పర్యాటకులపై నుంచి కొద్ది అడుగుల దూరంలోనే విమానం వెళ్లి రన్‌వేపై ల్యాండ్‌

Plane Landing Just a Few Feet Away from Tourists In Greece - Sakshi

గ్రీస్‌ :  పర్యాటకులపై నుంచి కొద్ది అడుగుల దూరంలోనే విమానం వెళ్లి రన్‌వేపై ల్యాండ్‌ అయిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రిటిష్‌ ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పర్యాటకుల తలలపై నుంచి అతి తక్కువ దూరంలో వెళుతూ రన్‌వేపై ల్యాండ్‌ అయింది. విమానం ల్యాండ్‌ అయ్యే సందర్భంలో కొంతమంది పర్యాటకులు మరింత దగ్గరగా చూడటానికి గోడపైకి ఎక్కడంతో గాలివేగానికి కిందపడబోయారు. ఈ సంఘటన గ్రీస్‌లోని స్కియాథోస్‌ విమానాశ్రయంలో జరిగింది. ఈ విమానాశ్రయం తక్కువ ఎత్తులో ల్యాండ్‌ అయ్యే విమానాలకు  ప్రసిద్ధి చెందింది.

స్కియాథోస్ విమానాశ్రయాన్ని ‘యూరోపియన్ సెయింట్‌ మార్టిన్’ అని పిలుస్తారు. ఇది యూరప్‌లోని అత్యంత క్రేజీ విమానాశ్రయాలలో ఒకటి. ఇక్కడ భారీ విమానాలు సైతం చిన్న రన్‌వేపై వెళ్తూ కనువిందు చేస్తుంటాయి. దీంతో ఈ దృశ్యాలను చూస్తూ, తమ వీడియోలలో బంధించడానికి వందల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. అలాగే ఇక్కడ అందమైన బీచ్‌ కూడా ఉంది. బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ తలలపై వెళ్లే విమానాలకు బైబై చెప్తూ పర్యాటకులు సరదాగా గడిపేస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకపరంగా ఉద్వేగాలకు గురిచేసే ప్రాంతంగా పేరుపొందింది. అలాగే ఇక్కడి సుందరమైన దృశ్యాలు పర్యావరణ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ‘ఈ ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ ఎత్తులో విమానాలు ల్యాండ్‌ కావడం చాలా సహజం, రన్‌వే చిన్నగా ఉండటంతోనే ఇలా జరుగుతుందని’ స్థానికులు అంటున్నారు. ఈ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అనుమతించబడిన అతిపెద్ద విమానం బోయింగ్ 757. నేడు ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తూ గ్రీసు దేశంలోని ప్రధాన పర్యాటకప్రాంతాలలో ఒకటిగా మారింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top