ఇద్దరు మహిళా రిపోర్టర్లపై ట్రంప్‌ ఆగ్రహం

Donald Trump Clash With Reporters in Media Briefing - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి దుందుడుకు వైఖరి ప్రదర్శించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరు మహిళ రిపోర్టర్లపై ఆయన ఆగ్రహం ప్రదర్శించారు. అందులో ఒక రిపోర్టర్‌ కరోనా వైరస్‌ టెస్ట్‌ల గురించి ప్రశ్నించగా.. మరో రిపోర్టర్‌ అసలు ట్రంప్‌ను ఎలాంటి ప్రశ్న కూడా అడగలేదు. వివరాల్లోకి వెళితే.. కరోనా పరిస్థితులకు సంబంధించి వైట్‌హౌస్‌ రోస్‌ గార్డెన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ఆయన పలువురు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. (చదవండి : ఆగస్టు నాటికి లక్షా 35 వేల కరోనా మరణాలు!)

ఈ సందర్భంగా సీబీసీ న్యూస్‌ కరస్పాండెంట్‌ వీజియా జియాంగ్.. కరోనా టెస్ట్‌ల గురించి ట్రంప్‌ను ప్రశ్నించారు. చైనీస్‌ అమెరికన్‌ అయిన వీజియా.. ‘కరోనా టెస్ట్‌ల విషయంలో అమెరికా అన్ని దేశాలకంటే మెరుగ్గా ఉందని పదేపదే ఎందుకు చెబుతారు?. ఇది చాలా ముఖ్యమైన అంశమా?. ప్రపంచదేశాలతో ఎందుకు పోటీ పడతారు? ప్రతి రోజు ఎంతో మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి’ అని అడిగారు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ ప్రపంచంలోని ప్రతి చోట ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని బదులిచ్చారు. ఆ ప్రశ్న తనను కాదని.. చైనాను అడిగితే బాగుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి : 5 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులు చనిపోతారు!)

అయితే వీజియా ట్రంప్‌ మాటలను తేలికగా తీసుకోలేదు.. ఇది తనకే ఎందుకు చెబుతున్నారని తిరిగి ప్రశ్నించారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పలేదని.. తనను చెత్త ప్రశ్నలు అడిగే వాళ్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఇదేమీ చెత్త ప్రశ్న కాదని వీజియా వాదనకు దిగారు. ఈలోపే ట్రంప్‌ ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయ అంటూ.. మిగతా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో వీజియా తర్వాత వరుసలో ఉన్న సీఎన్‌ఎన్‌ రిపోర్టర్‌..  కైట్లాన్ కాలిన్స్ ట్రంప్‌ను ప్రశ్నించేందుకు ముందుకువచ్చారు. తను రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నట్టు ఆమె చెప్పారు.  అయితే ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగానే కాలిన్స్‌ను ప్రశ్నలు అడగనివ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top