25 సెకన్లు.. క్షమాపణ చెప్పించాయి!

Japanese train departs 25 seconds early - Sakshi

జపాన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో ఘోరం జరిగింది. ఓ రైలు ప్లాట్‌ఫాం మీదికి వచ్చింది.. ప్రయాణికులు ఎక్కారు.. రైలును లొకోపైలట్‌ ముందుకు కదిపాడు.. ప్లాట్‌ఫాం నుంచి వెళ్లిపోయింది. మరి ఇందులో అంత ఘోరం ఏముంది? అనుకుంటున్నారా.. సాధారణంగా ఏ దేశంలోనైనా ఇలాగే జరుగుతుంది కదా.. జపాన్‌లో ఏమైనా తేడాగా జరుగుతుందా అని అవాక్కవుతున్నారా? ఇందులో ఘోరం ఏంటో తెలుసా.. ఆ రైలును లొకోపైలట్‌ నిర్ధిష్ట సమయం కన్నా 25 సెకన్లు ముందు తీసుకెళ్లాడు.

నిజంగా 25 సెకన్లే.. 25 నిమిషాలు కాదు.. అది అక్కడ జరిగిన ఘోరం.. ఏంటీ రైలు 25 సెకన్లు ముందు వెళితే ఘోరం ఏంటి అని మళ్లీ ఆశ్చర్యపోకండి. జపాన్‌లో రైళ్లు సమయపాలనకు మారుపేరు. అక్కడ సెకన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అసలేం జరిగిందంటే.. రైలు వెళ్లాల్సిన సమయం 7.12 గంటలకు.. అయితే లొకోపైలట్‌ 7.11 గంటలకు అనుకున్నాడు. దీంతో సరిగ్గా 7.11 గంటలకు రైలును స్టార్ట్‌ చేసి 7.11.35 సెకన్లకు ప్లాట్‌ఫాం నుంచి రైలు తలుపులు మూసేసి వెళ్లిపోయాడు.

అంటే 25 సెకన్లు ముందుగా వెళ్లిపోయాడు. దీంతో ఓ ప్రయాణికుడు ఆ రైలును అందుకోలేకపోయాడు. పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపించగా.. లొకోపైలట్‌ తప్పిదం నిరూపణ అయింది. పశ్చిమ జపాన్‌ రైల్వే అధికారులు ఆ ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని క్షమాపణలు చెప్పింది. అయితే గతేడాది నవంబర్‌లో కూడా 20 సెకన్ల ముందే ఓ రైలు వెళ్లిపోయినప్పుడు కూడా రైల్వే శాఖ క్షమాపణలు చెప్పింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top