ఇండోనేసియాలో ఉగ్రదాడి

isis attacks in indonesia - Sakshi

మూడు చర్చిలపై ఆత్మాహుతి దాడులు

13 మంది మృతి, 41 మందికి గాయాలు

బాధ్యత ప్రకటించుకున్న ఐసిస్‌  

సురబయ: ఇండోనేసియాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన సురబయలోని మూడు చర్చిలపై ఆత్మాహుతిదళ ఉగ్రవాదుల దాడిలో 13 మంది మృతిచెందగా.. 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ మహిళ, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఇండోనేసియాలో మైనారిటీలైన క్రిస్టియన్‌లపై కొంతకాలంగా దాడులు జరుగుతున్నప్పటికీ.. 2000 తర్వాత వీరిపై ఉగ్రదాడి జరగటం ఇదే తొలిసారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. సురబయలోని సాంటామారియా రోమన్‌ కేథలిక్‌ చర్చిపై ఉదయం 7.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) తొలిదాడి జరిగింది. ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులతోపాటు నలుగురు మృతిచెందారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే సమీపంలోని క్రిస్టియన్‌ చర్చ్‌ ఆఫ్‌ డిపొనెగొరోలో రెండో ఉగ్రదాడి జరిగింది. వెంటనే మాంగెరలోని పెంతెకోస్ట్‌ చర్చ్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఘటన గురించి తెలియగానే ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సురబయ చేరుకుని బాధితులకు అందుతున్న వైద్యసేవలను సమీక్షించారు.  ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐసిస్‌ పేర్కొంది.

ఉగ్రవాదులంతా ఒకే కుటుంబం వారే
ఈ మూడు దాడుల్లో ఆరుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. దాడులకు పాల్పడిన ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని.. ఇందులో ఇద్దరు బాలికలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు కూతుళ్లు (9, 12 ఏళ్లు), ఇద్దరు యువకులు ఈ దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. ఈ కుటుంబమంతా ఇటీవలే సిరియానుంచి తిరిగి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది.  

నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత
ఆదివారం తెల్లవారుజామున వెస్ట్‌ జావా టౌన్స్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు కాల్చిచంపారు. మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు నిరసనగానే దాడి జరిగి ఉంటుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అరెస్టయిన వారు ఇండోనేసియాలో దాడులకు పాల్పడుతున్న జేఏడీ సభ్యులని సమాచారం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top