‘జెరూసలేం’ నిర్ణయంపై తీవ్ర నిరసనలు

Palestinians clash with Israeli troops in protests over Trump's  - Sakshi

మా వైఖరి మారదు: భారత్‌

న్యూఢిల్లీ: జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ శాంతిని ప్రమాదంలో పడేస్తుందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమై ట్రంప్‌ నిర్ణయంతో తలెత్తిన పరిణామాలను చర్చించనుంది. ట్రంప్‌ చర్య అన్యాయం, బాధ్యతారహితమని  సౌదీ అరేబియా తీవ్రస్థాయిలో ఆరోపించింది.   

ఏకపక్ష నిర్ణయం: పాలస్తీనా అథారిటీ
ట్రంప్‌ నిర్ణయం ఏకపక్ష, రెచ్చగొట్టేదిగా ఉందని, ఇది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు, అస్థిర పరిస్థితులకు కారణం కానుందని పాలస్తీనా అథారిటీ హెచ్చరించింది. ఈ మేరకు పాలస్తీనా అథారిటీ..ఐరాసలోని సర్వప్రతినిధి సభకు, భద్రతామండలికి లేఖ రాసింది. జెరూసలేం పాలస్తీనా ప్రజలకు మాత్రమే కాదు..ప్రపంచంలోని ముస్లింలందరికీ సంబంధించినదని పేర్కొంది. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఖతార్‌ అమిర్‌ షేక్‌ హమద్‌ అల్‌–తానీ ఖండించారు.

ట్రంప్‌ తన నిర్ణయాన్ని ఉప సంహరించుకుని ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పాలని పాక్‌ కోరింది. అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ పాక్‌ పార్లమెంట్‌ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించింది ట్రంప్‌ నిర్ణయంతో ఈ ప్రాంతంలో భద్రతకు విఘాతం కలుగనుందని, తీవ్ర పర్యవసానాలు తప్పవని రష్యా హెచ్చరించింది. పరిస్థితి చేయిదాటకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని కోరింది. పశ్చిమ జెరూసలేంను ఇజ్రాయెల్‌కు, తూర్పు జెరూసలేంను పాలస్తీనాకు రాజధానులుగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో రష్యా కోరుతోంది.

దీనిపై చర్చించేందుకు శుక్రవారం భద్రతా మండలి భేటీ కానుంది. జెరూసలేంపై అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం రిస్క్‌తో కూడుకున్నదంటూ పలు వార్తా పత్రికలు వ్యాఖ్యానించాయి. అసలే అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని వాషింగ్టన్‌ పోస్ట్, న్యూయార్క్‌టైమ్స్, సీఎన్‌ఎన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయి తే, చారిత్రక సత్యానికి వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా అధ్యక్షుని నిర్ణయం ఉందని ఫాక్స్‌ న్యూస్‌ పేర్కొంది.

మా వైఖరిలో మార్పులేదు:భారత్‌
పాలస్తీనాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పులేదని భారత్‌ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనపై భారత్‌ ఈ మేరకు స్పందించింది. పాలస్తీనాపై భారతదేశ వైఖరి మారబోదని, దీనిపై మూడో దేశం ప్రభావం ఉండబోదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ తెలిపారు.

నేడు భద్రతామండలి అత్యవసర సమావేశం
జెరూసలేం అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని మండలి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీ త్వరలో పాలస్తీనాలో పర్యటించనున్నట్లు భారత్‌లో ఆ దేశ రాయబారి అద్నన్‌ అలిహైజా శుక్రవారం వెల్లడించారు. అయితే పర్యటనకు సంబంధించిన వివరాలను తెలపలేదు.

పాలస్తీనా వ్యాప్తంగా ఆందోళనలు
అమెరికా నిర్ణయాన్ని నిరసిస్తూ వందలాది మంది ప్రదర్శనకారులు వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతాల్లో ప్రదర్శనలు చేపట్టారు. ట్రంప్‌ దిష్టిబొమ్మలను, అమెరికా, ఇజ్రాయెల్‌ జాతీయ పతాకాలను దహనం చేశారు. పోలీసులపై పలు చోట్ల రాళ్లు రువ్వారు. అక్కడి∙భద్రతా దళాలతో తలపడ్డారు. బెత్లహాంలో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ క్యానన్లను ప్రయోగించారు. అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా తీవ్ర సాయుధ పోరుకు సిద్ధం కావాల్సిందిగా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ప్రజలకు పిలుపునిచ్చింది. మూడు రోజులపాటు దుకాణాలు, స్కూళ్లను మూసివేయాలని పాలస్తీనా వాసులు నిర్ణయించారు. అయితే, శుక్రవారం ప్రార్ధనల అనంతరం ఆందోళనలు హింసాత్మకంగా మారవచ్చని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top