తండ్రికి మేఘన్‌ మార్కెల్‌ లేఖ

Meghan Markle Father Revealed Explosive Letter To Him From Her - Sakshi

లండన్‌ : డచెస్‌ ఆఫ్‌ ససెక్స్‌, బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ తనకు రాసిన భావోద్వేగ లేఖను ఆమె తండ్రి థామస్‌ మార్కెల్‌ బహిర్గతం చేశారు. యువరాణి హోదా పొందిన నాటి నుంచి తనకీ, తన కూతురికీ మధ్య బంధం పూర్తిగా తెగిపోయిందంటూ అనేకమార్లు థామస్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఆమె నుంచి స్పందన రాలేదని, ఈ విషయంలో కలగజేసుకోవాల్సిందిగా బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌కు కూడా అభ్యర్థించారు. ఈ క్రమంలో గత వారం ఓ మ్యాగజీన్‌ ఇచ్చిన ఇంటర్య్యూలో భాగంగా మేఘన్‌ స్నేహితులు.. థామస్‌ ఎప్పుడూ మేఘన్‌ను సంప్రదించే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో మేఘన్‌ తనకు రాసిన లేఖను థామస్‌ ఆదివారం బయటపెట్టారు. తన మెసేజ్‌లకు స్పందనగానే మేఘన్‌ ఈ లేఖ రాసిందని పేర్కొన్నారు.

నా గుండె ముక్కలు చేశావు నాన్నా!
‘నాన్నా.. బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నా. నువ్వింత గుడ్డిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. నన్ను బాధ పెట్టడానికి ఈ దారి ఎందుకు ఎంచుకున్నావు. నువ్వు నా గుండెను పది లక్షల ముక్కలు చేశావు. నువ్విలా ఎందుకు చేస్తున్నావు. మీడియాతో చెప్పినట్లుగా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే.. ఇలాంటి ఆరోపణలు ఆపెయ్‌. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతకనివ్వు. ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నా. అబద్ధాలు చెప్పడం మానెయ్‌. నాకు బాధ కలిగించడం మానెయ్‌. నా భర్తతో నాకు ఉన్న అనుబంధాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించకు. నా పెళ్లికి రాలేకపోయావెందుకు’ అని మేఘన్‌ పేరిట ఉన్న ఉత్తరాన్ని థామస్‌ మీడియా ‘డెయిలీ మెయిల్‌’ ద్వారా బహిర్గతం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ ఈ లేఖ నన్ను చాలా బాధించింది. నేను కుంగిపోయాను. ఈ లేఖను ఎవ్వరికీ చూపించలేదు. కానీ లేఖ రావడం మంచి విషయమే కదా. తను ఒక్క ఫోన్‌ చేస్తే చాలు ఇదంతా ముగిసిపోతుంది. నా కూతురు ఏదో ఒకరోజు దగ్గరవుతుందనే నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

కాగా హాలీవుడ్‌ నటి మేఘన్‌.. బ్రిటన్‌ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మే నెలలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆమె తండ్రి హాజరుకాలేదు. ఇక అప్పటి నుంచి మేఘన్‌ను మారిపోయిందంటూ ఆమె తండ్రి ఆరోపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top