
ఇస్లామాబాద్ : ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడుల నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య యుద్ధ మేఘలు కమ్ముకున్నాయి. దాడులు, ప్రతీకార దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 72 గంటల్లో ఏమైనా జరగొచ్చంటూ పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ హెచ్చరించాడు. ‘జాగ్రత్తగా వినండి.. యుద్ధమా శాంతా అనేది ఈ 72 గంటల్లో తెలుతుంది. భారత్ - పాక్ మధ్య ఇదే అంతిమ యుద్ధం కావొచ్చు. ఒకవేళ యుద్ధమే సంభవిస్తే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే తీవ్రంగా ఉంటుంద’ని రషీద్ హెచ్చరించారు.
అంతేకాక ‘భారత్‌కు చాలా స్పష్టమైన, గట్టి సందేశం ఇస్తున్నాం. మా దేశాన్ని నాశనం చేయాలని చూస్తే.. దారుణ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. మేం తల్చుకుంటే మీ దేశంలో గడ్డి పరక కూడా మొలవదు.. పక్షులు కిచకిచలాడవు.. మీ ఆలయాల్లో గంటల కూడా మోగవు’ అని పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం భారత వాయుసేన ఉగ్రవాద శిభిరాలే లక్ష్యంగా జరిపిన మెరుపు దాడులకు దీటుగా పాక్ భారత్‌పై దాడులకు ప్రయత్నించింది. ఈ దాడులను భారత భద్రతా బలగాలు తిప్పికొట్టడంతో తోక ముడిచిన పాక్ సైన్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. (పాక్ మీడియా అసత్య ప్రచారం)