‘జేమ్స్‌ బాండ్స్‌’కు స్పైబార్‌

 Spy bar In Vauxhall MI6 where! - Sakshi

 ‘ఎంఐ5, ఎంఐ6’ బ్రిటన్‌కు చెందిన రెండు గూఢచారి సంస్థలు. ఎంఐ5, అంటే మిలటరీ ఇంటలెజెన్స్‌ 5. ఇది దేశ అంతర్గత ఇంటెలిజెన్స్‌ కార్యకలాపాలకు పరిమితం కాగా, ఎంఐ6, అంటే మిలటరీ ఇంటలిజెన్స్‌ 6. అంతర్జాతీయ కార్య కలాపాలకు పరిమితం అవుతుంది. వీటిల్లో గూఢచారులుగా పనిచేసే సిబ్బంది ఎవరికి తమ వృత్తి వివరాలను వెల్లడించడానికి వీల్లేదు. చివరకు భార్యకు కూడా చెప్పరాదు. ఎవరైనా ఏదో గుమాస్తా ఉద్యోగమో చేస్తున్నట్లు చెప్పుకుంటారు. ఇక అస్తమానం విదేశాలు తిరిగే ఎంఐ6 గూఢచారులకు పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. అందుకేనేమో వారిలో ఎక్కువ మంది పెళ్ళిళ్లు చేసుకోరు. ఇంటా బయట తాము పడుతున్న పాట్ల గురించి ఎంత ఆప్త మిత్రులకైనా ఏమీ చెప్పుకోవడానికి వీల్లేదు. మరి వారు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలి ? ఎలా సేదతీరాలి? 

ఎంఐ5 గూఢాచారుల గురించి తెలియదుగానీ ఎంఐ6 గూఢాచారుల కోసం ఓ ప్రత్యేకమైన ‘స్పై బార్‌’ ఉందట. ఆ బారులోకి వెళ్లాక వారు ఏమైనా తాగవచ్చు. ఏమైనా మాట్లాడుకోవచ్చు. గోడలకు ఎలాంటి చెవులుండవట. ఈ విషయాన్ని మొట్టమొదటి సారిగా సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎస్‌ఐఎస్‌) చీఫ్‌ సర్‌ అలెక్స్‌ యంగర్‌ తెలియజేశారు. రెండు ఇంటెలిజెన్స్‌ సర్వీసులు ఎస్‌ఐఎస్‌ పరిధిలోకి వస్తాయి, ఈ స్పైబార్‌ ఎంఐ6 ప్రధాన కార్యాలయంలో ఉందని ‘సీ’ కోడ్‌ నేమ్‌తో వ్యవహరించే సర్‌ అలెక్స్‌ చెప్పారు. ఈ ప్రధాన కార్యాలయం పశ్చిమ లండన్‌లోని ‘వాక్సాహాల్‌ వంతెన’కు సమీపంలో ఉంది. 20 అంతస్తులుగల ఆ భవనంలో ‘స్పైబార్‌’ ఏ అంతస్తులో ఉందో తెలపలేదు. 

బ్రిటన్‌ ఎస్‌ఐఎస్‌ తరఫున తెరపై ‘007 జేమ్స్‌ బాండ్‌’గా కనిపించే ప్రస్తుత పాత్రధారి డేనియల్‌ క్రేగ్‌ తాగే ‘మార్టిని’ మందు ఆ స్పైబార్‌లో దొరుకుతుందో, లేదో కూడా చెప్పలేదు. థేమ్స్‌ నది ఒడ్డున ఉన్న ఈ భవనంకు సరైన భద్రత కూడా లేదని ఆ మధ్య విమర్శలు కూడా వచ్చాయి. థేమ్స్‌ నది గుండా ఓ నౌకలో వచ్చిన రష్యా గూఢాచారులు భవనంపైకి కాల్పులు జరిగినప్పుడు ఈ విమర్శలు వచ్చాయి. భవనానికి ఎక్కువ అద్దాలు ఉండడం కూడా భద్రతకు ముప్పు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top