
ప్రయాణం.. కొందరికి అవసరం, మరికొందరికి సరదా.. కానీ కొంతమందికి మాత్రం అది ప్యాషన్. గేదెల జయరాజ్ ఇలాంటి కోవకే చెందుతాడు. అతనికి ట్రావెలింగ్‌పై ఉన్న ఇష్టంతో ఇప్పటికే ఎన్నో ప్రదేశాలు చుట్టొచ్చాడు. కానీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ పోటీ ‘ఫాల్‌రవెన్ పోలార్’లో పాల్గొనాలన్నది ఆయన లక్ష్యం. ‘ఫాల్‌రవెన్ పోలార్’ అనేది అంతర్జాతీయ ట్రావెలింగ్ పోటీ. ఈ పోటీకి వందకు పైగా దేశాల్లోనుంచి వేలల్లో ఎంట్రీలు వస్తే కేవలం పది మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఇలాంటి పోటీకి వెళ్లాలని రెండేళ్ల క్రితమే కంకణం కట్టుకున్న వ్యక్తి జయరాజ్ గేదెల.
మీరూ ఓటు వేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి - Vote For 'Jayaraj Gedela'
పైసా లేకుండా ప్రయాణం
జయరాజ్ స్వస్థలం వైజాగ్. అతనికి ఉన్న దృష్టిలోపాన్ని చూసి తోటి విద్యార్థులు హేళన చేసేవారు. కానీ అతను అవన్నీ పట్టించుకోకుండా చదువుపై ఏకాగ్రత పెంచుకుంటూ పదవ తరగతిలో స్కూలు టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌లోనూ ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయ్యాడు. అయితే ఇంటర్ మిత్రుడు పవన్ పప్పల ట్రావెలింగ్‌ను పరిచయం చేయడంతో అతని జీవితం మలుపు తిరిగింది. ప్రయాణంపై ఉన్న ఆసక్తితో 2014లో మొదటిసారి హిప్పీ ట్రావెలింగ్ చేశాడు. వెంట పైసా తీసుకెళ్లకుండా ప్రయాణం చేయడమే హిప్పీ ట్రావెలింగ్. విశాఖ నుంచి కాశీ వరకు ఖాళీ జేబుతోనే ప్రయాణించాడు. జీవితంలో ట్రావెలర్ బ్లాగర్‌గా స్థిరపడాలన్నది అతని కోరిక. అంతకన్నా ముందు ఫాల్‌రవెన్ పోలార్ పోటీకి వెళ్లాలన్నది అతని మరో లక్ష్యం. ఈ పోటీలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతాయి. ఈ పోటీలో కొన్నిసార్లు -30, -50 డిగ్రీల ఉష్ణోగ్రతనూ తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది.
ఈసారైనా...
ఈ పోటీలో పాల్గొనేందుకు జయరామ్ గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖులు సమంత, వరుణ్‌తేజ్, సుకుమార్ ఇలా చాలామందే సోషల్ మీడియాలో ఆయనకు మద్దతు పలికారు. అయినప్పటికీ చివరి నిమిషంలో అతడికి అవకాశం చేజారింది. కనీసం ఈ సారైనా జయరామ్‌కి ఓటేసి గెలిపిస్తే భారతదేశం తరపున ఓ వ్యక్తి అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పోటీలకు ఆఖరి గడువు నేటితో ముగియనుండటంతో ట్విటర్‌లో #VoteForJayaraj అనే హ్యాష్‌ట్యాగ్‌ను హోరెత్తిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఓట్ల ప్రకారం జయరాజ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. కేరళకు చెందిన అష్రఫ్ అలీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇంకెందుకాలస్యం.. మీరు జయరాజ్‌కు ఓటు వేయాలనుకుంటే ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి - http://bit.ly/voteforjayaraj