యూకేలో భారతీయ సంతతి వైద్యుడు మృతి

Coronavirus: Indianorigin heart surgeon dies in UK - Sakshi

 హృద్రోగ నిపుణుడు జితేంద్ర రాథోడ్ కన్నుమూత

లండన్ : ప్రముఖ హృద్రోగ నిపుణుడు, భారతీయ సంతతికి చెందిన డాక్టర్‌ జితేంద్ర కుమార్‌ రాథోడ్ కరోనా వైరస్‌ సోకి కన్నుమూశారు. హృద్రోగ నిపుణుడిగా, బ్రిటన్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ లో సుదీర్ఘ కాలంగా అసోసియేట్‌ స్పెషలిస్ట్‌ గా విధులు నిర్వహిస్తూ, ఎందరో ప్రముఖులకు వైద్య సేవలందించిన డాక్టర్‌ జితేంద్ర కుమార్‌ రాథోడ్‌, కరోనా వైరస్‌ కారణంగా మంగళవారం ఉదయం మరణించారు. ఇదొక దుర్వార్త. కార్డియో థారోసిక్‌ సర్జరీలో ఎంతో అనుభవజ్ఞులైన జితేంద్ర ఇక లేరంటూ కార్డిఫ్‌ అండ్‌ వేల్స్ యూనివర్శిటీ హెల్త్‌ బోర్డు ఆయన మరణాన్ని దృవీకరించింది. వేల్స్‌ లోని యూనివర్శిటీ హాస్పిటల్‌ లో ఆయన తుది శ్వాస విడిచారని ప్రకటించింది.

1977లో బాంబే యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసించిన జితేంద్ర కుమార్‌, ఆపై యూకే కు వెళ్లి, వైద్య రంగంలో దశాబ్దాల పాటు సేవలందించారు. ఇటీవల ఆయనకు కరోనా వైరస్‌ సోకగా, జనరల్‌ ఇన్టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ లో ఉంచి చికిత్సను అందించారు. తన వద్దకు వచ్చే రోగులకు చికిత్సను అందించడంలో ఎంతో శ్రధ్ధను జితేంద్ర చూపించేవారని, ఆయన వద్దకు వచ్చి వెళ్లే వారంతా తదుపరి ఎంతో గౌరవాన్ని చూపించేవారని వర్శిటీ వ్యాఖ్యానించింది. జితేంద్రకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. యూకే లో సుమారు 15 లక్షల మంది భారత సంతతి ఉండగా, వైద్య విభాగంలో ఎంతో మంది సేవలందిస్తున్నారు. కాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో చికిత్స పొందుతున్నారు. యూకేలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య 51 వేలను అధిగమించగా, మరణించిన వారి సంఖ్య 5,373 కు చేరింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top