ఫిన్‌ల్యాండ్‌ కేబినెట్‌లో 12 మంది మహిళలు | Sakshi
Sakshi News home page

ఫిన్‌ల్యాండ్‌ కేబినెట్‌లో 12 మంది మహిళలు

Published Thu, Dec 12 2019 1:33 AM

Finland PM Sanna Marin becomes worlds youngest PM - Sakshi

హెల్సింకి: ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్‌ల్యాండ్‌ ప్రధాని సన్నా మారిన్‌ తన కేబినెట్‌లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్‌లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30–35 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఆమె కేబినెట్‌లో ఏడుగురు పురుషులు కూడా ఉన్నారు. ఆర్థికం, విద్య, అంతర్గత వ్యవహారాలు వంటి ముఖ్యశాఖలన్నీ మహిళలకే అప్పగించారు. 34 ఏళ్ల వయసున్న సన్నా మారిన్‌ మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కొని నెగ్గారు. మారిన్‌కు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 70 ఓట్లు వచ్చాయి. ఫిన్‌ల్యాండ్‌లో అధికారంలో ఉన్న సెంటర్‌ లెఫ్ట్‌ సంకీర్ణ సర్కార్‌ను నడపడం ఆమె ముందున్న అతి పెద్ద సవాల్‌. ‘‘మర్యాద మన్ననల మధ్య ప్రతీ చిన్నారి ఎదుగుదల ఉండాలి. ఎవరైనా ఏదైనా సాధించేలా సమాజాన్ని నిర్మించడమే నా ధ్యేయం‘‘అని మారిన్‌ ట్వీట్‌ చేశారు. దేశంలో పోస్టల్‌ సమ్మెను ఎదుర్కోవడంలో విఫలమైనందుకు గతవారంలో అంటి రిన్నె ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మారిన్‌ పగ్గాలు తీసుకున్నారు. సెంటర్‌ పార్టీకి చెందిన కత్రి కులుమణి (32)కి ఆర్థిక శాఖ, గ్రీన్‌ పార్టీ నాయకురాలు మారియా ఒహిశాలో (34)కు అంతర్గత వ్యవహారాలు, లెఫ్ట్‌ కూటమి చైర్‌వుమెన్‌ లీ అండెర్సన్‌ (32)కు విద్యాశాఖ అప్పగించారు. కార్మికుల అసంతృప్తి జ్వాలలు, ఎటు చూసినా సమ్మెలు నడుస్తున్న వేళ ప్రధానిగా మారిన్‌ తన ఎదుట ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
 

Advertisement
 
Advertisement