అమెరికాతో కీలక ‘రక్షణ’ బంధం

అమెరికాతో కీలక ‘రక్షణ’ బంధం


‘గ్యాస్ టర్బైన్ టెక్నాలజీ’ ఇచ్చేందుకు యూఎస్ సుముఖత

 

♦ ద్వైపాక్షిక చర్చల్లో కీలకమలుపు: పారికర్

♦ అన్ని రంగాల్లో భారత్‌కు సాయం: కార్టర్

 

 వాషింగ్టన్: రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్-అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికాలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. ఆ దేశ రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్‌తో జరిపిన భేటీలో.. కీలక అంశాలపై అవగాహన కుదిరింది. సెన్సిటివ్ జెట్ ఇంజన్ రూపకల్పనలో భారత్‌కు ‘గ్యాస్ టర్బైన్ ఇంజన్’ సాంకేతికతను బదిలీ చేసేందుకు వీలుగా అమెరికా తన విధానపరమైన నిర్ణయాల్లో మార్పు చేసుకుంది. భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలకమైన ప్రతిష్ఠాత్మక ‘రక్షణ సాంకేతికత, వ్యాపార సంబంధం’(డీటీటీఐ)కి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం రెండు దేశాల సంబంధాలకు మైలురాయిగా నిలుస్తుందని కార్టర్ తెలిపారు. రక్షణ రంగంలో సాంకేతిక సహకారం పెంపొందించుకోవటంతోపాటు వ్యాపార అవకాశాల గుర్తింపునకు కూడా ఇది దోహద పడుతుంది. భేటీ తర్వాత పారికర్, కార్టర్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.రెండు దేశాలు రక్షణ రంగంలో పరస్పర సహకారానికి వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు పారికర్ తెలిపారు. ప్రపంచ భద్రతకు భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యమే కీలకం కానుందన్నారు. రెండు దేశాల రక్షణ శాఖల మధ్య మరింత సహకారానికి బీజం పడిందన్నారు. కాగా, భారత్‌కు అన్ని రంగాల్లో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కార్టర్ తెలిపారు. అంతకుముందు.. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ కార్యక్రమంలో పారికర్.. అమెరికా రక్షణ రంగ పరిశ్రమలతో సమావేశమయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకోసం భారత్  నిబంధనల మార్పుకు చేస్తున్న ప్రయత్నాన్ని రక్షణ రంగ పరిశ్రమ ప్రముఖులు హర్షించారు. భారత్‌తో సంయుక్తంగా ఏహెచ్-64 అపాచి హెలికాప్టర్‌ల తయారీకి సిద్ధమని ఇటీవలే బోయింగ్ సంస్థ ప్రకటించింది. భారత్‌లో ఫైటర్ జెట్‌ల తయారీ కేంద్రానికి అమెరికా కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో..  ఇందుకోసం సదరు కంపెనీలకు ముందస్తు అనుమతి ఇచ్చేందుకు పెంటగాన్ సానుకూలంగా స్పందించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top