33 చైనీస్‌ కంపెనీలు బ్లాక్‌ లిస్టులో చేర్చిన అమెరికా

US Blacklists 33 Chinese Companies Alleges Military Links - Sakshi

వాషింగ్టన్‌: మైనార్టీల పట్ల చైనా వ్యవహరిస్తున్న తీరుపై అగ్రరాజ్యం అమెరికా మండిపడింది. అల్ప సంఖ్యాక వర్గాలపై అణచివేత ధోరణి అవలంబించేందుకు వీలుగా చైనా తరఫున గూఢచర్యం నెరపుతున్నాయన్న ఆరోపణలతో 33 చైనీస్‌ సంస్థలను ఎకనమిక్‌ బ్లాక్‌లిస్టులో చేర్చింది. సదరు సంస్థలు చైనా మిలిటరీతో సంబంధాలు కలిగి ఉన్నాయని, మైనార్టీల ప్రయోజనాలు కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘‘ఉగర్ల(షింజియాంగ్‌లోని తెగ) సామూహిక నిర్బంధం, శ్రమదోపిడి, అత్యాధునిక సాంకేతికతతో వారిపై నిఘా వేసేందుకు చైనా చేపట్టిన అణచివేత కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఈ కంపెనీలు మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి’’అని అమెరికా వాణిజ్య విభాగం రాయిటర్స్‌తో పేర్కొంది. ఎకనమిక్‌ బ్లాక్‌లిస్టులో పెట్టిన కనీసం ఏడు టెక్నాలజీ కంపెనీలు ఉండగా.. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉన్నట్లు వెల్లడించింది.(చైనా గుప్పిట్లోకి హాంకాంగ్‌‌.. అమెరికా స్పందన!)

కాగా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న హాంకాంగ్‌ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని అక్కడ అమలు చేసే ముసాయిదా బిల్లుకు చైనా పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో బిల్లు చట్టరూపం దాల్చితే హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తి కోల్పోయే అవకాశం ఉంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో డ్రాగన్‌ ఈ మేరకు పావులు కదుపుతోంది. అదే విధంగా తైవాన్‌పై సైతం హాంకాంగ్‌ మాదిరి పెత్తనం చెలాయించేందుకు వ్యూహాలు రచిస్తోంది. అంతేగాకుండా సరిహద్దుల్లో పొరుగు దేశాల సైన్యాన్ని పదే పదే రెచ్చగొడుతూ దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది. (తైవాన్‌పై బాహ్య శక్తుల ప్రమేయాన్ని సహించం: చైనా)

ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనా వైరస్‌ విషయంలో చైనాపై మండిపడుతున్న అమెరికా...  చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక జాతీయ సైబర్‌ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని సేకరించి.. తద్వారా అందరి డేటాను చౌర్యం చేసేందుక సమాయత్తమైందని ఆరోపించింది. ఈ క్రమంలో అమెరికా వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేస్తూ.. చైనీస్‌ టెలికం దిగ్గజం హువావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది.

ఇక తాజాగా హాంకాంగ్‌, ఉగర్ల పట్ల చైనా దమననీతిని నిరసిస్తూ 33 కంపెనీలను బ్లాక్‌లిస్టులో చేర్చి వాటికి నిధులు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ఉపక్రమించింది. గతేడాది సైతం ఇదే తరహాలో 28 చైనీస్‌ కంపెనీలను బ్లాక్‌లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో.. రక్షణ రంగానికి గతేడాది 177 బిలియన్‌ డాలర్ల బడ్జెట్ కేటాయించిన డ్రాగన్‌.. ఈసారి దానిని 6.6 శాతం పెంచుతూ 179 బిలియన్‌ డాలర్లు చేయడం గమనార్హం. (డ్రాగన్‌ దేశంపై ఉమ్మడిగా పోరాడాలన్న అమెరికా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top