భద్రత అనుకుంటే.. చుక్కలు చూపించాయి..!

8 Year Old Girl Bedroom Security Camera Hacked Man Harassed Her - Sakshi

మిస్సిస్సిపి : భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ కెమెరాలు ఓ కుటుంబానికి చుక్కలు చూపించాయి. తమ చిన్నారి కూతుళ్ల రక్షణ కోసం వారి బెడ్‌రూమ్‌లో ఏర్పాటు చేసిన రింగ్‌ సెక్యురిటీ కెమెరాలు ఆ తల్లిదండ్రులకు పీడకలను మిగిల్చాయి. వారం క్రితం జరిగిన ఈ సంఘటన అమెజాన్‌ కంపెనీకి చెందిన రింగ్‌ సెక్యురిటీ కెమెరాల్లోని లోపాల్ని బయటపెట్టింది. వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. ఎనిమిదేళ్ల అలీసా మే(8) నిద్రించేందుకు తన గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఏవో వింతైనా శబ్దాలు, మ్యూజిక్‌ వినపడసాగింది. అయితే, తన చెల్లెల్లు ఆ గదిలోకి చేరి ఆమెను ఆటపట్టిస్తున్నారని తొలుత ఆమె భావించింది. అయితే, కాసేపటి తర్వాత ఆ గదిలో ఓ మగ వ్యక్తి.. ‘హలో ఎవరైనా ఉన్నారా’ అని వినిపించడంతో చిన్నారి ఉలిక్కిపడింది.

కానీ, గదిలో ఎవరూ కనిపించడం లేదు. ఆ కనిపించని వ్యక్తి వ్యక్తి జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. లైంగికంగా వేధించాడు. తీవ్ర భయాందోళనకు గురైన అలీసా సాయం కోసం తన తల్లి యాష్‌లీ మేని పిలిచింది. కానీ, ఆమె అందుబాటులో లేదు. తండ్రి కూడా ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అయితే, తన కూతురు రూమ్‌లోని కెమెరా హ్యాక్‌కు గురైందని అలీసా తండ్రికి సమచారం వెళ్లడంతో అతను అలర్ట్‌ అయ్యాడు. కెమెరా ప్లగ్‌ను తొలగించమని అలీసాకు కాల్‌ చేసి చెప్పాడు. దీంతో కెమెరా ప్లగ్‌ తొలగించిన అలీసా ఆ గది నుంచి బయటికొచ్చి తల్లితో విషయమంతా చెప్పింది.

చెప్పుకోలేని భాష..
కూతుళ్ల భద్రత కోసం కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే తమకు చేదు అనుభవం ఎదురైందని అలీసా మే తల్లి వాపోయారు. హ్యాకర్‌ చిన్నారి పట్ల అసభ్యకరంగా మాట్లాడాడని యాష్‌లీ వాపోయింది. జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడమే కాకుండా చిన్నారిపై లైంగింక వేధింపులకు దిగాడని ఆరోపించింది. రింగ్‌ సెక్యురిటీ కెమెరా పనితీరుపై ఆమె విమర్శలు గుప్పించింది. హ్యాకర్‌ జుగుప్సాకర వ్యాఖ్యలతో కూడిన వీడియోతో పోలీసులను సంప్రదిస్తామని తెలిపింది. రింగ్‌ కెమెరాల వల్ల ఇటీవల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని యాష్‌లీ వెల్లడించింది. అయితే, ఇరువైపులా సమాచారం బదిలీ చేసుకోవడం, మాట్లాడుకునే వెసులుబాటు ఉండటంతో ఆఫీస్‌లో ఉన్నప్పుడు తన పిల్లలను మానిటరింగ్‌ చేసే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇక కస్టమర్ల నమ్మకం, భద్రతే తమ ప్రాధాన్య అంశమని, లోపాల్ని సరిచేస్తామని రింగ్‌ కెమెరా ప్రతినిధులు వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top