యూఎస్‌ నుంచి 161 మంది వెనక్కు

United States to deport 161 Indian nationals this week - Sakshi

వారిలో ముగ్గురు తెలుగువారు

అక్రమంగా దేశంలోకి చొరబడినవారిని వెనక్కు పంపిస్తున్న అమెరికా

వాషింగ్టన్‌: అమెరికాలోకి మెక్సికో సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబడిన 161 మంది భారతీయులను ఆ దేశం ఈ వారం వెనక్కు పంపనుంది. అమెరికాలో ఉండేందుకు వారికి ఉన్న న్యాయపరమైన అవకాశాలు అన్నీ ముగిశాయని తెలిపింది. ప్రత్యేక విమానంలో వారిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు పంపించనున్నారు. ఆ 161 మందిలో హరియాణాకు చెందిన వారు 76 మంది, పంజాబ్‌కు చెందినవారు 56 మంది, గుజరాత్‌కు చెందిన వారు 12 మంది, యూపీవారు ఐదుగురు, మహారాష్ట్రవారు నలుగురు, కేరళ, తెలంగాణ, తమిళనాడు వారు ఇద్దరు చొప్పున, ఆంధ్రప్రదేశ్, గోవాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

అమెరికాలోని 95 జైళ్లలో ఉన్న 1739 మంది భారతీయుల్లో వీరు కూడా భాగమేనని నార్త్‌ అమెరికన్‌ పంజాబీ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్నామ్‌ సింగ్‌ చాహల్‌ వెల్లడించారు. అక్రమంగా ప్రవేశించిన వీరందరిని ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) అధికారులు అరెస్ట్‌ చేశారు. స్వదేశంలో వివక్షను, హింసను ఎదుర్కొంటున్నామని, అమెరికాలో తమకు ఆశ్రయం కల్పించాలని వీరిలో అత్యధికులు కోర్టును వేడుకుంటున్నా.. వారి వాదనను అమెరికాలోని కోర్టులు విశ్వసించడం లేదని చాహల్‌ తెలిపారు. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్‌లో మనుషుల అక్రమ రవాణాదారులున్నారని, వారికి అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారు యువకుల నుంచి రూ. 35 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు చేసి, అమెరికాలోకి అక్రమంగా పంపిస్తున్నారన్నారు.  2019లో 1616 మంది భారతీయులను అమెరికా భారత్‌కు పంపించింది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top