బాహ్య శక్తులను ఉపేక్షించేది లేదు: చైనా

Xi Jinping Warns Who Attempts To Split China Will Perish - Sakshi

బీజింగ్‌ : చైనాను విడగొట్టాలని ప్రయత్నించే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హెచ్చరించారు. చైనా భూభాగాన్ని వశపరచుకోవాలని చూసే వారి శరీరాలను నుజ్జునుజ్జు చేసి.. ఎముకలను చూర్ణం చేస్తామని హెచ్చరికలు జారీచేశారు. కాగా గత కొన్నిరోజులుగా చైనాకు వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌లో మరోసారి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారాంతపు పర్యటనలో భాగంగా నేపాల్‌లో ఉన్న జిన్‌పింగ్‌ తరఫున చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. చైనాను విడదీసేందుకు బాహ్య శక్తులు సహాయం చేసినా వారిని కూడా ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తమ అధ్యక్షుడు హెచ్చరించినట్లు పేర్కొంది. 

కాగా తైవాన్, హాంగ్‌కాంగ్‌లను ప్రత్యేక దేశాలుగా గుర్తించడానికి చైనా నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ రెండు ప్రాంతాలు తమ భూభాగానికి చెందినవే అని బీజింగ్‌ వాదిస్తోంది. అయితే 1949లో జరిగిన పౌర యుద్ధం తర్వాత తైవాన్‌ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపింది. ఇక 2016లో సై యింగ్‌ వెన్‌ తైవాన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత చైనాలో భాగంగా తమను గుర్తించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హాంగ్‌కాంగ్‌లో సైతం తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే ఆందోళనలు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నిరసనకారులు చైనాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధనం చేసి చైనా వాణిజ్యానికి గండికొడుతున్నారు. దీంతో బాహ్య శక్తులే వెనక ఉండి నిరసనకారులను ఎగదోస్తున్నాయంటూ చైనా ఆరోపిస్తోంది. 

ఈ నేపథ్యంలో హాంగ్‌కాంగ్‌లో సైన్యాన్ని మోహరించాలని భావించింది. అలా చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయన్న ఆలోచనతో.. అక్కడి పోలీసు వ్యవస్థ ద్వారానే నిరసలను అణచివేయాలని ప్రణాళికలు రచించింది. ఇక చైనా మెయిన్‌లాండ్‌లో భాగమైన తియానన్మెన్‌ స్క్వేర్‌లో ప్రజస్వామ్యబద్ధంగా జరిగిన పోరాటాన్ని చైనా మాజీ ప్రధాని లీపెంగ్ అణచివేసిన విషయం తెలిసిందే. ఈ ఊచకోతలో భాగంగా దాదాపు వెయ్యి మందికి పైగా మృత్యువాతపడ్డారు. 1989లో జరిగిన ఈ ఘటన కారణంగా చైనాపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం హాంగ్‌కాంగ్‌ విషయంలోనూ చైనా అనుసరిస్తున్న తీరు, జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ముస్లింలను ఇంటర్మెంట్‌ క్యాంపుల్లో బంధిస్తున్న తీరుపై అమెరికా సహా ఇతర దేశాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top