
పొల్యూషన్‌కి కొత్త సొల్యూషన్
చైనా రాజధాని బీజింగ్‌లో వాహన కాలుష్యం పీక్స్‌లో ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే.
చైనా రాజధాని బీజింగ్‌లో వాహన కాలుష్యం పీక్స్‌లో ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇదెంత తీవ్రస్థాయిలో ఉంటుందంటే.. కొన్నిసార్లు ప్రభుత్వం భారీ మోటార్లు పెట్టి నీటి ఆవిరిని గాల్లోకి చిమ్మించేంత! గాల్లో కలిసిన అతిసూక్ష్మ కాలుష్య కణాలు నీటి ఆవిరిలో చిక్కుకుని నేలకు రాలిపోతాయన్నది దీని వెనుక ఉన్న ఆలోచన. సరేగానీ.. దీనికీ, పక్క ఫొటోలకూ సంబంధం ఏమిటన్నదేనా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం. ఫొటోలు చూశారుగా.. దాంట్లో సైకిళ్లు నిజం.. చుట్టూ అలుముకున్న వాహనాల పొగ కూడా వాస్తవమే.
కాకపోతే.. సైకిళ్లపై నారింజ, నీలి రంగులో కనిపిస్తున్నవి మాత్రం ఊహల రేఖలు. విషయం ఏమిటంటే.. ఈ సైకిళ్ల హ్యాండిళ్లపై ప్రత్యేకమైన యంత్రం ఒకటి ఉంటుంది. ఇది.. ముందు నుంచి వచ్చే కలుషితమైన గాలి (నారింజ రంగులో)ని పీల్చుకుని.. శుద్ధి చేసి విడుదల (నీలి రంగులో) చేస్తుంది. అరే.. అంత పెద్ద సమస్యకు ఇంత చిన్న పరిష్కారమా? అవునంటున్నాడు డాన్ రూసగార్డె! నెదర్లాండ్స్‌కు చెందిన ఈ డిజైనర్ చైనాలో చాలాకాలంగా కాలుష్యాన్ని తగ్గించే పనులు చేపడుతున్నాడు. ఒకట్రెండేళ్ల క్రితమే ఈయన బీజింగ్‌లో భారీసైజు వాక్యూమ్ క్లీనర్లను ఏర్పాటు చేశాడు. 20 – 30 అడుగుల ఎత్తున్న ఈ క్లీనర్లు.. చుట్టూ ఉన్న కలుషితమైన గాలిని శుద్ధి చేస్తాయన్నమాట. బీజింగ్‌లో ఇప్పటికే ఇలాంటి స్మాగ్ (పొగలోని కాలుష్యం) క్లీనింగ్ టవర్లు బోలెడున్నాయి. తాజాగా ఈయన ఈ టవర్లలో వాడిన టెక్నాలజీనే సైకిళ్లకు అనువుగా మార్చేశాడన్నమాట. బీజింగ్ రోడ్లపై ఒకప్పుడు బోలెడన్ని సైకిళ్లు తిరుగుతూండేవి. స్వచ్ఛమైన గాలిని అందించే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కార్లు, మోటర్‌బైక్‌లు వదిలేసి ప్రజలు మళ్లీ సైకిలెక్కుతారన్న ఆలోచనతో ఈ యంత్రాన్ని డిజైన్ చేసినట్లు డాన్ అంటున్నాడు. షింగువా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు యాంగ్, మాట్ హోప్ అనే కళాకారుడు ఈ ప్రాజెక్టులో తనకు సాయం చేశారని, నగరాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు స్మాగ్ ఫ్రీ సైకిళ్లు వినూత్న మార్గమని అంటున్నాడు. నిజమే కదా!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్