పాక్‌ మైనార్టీలపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక

United Nations Report on Pakistan Minorities - Sakshi

సాక్షి, ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇటీవల కాలంలో భారతదేశంలో జరుగుతున్న పరిణామాలతో ఇక్కడి మైనార్టీల భద్రత గురించి అనవసరంగా ఆందోళన చెందుతున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, తన దేశంలో ఉన్న మైనార్టీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. ఆర్టికల్‌ 370, 35ఏ, పౌరసత్వ సవరణ బిల్లులపై సత్వరం ట్విటర్‌లో స్పందించే ఇమ్రాన్‌, పాక్‌లోని మైనార్టీల సంరక్షణకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ విషయంలో పాక్‌ వైఖరిని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితిలోని కమిషన్‌ ఆన్‌ ది స్టేటస్‌ ఆఫ్‌ వుమెన్‌ అనే విభాగం ఈ నెలలో వెలువరించిన నివేదికలో పాకిస్తాన్‌లోని మైనార్టీల పరిస్థితిని ప్రపంచానికి తెలియజేసింది.

2017 నుంచి మతపర మైనార్టీల పిల్లలను ఇంటర్వ్యూ చేసి రూపొందించిన 47 పేజీల నివేదికలో హిందువులు, క్రిస్టియన్లు, అహ్మదీయులపై జరుగుతున్న హింసను కమిషన్‌ ప్రధానంగా ప్రస్తావించింది.  వీరిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారని, బలవంతపు మత మార్పిడిలు, బాల్య వివాహాలు, యువతుల అపహరణ వంటివి యధేచ్ఛగా కొనసాగుతున్నాయని వెల్లడించింది. వాటిని నిరోధించడంలో ఇమ్రాన్‌ సర్కార్‌ ఘోరంగా విఫలమైందని విమర్శించింది. మైనార్టీలపై మతపరమైన దాడులు చేయడానికి వివక్షతో కూడిన చట్టాలు రూపొందించి, తీవ్రవాద మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం అధికారమిచ్చిందని మండిపడింది. ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో బాలికలను బలవంతపు మత మార్పిడిలు చేయడం, ముస్లిం వ్యక్తులకు ఇచ్చి వివాహాలు చేస్తున్నారని వెల్లడించింది.

ఇలాంటి ఘటనలపై మైనార్టీలు ఫిర్యాదు చేస్తే తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని, పోలీసుల అలసత్వం, లోపభూయిష్ట న్యాయవ్యవస్థ వల్ల బాధితులకు న్యాయం అందే పరిస్థితి లేకుండా పోయిందని వివరించింది. చాలా సందర్భాల్లో కిడ్నాప్‌కు గురైన వారు తిరిగి వస్తారనే నమ్మకుం కూడా ఆయా కుటుంబ సభ్యులకు లేదని వెల్లడించింది. అలాగే దైవ దూషణ కేసులు పెరిగిపోవడంపై కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని ప్రయోగించి మైనార్టీలను చంపడమో లేక బలవంతపు మతమార్పిడి చేయడమో చేస్తున్నారని వివరించింది. మైనార్టీలు ఆర్థికంగా వెనుకబడి ఉండడం, నిరక్షరాస్యత వంటి కారణాలతో మెజార్టీ ప్రజలకు సులువుగా లక్ష్యంగా మారుతున్నారని స్పష్టం చేసింది. ముఖ్యంగా సింధ్‌, పంజాబ్‌ ప్రావిన్స్‌లో మైనార్టీల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, ఇందుకు ఉదాహరణగా సింధ్‌ ప్రావిన్స్‌లోని మీర్‌పూర్‌ఖాస్‌లో జరిగిన ఉదంతాన్ని చూపించింది.

హిందూ మతానికి చెందిన పశు వైద్యుడు రమేష్‌ కుమార్‌ మల్హి అనే వ్యక్తి ఖురాన్‌ శ్లోకాలు ఉన్న పేపర్‌లో మందులు చుట్టి ఇచ్చాడని అతని ఆస్పత్రిని నిరసనకారులు తగులబెట్టారు. అంతేకాక, చుట్టుపక్కల హిందువులకు చెందిన వ్యాపార దుకాణాలను తగులబెట్టారని పేర్కొంది. ఇలాంటి ధోరణి పాఠశాలలకు కూడా పాకిందని, మైనార్టీ విద్యార్థుల పట్ల తోటి విద్యార్థులు బెదిరించడం, ఆట పట్టించడం, అవమానపరచడం, వేరుగా కూర్చోబెట్టడం వంటివి చేస్తున్నారని తెలిపింది. వారు శారీరకంగా, మానసికంగా అనేక వేధింపులకు గురవుతున్నారని నివేదికలో పొందుపరిచింది. గత మూడు దశాబ్దాలుగా దేశంలో ఉగ్రవాదం పెరగడం, చట్టాల దుర్వినియోగం, తప్పుడు కేసుల వల్ల మతహింస దారుణంగా పెరిగిపోయిందని నొక్కిచెప్పింది.

దైవ దూషణ చట్టం, అహ్మదీయ వ్యతిరేక చట్టం లాంటివి మతపరమైన మైనార్టీలను హింసించడానికే కాకుండా రాజకీయ భవిష్యత్తుకు పునాదులుగా కూడా ఉపయోగపడుతున్నాయని వివరించింది. వీటిని అడ్డుకోవడానికి మానవ హక్కుల నేతలు ఎవరైనా కలుగజేసుకుంటే వారికీ తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేస్తున్నారని వివరించింది. ఇలాంటి ధోరణుల వల్ల సమాజంలో అసమతౌల్యత అసాధారణంగా పెరిగిపోయిందని, దీన్ని నివారించడానికి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించాలని సూచించింది. చదవండి (‘భారత్‌లాగే పాక్‌లో పౌరసత్వ బిల్లు పెట్టాలి’)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top