ఆయన వంట తింటే వదలరు.. కాని ఇకలేరు

greatest funeral to pope of cuisine - Sakshi

పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అంటారు. కానీ ఎన్ని జిహ్వలకైనా సరే.. ఒకసారి పాల్‌ బొక్యూజ్‌ వంట రుచి చూశారంటే ఇక జీవితాంతం విడిచిపెట్టరు. అంతటి అద్భుత ఫ్రెంచ్‌ వంటగాడైన పాల్‌ జనవరి 20న కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన వయసు 91 ఏళ్లు. అయితే, ఆయనకు శిష్య బృందం ఘన వీడ్కోలు పలికింది. అందుకుగాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు పదిహేను వందలమంది శిష్యులు చెఫ్‌ యూనిఫాంలో హాజరయ్యారు. పాల్‌ బొక్యూజ్‌ను శతాబ్దికి వంటగాడని అంటారు. ఆయన ప్రపంచమంతటికి సుపరిచితుడే. పలుచోట్ల మనకు కనిపిస్తున్న క్విజైన్‌ రెస్టారెంట్‌లకు రూపకల్పన చేసిన వ్యక్తి కూడా ఆయనే. ఎలాంటి ఆహార పదార్థాలతోనైనా రుచిగా, విభిన్నంగా వండటం పాల్‌కు వెన్నతో పెట్టిన విద్య.
 

పాల్‌ కుటుంబానికి కూడా వంటలు చేసే చరిత్ర ఉంది. 1765 నుంచీ వారు వంటనే ప్రధాన వృత్తిగా ఎంచుకుని  ఎన్నో కొత్త రుచులను ఆవిష్కరించారు. 1926లో ఇదే కుటుంబంలో జన్మించిన పాల్‌ను ఫ్రెంచ్‌ ప్రభుత్వం పలు సత్కారాలతో గౌరవించింది. వేలమందికి తన వృత్తిలోని మెలకువలను నేర్పి జీవనోపాధి కల్పించారు. ఆయన వంటలకు ఎన్నో దశాబ్దాల నుంచి మూడు నక్షత్రాల గుర్తింపు ( త్రీస్టార్‌ రేటింగ్ ‌) ఉంది. పాల్‌ మంచి చమత్కారి కూడా. అందుకు ఉదాహరణగా చెప్పాలంటే ఆయన చివరి కాలంలో వచ్చిన ఓ పుస్తకంలో 'నాకు మూడు నక్షత్రాల రేటింగ్, మూడు బైపాస్‌ సర్జరీలు, ముగ్గురు భార్యలు' అని పేర్కొన్నారంటే ఎంతటి చతురులో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top