ఫుట్బాల్ స్టేడియంలో బాంబు కలకలం | Sakshi
Sakshi News home page

ఫుట్బాల్ స్టేడియంలో బాంబు కలకలం

Published Wed, Nov 18 2015 9:26 AM

ఫుట్బాల్ స్టేడియంలో బాంబు కలకలం - Sakshi

హనోవర్: స్టేడియంలో బాంబు పెట్టారన్న వదంతులతో జర్మనీ, నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ రద్దయ్యింది. స్టేడియంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తనిఖీల్లో తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంగళవారం హనోవర్ సిటీలో జర్మనీ, నెదర్లాండ్స్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. పారిస్ ఉగ్రవాద దాడులను ఖండిస్తూ స్వేచ్ఛకు ప్రతీకగా ఈ మ్యాచ్ను నిర్వహించాలని తలపెట్టారు.  49 వేల మంది సీటింగ్ సామర్థ్యం ఉన్న ఆతిథ్య స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది, జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావాల్సివుంది. మ్యాచ్ కాసేపట్లో ఆరంభం కావాల్సివుండగా స్టేడియంలో బాంబుదాడి జరగనున్నట్టు కలకలం రేగింది. పోలీసులు వెంటనే రంగంలో దిగి స్టేడియంలోని ప్రేక్షకులను బయటకు తరలించి, స్టేడియంలో క్షుణ్నంగా గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని తనిఖీల అనంతరం పోలీసులు ప్రకటించారు. ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్.. మ్యాచ్ రద్దుకావడంతో బెర్లిన్కు వెళ్లిపోయారు.

గత శుక్రవారం రాత్రి పారిస్లో జర్మనీ, ఫ్రాన్స్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం బయట ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసిన సంగతి తెలిసిందే. పారిస్లో పలు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 129 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement