–7 కూటమి ఏర్పడింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా దేశాలతో ఏర్పాటైన ఈ కూటమి ప్రతీ ఏడాది సమావేశమై అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులపై చర్చలు జరుపుతుంది. అయితే ఈ కూటమిని విస్తరించి ఇందులోకి ఆస్ట్రేలియా, భారత్,  దక్షిణ కొరియాలను  ఆహ్వానించాలని, రష్యాని కూడా తిరిగి కూటమి గూటిలోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ట్రంప్‌ చెప్పారు. ‘‘ప్రపంచంలో ఏం జరుగుతోందో చర్చించడానికి ఇప్పుడు సభ్య దేశాలుగా ఉన్న జీ–7 సరైనది కాదు. ఈ కూటమికి కాలం చెల్లిపోయింది. కొత్త దేశాలను కలుపుకొనిపోవాల్సిన అవసరం ఉంది’’ అని ట్రంప్‌ అన్నారు.  

మళ్లీ మోదీకి ఆహ్వానం
జీ–7 దేశాల వార్షిక సమావేశానికి ఈసారి అమెరికా అ«ధ్యక్షత వహిస్తోంది. గత ఏడాది ఫ్రాన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు అధ్యక్షుడు  మేక్రాన్‌ మోదీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ ఏడాది జరిగే సదస్సుకి ట్రంప్‌ మోదీని ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ప్రాభవం పెరుగుతోందని అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top