చైనా గుప్పిట్లోకి హాంకాంగ్‌‌.. అమెరికా స్పందన!

China Pushes For National Security Law After Unrest In Hong Kong - Sakshi

బీజింగ్‌/వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధం రోజురోజుకీ ముదురుతున్న నేపథ్యంలో ఆర్థిక, వ్యాపార కేంద్రంగా భాసిల్లుతున్న హాంకాంగ్‌‌ను పూర్తిగా తన గుప్పిట్లో బంధించేందుకు చైనా పావులు కదుపుతోంది. జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌‌లో అమలు చేసే బిల్లుకు సంబంధించిన ప్రతిపాదనలను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. తద్వారా చైనాకు వ్యతిరేకంగా హాంకాంగ్‌‌లో వెల్లువెత్తుతున్న నిరసనలను అణగదొక్కి వాణిజ్య హబ్‌పై మరింత పట్టు సాధించేలా ముందుకు సాగుతోంది.

ఈ విషయం గురించి చైనా పార్లమెంట్‌ అధికార ప్రతినిధి జాంగ్‌ యేసూయీ మాట్లాడుతూ.. ‘‘హాంకాంగ్‌‌లో జాతీయ భద్రతా చట్టం’’అమలు చేసేందుకు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ తొలి రోజు సమావేశంలో ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తద్వారా చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ‘‘ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచి.. దానిని పటిష్టం చేయాలని చైనా పార్లమెంట్‌ భావిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. హాంకాంగ్‌‌కు మార్కెట్‌ ఎకానమీని పటిష్టం చేసేందుకు ఈ అంశం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. (తైవాన్‌పై బాహ్య శక్తుల ప్రమేయాన్ని సహించం: చైనా)

హాంకాంగ్‌‌కు ముగింపు ఇది
చైనా తాజా నిర్ణయాన్ని హాంకాంగ్‌‌ ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. డ్రాగన్‌ చర్యలు హాంకాంగ్‌‌ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘హాంకాంగ్‌కు ముగింపు ఇది. ఒక దేశం- రెండు వ్యవస్థలకు చరమగీతం ఇది. ఇలాంటి  తప్పులు చేయకండి’’ అంటూ సివిక్‌ పార్టీ చట్టసభ ప్రతినిధి డెన్నిస్‌ వోక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. హాంగ్‌కాంగ్‌ ప్రజలకు బీజింగ్‌ ఏమాత్రం గౌరవం ఇవ్వడంలేదని మరో నేత తాన్యా చాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మమ్మల్ని సంప్రదించకుండానే ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. అయితే మేం ఎన్నటికీ ఆశావహ దృక్పథాన్ని విడిచిపెట్టం. పోరాడుతూనే ఉంటాం’’అని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఇక హాంగ్‌ కాంగ్‌ చివరి బ్రిటీష్‌ గవర్నర్‌ క్రిస్‌ పాటన్‌..‘‘ పట్టణ స్వయంప్రతిపత్తిపై ఇది హేయమైన దాడి’’ అని మండిపడ్డారు. కొంతమంది చైనా మానవ హక్కుల కార్యకర్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.(చైనా చొరబాట్లు.. భారత్‌పై ఆక్రోషం!)

అమెరికా స్పందన
హాంకాంగ్‌ పట్ల చైనా వైఖరిపై అమెరికా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అదే గనుక నిజమైతే.. ఆ వివాదంపై మా స్పందన చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది’’అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. సెనెటర్‌ పాట్‌ టూమీ మాట్లాడుతూ.. ‘‘ఇతర దేశాలపై చైనా జోక్యం ఎక్కువవుతోంది. హాంకాంగ్‌ ఆసియాకు బొగ్గు గని వంటిది’ ’అని పేర్కొన్నారు. చైనా గనుక తన నిర్ణయాన్ని అమలు చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

1997లో అప్పగింత..
బ్రిటన్‌ తన పాలనలో ఉన్న హాంకాంగ్‌‌ను 1997లో చైనాకు అప్పగించింది. ఆ సమయంలో ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ మినీ రాజ్యాంగాన్ని రూపొందించుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఇక అందులోని ఆర్టికల్‌ 23 ప్రకారం చైనా ప్రభుత్వాన్ని ధిక్కరించకూడదు. అయితే గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగుతున్నారు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చైనా పెత్తనాన్ని వారు సహించలేకపోతున్నారు. ఇక నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లుపై వచ్చిన చైనా ప్రతిపాదనలతో హాంకాంగ్‌లో గతేడాది నిరసనలు మిన్నంటాయి. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం కలుగుతుంది. దీంతో రైట్‌ వింగ్‌ యాక్టివిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హాంకాంగ్‌ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రోడ్డెక్కారు. (‘శరీరాలు నుజ్జునుజ్జు చేసి.. ఎముకలు విరగ్గొడతాం’))

బ్రిటన్‌ వైపు డ్రాగన్‌ చూపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనాపై విరుచుకుపడుతున్న అమెరికా.. తమ దేశ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ అయిన చైనా కంపెనీలను డీలిస్ట్‌ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్‌ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్‌ సంస్థలను ఆర్థికంగా దెబ్బతీయాలనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్‌ తాజాగా ఆమోదముద్ర వేసింది. ఇక అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన డ్రాగన్‌ దేశం తదుపరి వ్యూహాలతో సమాయత్తమవుతోంది. కంట్లో నలకలా మారిన హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్‌ వైపు డ్రాగన్‌ చూస్తోంది. ఒకవేళ అమెరికన్‌ ఎక్స్చేంజీల నుంచి తమ కంపెనీలు డీలిస్ట్‌ అయినట్లయితే ప్రత్యామ్నాయంగా లండన్‌ ఎక్స్చేంజీలో కంపెనీలను లిస్ట్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. (చైనాకు అమెరికా భారీ షాక్‌..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top