‘దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి’

Meghan Markle Father Appeal For Queen Elizabeth Help To Get Touch With Daughter - Sakshi

క్వీన్‌ ఎలిజబెత్‌కు మేఘన్‌ మార్కెల్‌ తండ్రి విన్నపం

లండన్‌ : తనకి, తన కూతురికి మధ్య ఏర్పడిన ‘అగాథాన్ని’పూడ్చేందుకు బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌ చొరవ తీసుకోవాలని మేఘన్‌ మార్కెల్‌ తండ్రి థామస్‌ మార్కెల్‌ అభ్యర్థించారు. హాలీవుడ్‌ నటి మేఘన్‌.. బ్రిటన్‌ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఆమె తండ్రి హాజరుకాలేదు. ఈ క్రమంలో మేఘన్‌ పెళ్లైన నాటి నుంచి ఆమెతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని థామస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

‘మేఘన్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. తను నాకోసం క్రిస్‌మస్‌ కార్డులు పంపుతుందని ఇన్నాళ్లూ ఎదురుచూశాను. తనకు ఎన్నోసార్లు మెసేజ్‌ కూడా చేశాను. కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందనా లేదు. దయచేసి నా కూతురిని నాకు దగ్గర చేయండి. త్వరలోనే బుల్లి మేఘన్‌ లేదా బుల్లి హ్యారీ రాబోతున్నారు. కాబట్టి ఇటువంటి సంతోష సమయంలో నేను తనని కలవాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే రాణీగారు. కుటుంబంలో తలెత్తిన సమస్యలను క్వీన్‌ ఎలిజబెత్‌ పరిష్కరిస్తారనే నమ్మకం ఉంది. రాజ కుటుంబంలోనైనా, సాధారణ కుటుంబాల్లోనైనా కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటేనే సంతోషం కదా. నా బాధను అర్థం చేసుకోండి’ అంటూ థామస్‌ మార్కెల్‌ సోమవారం ఎలిజబెత్‌కు విన్నవించారు.

కాగా యువరాణి హోదా పొందిన నాటి నుంచి తన కూతురి మోముపై చిరునవ్వు మాయమైందంటూ థామస్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘నా కూతురి నవ్వు ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనం నుంచి తన నవ్వుని చూస్తున్నాను. ఇప్పుడు ఆమె మొహంలో కనిపించే చిరునవ్వు నిజమైనది కాదు. ఆ చిరునవ్వు వెనక ఎంతో బాధ ఉంది’ అది నాకు స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక ‘మేఘన్‌కు వివాహం అయిన నాటి నుంచి ఆమెతో మాట్లాడలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. స్వయంగా కలుద్దామంటే ఆమె చిరునామ నా దగ్గర లేదు’ అని ఆయన కంటతడి పెట్టారు. ఇక ఈ విషయంపై క్వీన్‌ ఎలిజబెత్‌ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top