బాహ్య శక్తుల ప్రమేయాన్ని సహించం: చైనా

Report Says Beijing Will Never Tolerate Taiwan Separation From China - Sakshi

తైపీ/బీజింగ్‌: తమ భూభాగం నుంచి తైవాన్‌ను వేరు చేసే ఏ చర్యను తాము ఎన్నటికీ సహించబోమని చైనా హెచ్చరికలు జారీ చేసింది. చైనా అంతర్గత వ్యవహారాలు, రాజకీయాల్లో బాహ్య శక్తుల ప్రమేయాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. తైవాన్‌ అధ్యక్షురాలిగా జనవరిలో రెండోసారి ఎన్నికైన డాక్టర్‌ త్సాయి ఇంగ్‌‌- వెన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ... ‘‘ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య విలువలకు, స్వాతంత్ర్య కాంక్షకు కట్టుబడే ఉన్నాం. బీజింగ్‌ అధికారులు చెప్పే మాటలను తైవాన్‌ ఎన్నటికీ అంగీకరించబోదు. మన సార్వభౌమత్వాన్ని కాలరాసే హక్కు ఎవరికీ ఇవ్వదు’’ అని చైనా తీరుపై విమర్శలు సంధించారు. అదే సమయంలో సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు విజ్ఞప్తి చేశారు.(‘శరీరాలు నుజ్జునుజ్జు చేసి.. ఎముకలు విరగ్గొడతాం’)

ఇక త్సాయి ఇంగ్‌-వెన్‌ వ్యాఖ్యలపై చైనా తైవాన్‌ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మా జియోగాంగ్‌ స్పందించారు. ‘‘జాతీయ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునే శక్తి మాకు ఉంది. వేర్పాటువాద కార్యకర్తలు, చైనా నుంచి తైవాన్‌ను విడదీయాలనే బాహ్య శక్తులను సహించే ప్రసక్తే లేదు. శాంతియుతమైన పునర్‌కలయికకు.. ఒక దేశం- రెండు విధానాల పద్ధతికి మేం కట్టుబడి ఉన్నాం’’అంటూ హాంగ్‌హాంగ్‌పై ఆధిపత్య చెలాయిస్తున్న తీరును తైవాన్‌లోనూ అమలు చేస్తామన్న సంకేతాలు ఇచ్చారు.

కాగా తైవాన్, హాంగ్‌కాంగ్‌లను ప్రత్యేక దేశాలుగా గుర్తించడానికి చైనా నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ రెండు ప్రాంతాలు తమ భూభాగానికి చెందినవే అని బీజింగ్‌ వాదిస్తోంది. అయితే 1949లో జరిగిన పౌర యుద్ధం తర్వాత తైవాన్‌ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపింది. ఇక 2016లో త్సాయి ఇంగ్‌‌- వెన్‌ తైవాన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత చైనాలో భాగంగా తమను గుర్తించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. (తైవాన్‌పై చైనా పెత్తనం.. భారత్‌ సాయం కావాలి!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top