మల్టీప్లెక్స్‌లు కనుమరుగవుతాయా? | The end is near for cinema theater culture | Sakshi
Sakshi News home page

మల్టీప్లెక్స్‌లు కనుమరుగవుతాయా?

Jun 9 2017 2:00 PM | Updated on Aug 9 2018 7:30 PM

మల్టీప్లెక్స్‌లు కనుమరుగవుతాయా? - Sakshi

మల్టీప్లెక్స్‌లు కనుమరుగవుతాయా?

థియేటర్లకెళ్లి ఎక్కువ రేట్లకు టిక్కెట్లు కొనుక్కొని ఇరుకైన కుర్చీల్లో ఇబ్బందిగా కదులుతూ పెద్ద తెరల మీద సినిమాలు చూసే రోజులు పోతున్నాయని, ఎప్పుడైనా, ఎక్కడైనా..

న్యూయార్క్‌: థియేటర్లకెళ్లి ఎక్కువ రేట్లకు టిక్కెట్లు కొనుక్కొని ఇరుకైన కుర్చీల్లో ఇబ్బందిగా కదులుతూ పెద్ద తెరల మీద సినిమాలు చూసే రోజులు పోతున్నాయని, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా కూర్చొని తక్కువ రేట్లకు బుల్లి తెరల మీద సినిమాలు చూసే సంస్కతి పెరుగుతోందని ఆన్‌లైన్‌లో సినిమాలను అందించే ‘నెట్‌ఫ్లిక్స్‌’ చీఫ్‌ కాంటెంట్‌ ఆఫీసర్‌ టెడ్‌ సరండోస్‌ ‘ది ర్యాప్‌’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక హాలివుడ్‌లో వంద కోట్ల డాలర్లను వసూలు చేసే సినిమాలు ఉండవని, బహూశ ‘బ్యూటీ అండ్‌ బీస్ట్‌’ సినిమానే వంద కోట్ల డాలర్లు వసూలు చేసే ఆఖరి సినిమా అవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

‘బ్యూటీ అండ్‌ బీస్ట్‌’ సినిమా గత నెలలోనే వంద కోట్ల డాలర్ల మార్కును దాటింది. ఆ మాటకొస్తే గత దశాబ్దకాలంలో విడుదలైన హాలివుడ్‌ సినిమాల్లో 80 శాతం సినిమాలు వంద కోట్ల డాలర్ల మార్కును అందుకున్నాయి. వాటిలో 30 శాతం సినిమాలు వందకోట్లకు పైబడి వసూళ్లు చేశాయి. హాలివుడ్‌ సంచలన దర్శకుడు జేమ్స్‌ కేమరాన్‌ 2009లో తీసిన ‘అవతార్‌’ సినిమా 280 కోట్ల డాలర్లను వసూలు చేయగా, 2008లో తీసిన డార్క్‌నైట్‌ చిత్రం వంద కోట్ల డాలర్లను వసూలు చేసింది. 150 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసిన సినిమాల్లో టైటానిక్, స్టార్‌వార్స్‌–ఎపిసోడ్‌ 7, జురాసిక్‌ వరల్డ్, మార్వెల్స్‌ ది అవెంజర్స్, ఫ్యూరియస్‌ 7 సినిమాలు ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో కోరుకున్న సినిమాలను చూపించే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ఆన్‌లైన్‌ మూవీస్‌ నెట్‌వర్క్‌ల వల్ల థియేటర్‌ వ్యవస్థ కనుమరుగై పోతుందన్నది ఆ సంస్థల నమ్మకం. అది ఇప్పట్లో జరిగేది కాదు. సింగిల్‌ థియేటర్‌ వ్యవస్థ కూలిపోయి మల్టీప్లెక్స్‌ల సంస్కతి పెరిగిన మాట వాస్తవమేగానీ, మల్టీప్లెక్స్‌లు కూలిపోయి ఆన్‌లైన్‌ సినిమాలకు ఆదరణ అంతగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. మల్టీప్లెక్స్‌లకు వెళ్లేవారు ఒక్క సినిమాలకనే కాకుండా షాపింగ్‌కు, ఫన్‌గేమ్స్‌కు వెళతారు. అవుటింగ్‌ అన్న ఫీలింగ్‌ కోసం కూడా వెళతారు. థియేటర్లకు వెళ్లి ఓపిగ్గా కూర్చొని సినిమాలను చూడలేని వారే ఇంట్లో ఆన్‌లైన్‌ సినిమాలను ఆదరిస్తున్నారు. నిజంగా మల్టీప్లెక్స్‌ థియేటర్ల వ్యవస్థ కూలిపోతుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు సరండోస్‌ సూటిగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు.

ఇప్పటికీ మల్టీఫ్లెక్స్‌లకు ఆదరణ ఉంది కనకనే అమెజాన్‌ తాను నిర్మిస్తున్న హాలివుడ్‌ చిత్రాలను ముందుగా థియేటర్లలోనే విడుదల చేస్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌ కేవలం ఆన్‌లైన్‌ సినిమాల కోసమే తక్కువ బడ్జెట్‌తో సొంతంగా సినిమాలను నిర్మిస్తోంది. ఆన్‌లైన్‌ సినిమాల వల్ల తక్కువ బడ్జెట్‌ చిత్రాలకు ప్రోత్సాహం లభిస్తుందనడంలో సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement