
బీజింగ్: ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్ధతతో ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీకి విధేయంగా ఉంటూ, యుద్ధాలు గెలవడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇటీవల ముగిసిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్(సీపీసీ) జిన్‌పింగ్‌కు తిరిగి అధ్యక్ష పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో ఆయన గురువారం రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ సీనియర్ మిలిటరీ అధికారులతో సమావేశమయ్యారు.
సైన్యంలో సంస్కరణలు అమలుచేయడంతో పాటు, వినూత్న విధానాలు అవలంబించాలని సైనికాధికారులకు సూచించారు. చట్టాలు, నియంత్రణలకు లోబడి కఠిన ప్రమాణాలతో సైన్యాన్ని ముందుకు నడిపించాలని దిశానిర్దేశం చేశారు. మిలిటరీలో పార్టీని పటిష్టం చేయాలని, యుద్ధ సన్నద్ధతకు సంబంధించి కసరత్తులను తీవ్రతరం చేయాలని కోరారు. సైన్యం భవిష్యత్ ప్రణాళికలకు ఎదురవుతున్న వ్యూహాత్మక సమస్యలను పరిష్కరించాలని సూచించారు.